- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
IAS Mallikarjuna: వివాదాల సుడిలో విశాఖ కలెక్టర్
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ కలెక్టర్ మల్లిఖార్జున భూవివాదాలు, అసైన్డ్ భూముల అనుమతులతో విశాఖ విలన్‌గా మారిపోయారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన జిల్లాల్లో ఒకటైన విశాఖకు సీనియర్లు, నిజాయితీ పరులైన ఐఏఎస్‌లను నియమించడం ఆనవాయితీగా వస్తోంది.
అందుకు విరుద్ధంగా వచ్చిన కడప జిల్లాకు చెందిన మల్లిఖార్జున పలు వివాదాలతో అపఖ్యాతి మూటు కట్టుకొంటున్నారు. ఉద్దండులైన, పైసా అవినీతి లేని ఎందరో సీనియర్ ఐఏఎస్ అధికారులు విశాఖలో ఇంతకాలం కాపాడుకొంటూ వచ్చిన వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను, ఆస్తులను మూడో కంటికి తెలియకుండా ప్రస్తుత కలెక్టర్ మల్లిఖార్జున ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేసి విశాఖకు తీరని ద్రోహం చేశారనే అభిప్రాయం విపక్షాల్లోనే కాదు.. ప్రజల్లోనూ వ్యక్తం అవుతోంది.
అప్పుడు విజయసాయి సేవలో..
వైసీపీ ఉత్తరాంధ్రా ఇన్చార్జిగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి నేతృత్వంలో విశాఖలో రూ.30 వేల కోట్ల భూ దందాలు జరిగాయని పదేపదే తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో 80 శాతం భూ లావాదేవీలకు రెవెన్యూ పరంగా అనుమతులు ఇచ్చిందీ, 22ఏ సడలింపు ఇచ్చింది మల్లిఖార్జునే కావడం గమనార్హం.
అంతకుముందు కలెక్టర్‌గా పనిచేసిన వినయ చంద్ నిబంధనల మేరకు వ్యవహరించడంతో ఆయనను తప్పించి మల్లిఖార్జునను వైసీపీ పెద్దలు తీసుకొచ్చారు. దసపల్లా భూములతో ప్రారంభమై తాజాగా వెలుగులోకి వచ్చిన అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ కుంభకోణంలో ఆయన ప్రతిష్ట అధ:పాతాళానికి పడిపోయింది.
దసపల్లాలో ప్రారంభం
విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న దసపల్లా భూములు స్వాతంత్ర్యం వచ్చి, ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి యూఎల్‌సీ మిగులు భూములుగా ప్రభుత్వ ఆధీనంలోనే వున్నాయి. అందులోనే రాష్ర్టపతి బస చేసే సర్య్కూట్ హౌస్, నావికాదళ వైస్ అడ్మిరల్ నివాస సముదాయం వంటివి వున్నాయి. 2005లో ప్రవీణ్ ప్రకాష్ విశాఖ కలెక్టర్‌గా పనిచేసినప్పుడు దసపల్లా స్థలాన్ని ఎమ్మెల్యేల గృహ సముదాయానికి ఇచ్చేందుకు ప్రతిపాదనలు కూడా పంపారు.
ఆ తరువాత వచ్చిన లవ్ అగర్వాల్ సమయంలో తప్పుడు కేసులతో ప్రైవేటు వ్యక్తులు హక్కు సంపాదించగా సకాలంలో అప్పీలుకు వెళ్లకుండా లవ్ అగర్వాల్ వారితో కుమ్మక్కై అవకాశాన్ని చేజార్చారు. అయితే ఆ తరువాత వచ్చిన అత్యంత నిజాయితీ పరుడైన కలెక్టర్ శేషాద్రి సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసి, ఈ భూములను 22ఏ లో పెట్టి కాపాడారు.
ఆ తరువాత వచ్చిన కలెక్టర్‌లు ఎవ్వరూ ఈ భూములను 22ఏలో నుంచి తీసే సాహసం చేయలేదు. వైసీపీ నేతల ఒత్తిడితో మల్లిఖార్జున 2022లో రహస్యంగా ఆ పని చేసేశారు. రెండు వేల కోట్ల విలువైన దసపల్లా స్థలం ఆ రకంగా పూర్తిగా ప్రైవేటు పరమైంది.
హయగ్రీవాకు ఎసరు
వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో సాగర్ నగర్‌లో అత్యంత విలువైన పది ఎకరాలను అనాథ శరణాలయం, వృద్ధుల గృహాల నిర్మాణం కోసం కారు చౌకగా హయగ్రీవ అనే సంస్థకు కేటాయించారు. అయితే పదేళ్లు అయినా అక్కడ ఆ సంస్థ ఒప్పందం మేరకు నిర్మాణాలు చేయకపోవడంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కమిటీ వేసి భూ కేటాయింపులు రద్దు చేసే ప్రయత్నం చేశారు.
కోర్టులో హయగ్రీవ సంస్థ స్టే పొంది కాలక్షేపం చేస్తున్న సమయంలో మల్లిఖార్జున కలెక్టర్‌గా వచ్చిన తరువాత ఆ స్థలాన్ని వైసీపీకి చెందిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు బదిలీ చేసేందుకు మార్గం సుగమం చేశారు. దీనిపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో కేసు వేయగా, కలెక్టర్ హోదాలో మల్లిఖార్జున తన అభిప్రాయం చెప్పకుండా, ఒప్పంద ఉల్లంఘన అనే మాట మాట్లాడకుండా ఆ స్థలం రియల్ ఎస్టేట్‌గా మారడానికి కారకుడయ్యారు.
ముదపాకలో కలెక్టర్‌పై కలెక్టర్‌కే ఫిర్యాదు
పెందుర్తి నియోజక వర్గం పరిధిలోని ముదపాకలో అత్యంత వివాదాస్పదమైన దళితుల ల్యాండ్ పూలింగ్ భూముల వ్యవహారంలో హైకోర్టు పదే పదే కలెక్టర్ మల్లిఖార్జునను తప్పు పట్టింది. దళితుల భూముల హక్కులను తప్పుడు పత్రాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన జల విహార్ రామరాజుకు కట్టబెడుతూ కలెక్టర్ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది. చివరకు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి హాజరైన ముదపాక దళితులు విశాఖ కలెక్టర్‌పై కలెక్టర్‌కే ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించారు.
700 ఎకరాలకు పైగా దళిత భూములకు అనుమతులు
తాజాగా దళిత భూములకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు మంజూరు చేసి అమ్ముకొనే అవకాశం కల్పించే వివాదాస్పద జీవో 596 క్రింద కలెక్టర్ మల్లిఖార్జున నేతృత్వంలో 700 ఎకరాలకు పైగా అన్యాక్రాంతమయ్యాయి. మిగిలిన కలెక్టర్ల కంటే తక్కువగా కేవలం 700 ఎకరాలకే అనుమతులిచ్చానని ఆయన గొప్పగా చెప్పుకొన్నారు కూడా. అయితే, ఈ భూములన్నీ అత్యంత ఖరీదైన విశాఖలోనివన్న వాస్తవాన్ని ఆయన విస్మరించారు.
దళితులు చేసుకొన్న దరఖాస్తుల ఆధారంగా కాకుండా అమ్మకానికి ఒప్పుకొన్న వారి వివరాలను బ్రోకర్ల ద్వారా తెప్పించుకొని వాటికి మాత్రమే అనుమతులను మల్లిఖార్జున ఇచ్చారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈ భారీ కుంభకోణం వెనుక వున్నారనే ఆరోపణలు వచ్చిన తరువాత కూడా ఎటువంటి జంకూ లేకుండా మల్లిఖార్జున అనుమతులు మంజూరు చేస్తూ సాటి ఐఏఎస్‌లనే ఆశ్చర్య పరుస్తున్నారు.
అబీద్ హుస్సేన్ పరంపర ఏదీ?
అబీద్ హుస్సేన్ కలెక్టర్‌గా విశాఖకు సేవలందించినందుకు ఆయన పేరిట ఏకంగా విశాఖ వాసులు కాలనీనే ఏర్పాటు చేశారు. ఆయన కూడా అందుకు అనుగుణంగా తన కుమార్తెకు విశాఖ అని పేరు పెట్టుకొన్నారు. ఆ తరువాత అర్జునరావు, కేవీరావు, ఎస్వీ ప్రసాద్, శేషాద్రి, యువరాజ్‌ల వంటి కలెక్టర్ లు విశాఖకు సేవలందించి, భూములను, ప్రభుత్వ ఆస్తులను కాపాడి విశాఖ వాసుల మదిలో వుండిపోయారు.
వీరందరికీ భిన్నంగా పదివేల కోట్ల రూపాయల విలువైన భూములు, ఆస్తులను ప్రైవేటు పరం చేసి ప్రస్తుత కలెక్టర్ మల్లిఖార్జున ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు విశాఖ విలన్‌గా మిగిలిపోనున్నారు.