BRS విస్తరణలో కాంగ్రెస్ కీలక నేత.. కేసీఆర్ కోసం ఢిల్లీలో లాబీయింగ్ షురూ!?​

by Nagaya |   ( Updated:2022-12-26 02:38:29.0  )
BRS విస్తరణలో కాంగ్రెస్ కీలక నేత.. కేసీఆర్ కోసం ఢిల్లీలో లాబీయింగ్ షురూ!?​
X

దిశ, తెలంగాణ బ్యూరో : జాతీయ స్థాయిలో బీఆర్ఎస్​పార్టీ యాంటీ బీజేపీ కూటమిలో చేరేందుకు లాబీయింగ్​మొదలుపెట్టింది. కేంద్రంలోని బీజేపీ సర్కారును టార్గెట్​చేస్తూ కేసీఆర్ బీఆర్ఎస్‌ను ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడో కూటమి దిశగా ప్రయత్నాలు చేసిన కేసీఆర్.. ప్లాన్​ముందుకు పడకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్లుతున్నారు. ఆయా రాష్ట్రాలకు వెళ్లి, సీఎంలు, మాజీ సీఎంలను కలిసి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు ఆవశ్యకతను వివరించినా ఎక్కడి నుంచీ ఆశించిన రిప్లై రాలేదు. అంతేకాకుండా కాంగ్రెస్​లేని కూటమి సాధ్యం కాదంటూ తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్​కూటమిలో చేరేందుకు కేసీఆర్ లాబీయింగ్ స్పీడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే కాంగ్రెస్‌కు తీరని నష్టం చేశారని కేసీఆర్​పై హస్తం కూటమి ఆగ్రహంతో ఉంది. కానీ, అదే పార్టీలోని ఓ కీలక నేతతో రాయబారం ప్రారంభించారని రాజకీయ వర్గాల్లో టాక్. కిందిస్థాయిలో కేసీఆర్‌కు కాంగ్రెస్‌లో అంతగా సాయం చేసే నేతలెవ్వరూ లేరు. గతంలో కాంగ్రెస్‌కు మోసం చేశారనే అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నా.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్​ కూటమిలో చేరేందుకు కేసీఆర్​ చిరకాల మిత్రుడు కేవీపీ రామచంద్రారావుతో మధ్యవర్తిత్వం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మారాను.. నమ్మండి ప్లీజ్​

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే చాలు.. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానంటూ కేసీఆర్​ప్రకటించిన విషయం తెలసిందే. అంతేకాకుండా ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ దగ్గరకు వెళ్లి చెప్పి వచ్చారు. కానీ, రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్​ను చంపేయడంలో కేసీఆర్​సక్సెస్​అయ్యారు. దీంతో అటు కాంగ్రెస్​హైకమాండ్ నుంచి కూడా కేసీఆర్ మోసం చేశాడనే కామెంట్​ పలుమార్లు వచ్చింది. దీంతో ఏఐసీసీ నేతలు కేసీఆర్‌ను నమ్మకుండా ఉంటున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌ను ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనే నేపథ్యంలో బీఆర్ఎస్‌గా మార్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో కూడా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇదే సమయంలో బీజేపీ కూడా తెలంగాణపై కన్నేసింది. ప్రభుత్వాన్ని తిప్పలు పెడుతూనే.. అటు బీఆర్ఎస్​ నేతలను, ప్రజాప్రతినిధులను టార్గెట్​ చేస్తోంది. ఈడీ, సీబీఐ వంటి సంస్థలు తెలంగాణపై కన్నేశాయి. ఢిల్లీ లిక్కర్​స్కాంలో కేసీఆర్​కూతురు, ఎమ్మెల్సీ కవితకు సైతం నోటీసులు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జాతీయ స్థాయిలో యాంటీ బీజేపీ కూటమి సాయం తప్పకుండా అవసరమని కేసీఆర్​ గుర్తించారని గులాబీ వర్గాలే చెప్తున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు రాష్ట్రాలు తిరిగినా కేసీఆర్​వెంట నడిచేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకేసి టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. కానీ, ఒక్క కర్ణాటక మినహా.. ఇతర రాష్ట్రాల నుంచి మద్దతు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్​ కూటమి ప్రత్యామ్నాయంగా మారిందని బీఆర్ఎస్​అధినేత కేసీఆర్​ భావిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొవడం, కేసుల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్​కూటమి మాత్రమే మార్గమనుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్​కూటమిలో చేరేందుకు వ్యూహం మొదలుపెట్టారు.

కేవీపీ వెనకున్నాడు..?

కాంగ్రెస్​నేత, ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అన్నీ తానై నడిపించిన ఏపీ నేత కేవీపీ రామచంద్రారావు కేసీఆర్​ కు 8 ఏండ్ల నుంచి అంతరంగిక దోస్త్‌గానే ఉంటున్నారు. ఆయన నిర్మాణ కంపెనీకి కూడా కేసీఆర్​టెండర్లు ఇస్తూనే ఉన్నారు. ఇలాంటి ఆపద సమయంలో కేవీపీ.. కేసీఆర్‌కు ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ. తొలిసారి ప్రభుత్వంలో కూడా టీడీపీ, కాంగ్రెస్‌లోని వెల్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను కేసీఆర్​దగ్గరకు చేర్చడంలో కేవీపీదే కీలక పాత్ర అని ప్రచారం ఉంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్​ కూటమిలో చేరేందుకు కేవీపీ మళ్లీ కేసీఆర్ దగ్గరకు చేరినట్లు టాక్. సోనియా గాంధీతో మాట్లాడేందుకు అటు కేవీపీ కూడా లాబీయింగ్​ మొదలుపెట్టారని సమాచారం. కేసీఆర్‌ను కాంగ్రెస్‌కు దగ్గర చేసేందుకు కేవీపీ చాలా ప్రయత్నాలే చేస్తున్నాడని కాంగ్రెస్​నేతలే చెప్తున్నారు. " ప్రస్తుతం కాంగ్రెస్‌లో కేసీఆర్​ ను ఎవరూ నమ్మడం లేదు. కానీ, కేవీపీ ఆ బాధ్యత తీసుకుని, కాంగ్రెస్ కూటమిలో బీఆర్ఎస్ ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. రాష్ట్రంలో కేసీఆర్‌కు, కాంగ్రెస్‌లోని ఒక వర్గానికి అసలు పడదు. కానీ, కేవీపీ ఎంటర్​తర్వాత అదంతా ఉండదు. త్వరలోనే కాంగ్రెస్​కూటమిలో కేసీఆర్​చర్చ వచ్చే చాన్స్​ఉంది.." అని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత వెల్లడించారు. దీంతో ఢిల్లీ వేదికగా అంతర్గత చర్చలు మొదలైనట్లు స్పష్టమవుతోంది.

పరిస్థితి ఏంది..?

వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్​ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, టీఆర్ఎస్‌తో కూడా పొత్తు అసలే ఉండదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చి ప్రకటించి వెళ్లారు. మరోవైపు టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డికి, బీఆర్ఎస్ నేతలకు మధ్య నిత్యం వివాదాలే. అటు కేసీఆర్​కూడా రేవంత్​వ్యవహారంలో చాలా సీరియస్‌గానే ఉంటారు. కాంగ్రెస్‌లోని ఒక వర్గం కేసీఆర్‌కు కోవర్టులు అనే ప్రచారం రెండు పార్టీలోనూ కొనసాగుతున్నదే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​కూటమిలో కేసీఆర్​చేరితే.. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందనే అనుమానాలు మొదలయ్యాయి. వీరిందరి మధ్య సయోధ్య చేయడం కూడా కేవీపీ భుజాలపైనే వేశారని కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్​నేతలంతా కేవీపీ ఏం చెప్తే అదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కీలకమైన సమయంలో కేవీపీ వచ్చి పార్టీలో చక్రం తిప్పి వెళ్తున్నారు. తాజాగా సీడబ్ల్యూసీ నేత దిగ్విజయ్​రాష్ట్రానికి వచ్చిన విషయం విదితమే. పార్టీలో సీనియర్లు, రేవంత్​ మధ్య నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు దిగ్విజయ్​ను ఏఐసీసీ రాష్ట్రానికి పంపించింది. కానీ, దిగ్విజయ్​ వచ్చినా.. ఆయన మిత్రుడు కేవీపీ రాకతోనే ఒక క్లారిటీకి వచ్చారని పార్టీ వర్గాల్లో టాక్. అంతేకాకుండా సీడబ్ల్యూసీలోని కీలక నేతలంతా కేవీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. దీంతో కాంగ్రెస్ కూటమిలో కేసీఆర్ చేర్చేందుకు కేవీపీ లాబీయింగ్​సక్సెస్ అవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.

Also Read...

గురుకులాలతోనే సరి.. ఆ విషయంలో తెలంగాణ సర్కార్ అట్టర్ ఫ్లాప్..!

Advertisement

Next Story

Most Viewed