AP Politics: ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి.. రాజీనామాకు ఆదేశం?

by Indraja |   ( Updated:2024-06-26 03:49:14.0  )
AP Politics: ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి.. రాజీనామాకు ఆదేశం?
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వైపీసీ పాలనాకాలంలో రాష్ర్టంలోనే అత్యంత వివాదాస్పద వీసీగా పేరుపడ్డ ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పీవీజీడీ ప్రసాదరెడ్డిని ఆ పదవి నుంచి దిగిపోవాల్సిందిగా రాష్ర్ట ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. సంబంధిత అధికారి పోలా భాస్కర్ ద్వారా ఈ సమాచారం ప్రసాదరెడ్డికి ఇచ్చినట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యుడు పి. విజయసాయిరెడ్డికి కుడిభుజంగా వ్యవహరిస్తూ ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చారంటూ విమర్శలకు గురైన ప్రసాదరెడ్డి సాటి ఉద్యోగులు, సిబ్బంది పట్ల నియంత మాదిరిగా వ్యవహరించారు.

ఆయన పాలనలో విశ్వవిద్యాయలంలో పదుల సంఖ్యలో కోర్సులను రద్దు చేయడంతో పాటు పీహెచ్డీలు, స్పెషల్ ఎగ్జామినేషన్‌ల పేరిట పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి చోటుచేసుకొన్నాయి.

వారం రోజులుగా నిరసన శిబిరం

ప్రభుత్వం మారిన నేపథ్యంలో ప్రసాదరెడ్డి, ఆయన తాబేదారు అయిన రిజిస్ర్టార్ జేమ్స్ స్టీఫెన్‌లను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏయూ పూర్వ విద్యార్థులు, దళిత సంఘాల వారు నిరసన ప్రారంభించారు. రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటుచేసి వీసీ, రిజిస్ర్టార్‌ల అక్రమాలు, అన్యాయాలు, అవినీతి కార్యక్రమాలను వెల్లడించారు.

మంత్రి లోకేశ్‌ను కలిసి ఫిర్యాదు

మంగళవారం కొందరు ప్రసాదరెడ్డి బాధితులు మానవ వనరుల శాఖామంత్రి నారా లోకేశ్‌ను కలసి తమ గోడు వెల్లబోసుకొన్నారు. వీసీ, రిజిస్ట్రార్‌ల అరాచకాలను ఇక భరించలేమని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో కూటమి పక్షాల నుంచి కూడా తమ ఉద్యమానికి మద్దతు లభించడం లేదని, వీసీ, రిజిస్ర్టార్‌లకు వ్యతిరేకంగా తెలుగుదేశం నేతలు కూడా మాట్లాడే ధైర్యం చేయడం లేదని ఫిర్యాదు చేశారు. వీటన్నింటి ఫలితంగా వీసీ పదవికి ప్రసాద రెడ్డి నుంచి రాజీనామా తీసుకోవాల్సిందిగా స్పష్టమైన అదేశం వచ్చినట్లు తెలిసింది.

ఇప్పటికే ప్రిన్సిపాల్‌‌గా కొనసాగుతున్న పదవీ విరమణ చేసిన ప్రసాద రెడ్డి భజన బృందాన్ని రాజీనామా చేయమని ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రసాదరెడ్డి రాజీనామా చేస్తే నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన లక్షల జీతం తీసుకొన్న సెక్యూరిటీ అధికారి ఖాన్ కూడా రాజీనామా చేయకతప్పదని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed