AP Politics: ముగిసిన పోలింగ్.. సజ్జల దుకాణం బంద్..

by Indraja |   ( Updated:2024-05-15 04:15:38.0  )
AP Politics: ముగిసిన పోలింగ్.. సజ్జల దుకాణం బంద్..
X

దిశ ప్రతినిధి, అమరావతి: అధికార వైసీపీకి సజ్జల భార్గవ్ నేతృత్వంలో విశేష సేవలందించిన సోషల్ మీడియా విభాగం మంగళవారం మూతబడింది. ప్రభుత్వ సలహాదారుగా, ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ్ నేతృత్వంలో నడుస్తున్న ఈ విభాగం పలు వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే. చివరకు ఇటీవల ఎన్నికల సంఘం కేసు కూడా నమోదు చేసింది.

ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో ఇక మీ అవసరం లేదంటూ 130 మందికి పైగా ఉన్న ఉద్యోగులకు బై చెప్పేశారు. తాడేపల్లి జాతీయ రహదారిపై వైసీపీ ప్రధాన కార్యాయలానికి దగ్గరలో సజ్జల రామకృష్ణారెడ్డి కార్యాలయం పైనే ఈ సోషల్ మీడియా కార్యాలయం వుంది. కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు పోలింగ్ జరిగిన సోమవారమే ప్రకటించారు.

నెల మధ్యలో షాక్

నెల మధ్యలో ఆఫీసు మూసేసి ఇంటికి పొమ్మనడం రెండు, మూడేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు షాక్ ఇచ్చినట్లైంది. కనీసం నెలాఖరు వరకూ కొనసాగించాల్సిందిగా వారు చేసిన వినతిని పట్టించుకోలేదు సరికదా.. చివరకు ఎప్పటినుంచో వాడుతున్న ల్యాప్‌టాప్‌లతో పాటు కంపెనీ ఇచ్చిన మొబైల్ ఫోన్‌లు కూడా తమకు అప్పగించి వెళ్లాలని సూచించడం ఉద్యోగులను ఆశ్చర్చపరచింది.

రెండేళ్లుగా వాడుతున్న పాత ఫోన్లు సజ్జల ఏం చేసుకొంటారో? సెకెండ్ హ్యాండ్ మార్కెట్‌లో అమ్ముకొంటారా? ఇంతకాలం రేయింబవళ్లు కష్టపడి చేసిన పనికి గుర్తింపు గౌరవమే లేదంటూ వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు. మే నెల జీతం కూడా ఇవ్వకుండా జూన్ 4న ఫలితాల రోజు వచ్చి తీసుకోండని చెప్పి పంపించి వేయడం వారిని మరింత బాధించింది. వాడుకొని వదిలేసే విషయంలో వైసీపీ తీరు మారనేలేదని తిట్టుకొంటూ పాపం సోషల్ మీడియా సిబ్బంది ఇంటి ముఖం పట్టారు.

Advertisement

Next Story

Most Viewed