ఎందుకింత హడావుడి? 22న వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి రావాలంటూ ఆహ్వానం

by Indraja |   ( Updated:2024-06-18 15:19:43.0  )
ఎందుకింత హడావుడి? 22న వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి రావాలంటూ ఆహ్వానం
X

దిశ ప్రతినిధి, అమరావతి: ఘోర పరాజయం పాలైన పదిహేను రోజులకే విస్తృత స్థాయి సమావేశానికి వైసీపీ పిలుపు నిచ్చింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఈ నెల 22న ఉదయం 10.30 గంటలకు వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి తనతో పాటు గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు, ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్దులను ఆహ్మానించారు. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంట్‌కు పోటీ చేసిన అభ్యర్ధులను కూడా ఆహ్వనించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

అందర్నీ పిలిచి కళ్ళు మూసుకోండి అంటారా?..

వారం రోజుల కిందట కొద్ది మందితో నిర్వహించిన సమావేశంలో కళ్లు మూసుకుంటే ఐదేళ్లు ఇట్టే గడచిపోతాయని మాజీ సీఎం జగన్ అన్నారు. జనంలో తీవ్ర వ్యతిరేకతతో ప్రతిపక్షంలో కూర్చోపెట్టారనే కఠోర వాస్తవాన్ని ఇప్పటికీ గుర్తించకుండా తాను రెండున్నర లక్షల కోట్లు నేరుగా జమ చేస్తే ఎందుకు ఓటేయలేదని తిరిగి జనాన్నే జగన్ ప్రశ్నించారు. జనానికి, కార్యకర్తలకు, నాయకులుకు, చివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలకు దూరంగా ఐదేళ్లు ఊహాలోకంలో నియంతలా బతికిన జగన్‌కు ఓటమితో స్పృహ వచ్చింది.

ఒక్కసారిగా వాస్తవాలు డింగ్‌మని కళ్ళముందు కనిపించేసరికి ఏమి జరిగిందో అర్థం కావడం లేదు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం, ఇక తప్పులు పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడతామని జనానికి సంజాయిషీ ఇవ్వకుండా తిరిగి వారినే ప్రశ్నించడం ద్వారా జగన్ అయోమయంలోనే, అహం భావనలోనే వున్నారని అర్ధమవుతోంది.

చంద్రబాబును చూసైనా నేర్చుకోరా?..

పార్టీని నిలబెట్టుకోవడం క్యాడర్‌ను కాపాడుకోవడం ఇవన్నీ చంద్రబాబును చూసి నేర్చుకోవాలి. గత ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమైనప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీపైన, క్యాడర్‌పైనా దృష్టి సారించారు. పార్టీ ఎమ్మెల్యేలపైన, నేతలపైనా జగన్ దాడులను, కేసులను తట్టుకొంటూనే అధోపాతాళంలో నుంచి పార్టీని పునరుద్ధరించుకుంటూ వచ్చారు. జగన్‌లో ఆ లక్షణాలు ఏమాత్రం లేవని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.

దర్శనం చేసుకోవాలంటే సమర్పించుకోవాల్సిందే..

పార్టీ ఝోరంగా ఓడిపోయిన తరువాత కూడా జగన్ కానీ, ఆయన కోటరీ కానీ ఏ మాత్రం మారలేదు. జగన్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అప్పాయింట్ మెంట్ తీసుకుని ఆయనను కలవడం అసాధ్యం. ఎదో విధంగా కలవాలంటే జగన్‌తో ఉండే కేఎన్.ఆర్, తలశిల రఘురాం, డ్రోన్ కిరణ్, మనోహర్ వంటి వారికి లక్షల్లో సమర్పించుకోవాల్సివచ్చేదని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

కేవలం జగన్ అప్పాయింట్మెంట్‌లు పెట్టినందుకు కేఎన్.ఆర్ చేసిన వసూళ్లే కోట్లలో వున్నాయంటే జగన్ జనానికి ఎంత దూరంగా వున్నారో అర్ధం చేసుకోవచ్చు. అప్పుడు సరే, ఇప్పుడు ఓడిపోయిన జగన్ వద్దకు వచ్చి ఓదార్పు పొందుదామని, ఓదార్చి పోదామని వచ్చి వారు కూడా డబ్బు చెల్లిస్తేనే దర్శన భాగ్యం కలుగుతుండడం పార్టీ నేతలకే చికాకు తెప్పిస్తుంది. ఓడిపోయిన ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు ముగ్గురు అనుచరులతో కలసి జగన్ కోసం వెళితే కేఎన్.ఆర్ , తలశిల రుఘురామ్‌ల నుంచి వచ్చే సమాధానం ‘ఒక్కరినే తీసుకువెళ్లండి.. ఇద్దరినే తీసుకువెళ్లండి ’ అని, అదే సమర్పణలు పూర్తి చేస్తే మాత్రం నలుగురికి శీఘ్ర దర్శనం లభిస్తుంది. పార్టీ అధికారంలో వున్న సమయంలోనే జగన్ పీఏలకు సమర్పించుకునే లక్షలను బట్టే శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం లభిస్తుందనే ప్రచారం వుండేది.

ఐదేళ్లలో ఒక్క మీడియా మీట్ లేదు..

జగన్ అధికారంలో వున్న అ ఐదేళ్లలో ఏ ఒక్క విలేకరుల సమావేశం లేదు. సకల శాఖా మంత్రిగా పేరు పడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిందే జగన్ చెప్పినట్లు భావించాల్సి వచ్చేది. ఎన్నికల సమయంలో ఒకరిద్దరు పెయిడ్ జర్నలిస్టులకు తప్ప ఇంకెవ్వరికీ ఇంటర్య్వూలు ఇవ్వలేదు. విలేకరిని కలవలేదు. కనీసం జిల్లాల్లో రివ్యూలు పెట్టలేదు. జిల్లా నాయకులను కలిసింది లేదు. ఈయన ఇప్పుడు సమీక్ష పెడితే ఎవరు నమ్ముతారని పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.

Read More..

BREAKING : ఘోర ఓటమి తర్వాత EVMలపై జగన్ సంచలన ట్వీట్పే పర్ బ్యాలెట్ల వినియోగంపై మాజీ సీఎం ఏమన్నారంటే..?

Advertisement

Next Story