రూ.7కోట్ల విలువ చేసే నా భూమే పోయింది.. నేనెలా అక్రమాలకు పాల్పడతాను

by Seetharam |
రూ.7కోట్ల విలువ చేసే నా భూమే పోయింది.. నేనెలా అక్రమాలకు పాల్పడతాను
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో జైల్లో ఉన్నా ఆయన ఆలోచన రాష్ట్రం, ప్రజలేనని మాజీమంత్రి నారాయణ అన్నారు. చంద్రబాబు అక్రమ కేసుతో జైల్లో ఉండడం బాధాకరమైనా...జైలులో చంద్రబాబు మనోదైర్యంగా ఉన్నారు అని చెప్పుకొచ్చారు. ‘తనకు అండగా నిలుస్తున్న ప్రజలకు, మద్ధతు తెలిపిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు చెప్పాలని, అధికార పార్టీ చేసే అక్రమాలు, దౌర్జన్యాలను ప్రశ్నించాలని చంద్రబాబు జైలులో తమకు చెప్పారు అని మాజీమంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో శుక్రవారం నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణితో కలసి నారాయణ చంద్రబాబునాయుడుతో ములాఖత్ అయ్యారు. ములాఖత్ అనంతరం మాజీమంత్రి నారాయణ సెంట్రల్ జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలిపేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు పర్యటనకు రాష్ట్రం లో వస్తున్న ప్రజా స్పందన చూసే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని నారాయణ తెలిపారు. రింగ్ రోడ్డు అంశంలో లోకేశ్ పైనా కేసు పెట్టారు..దీనిపై 41ఏ నోటీసులు ఇస్తామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. ఇది మా మొదటి విజయం అని నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఏం చేస్తోందో ప్రజలందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. టీడీపీకి ప్రజల నుండి వచ్చే మద్ధతును వైసీపీ ఓర్చుకోలేక పోతుందని...అందుకే కేసులు, అరెస్ట్ లు చేస్తుందని నారాయణ చెప్పుకొచ్చారు. అయినా పార్టీకి రెండింతల బలం పెరుగుతోంది. రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. రైతులు, ఉద్యోగులు, కూలీలు, యువత అందరూ ఇబ్బంది పడుతున్నారు. 6 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని చంద్రబాబు అరెస్టు చేయడం రాజకీయ కక్షే..దీనికి వైసీపీ కి ప్రజలే త్వరలో బుద్ధి చెప్తారు అని మాజీమంత్రి నారాయణ హెచ్చరించారు.

నేనెలా అవినీతికి పాల్పడతాను

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్‌లో తాను అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ ఆరోపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను గానీ చంద్రబాబు నాయుడు గానీ...లోకేశ్ గానీ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. ఈడ్పుగల్లులో 40 సెంట్ల భూమిని తాను 2001లో కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇన్నర్ రింగ్ అలైన్ మెంట్ ప్లానింగ్‌లో ఆ భూమి పోయింది. ఆ భూమి పోయిందని సీఆర్డీఏ అధికారులే తమకు సమాచారం ఇచ్చారు అని స్పష్టం చేశారు. రూ.7 కోట్ల విలువ చేసే నా భూమి పోతే..నేనెలా ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతికి పాల్పడతాను.? అని నారాయణ ప్రశ్నించారు. ‘ఆరోపణలు చేసినంత మాత్రాన అవి నిజం అయిపోవు. మా బంధువులు కొన్న భూములు కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకు 7 కి.మీ దూరంలో ఉన్నాయి. వైసీపీకి సొంత పత్రిక ఉందని బురదజల్లడమే తెలుసు. మాకు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా. టీడీపీ-జనసేన పొత్తుపైనా త్వరలో కమిటీ నియామకం అవుతుంది..కమిటీ నిర్ణయాల ప్రకారం ప్రకారం ముందుకు వెళ్తాం. చంద్రబాబు జైల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు..అయినా తప్పలేదు’ అని మాజీమంత్రి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వ్యవసాయరంగానికి ఎంతో సేవ చేసిన ఎం.ఎస్.స్వామినాథన్ మృతి ఎంతో బాధించిందని చంద్రబాబు అన్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. స్వామినాథన్ వ్యవసాయ రంగానికి, దేశానికి చేసిన సేవలను చంద్రబాబు స్మరించుకున్నారని పేర్కొన్నారు. స్వామినాథన్ కుటుంబానికి తన సంతాపం తెలియ జేయాలని చంద్రబాబు కోరినట్లు మాజీమంత్రి నారాయణ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed