సోనియా వద్దకు షర్మిల.. విజయమ్మ వద్దకు జగన్

by GSrikanth |
సోనియా వద్దకు షర్మిల.. విజయమ్మ వద్దకు జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ పాలిటిక్స్ రోజురోజుకూ ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. గత కొంత కాలంగా అన్న చెల్లెలు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయనే టాక్ బహిరంగంగానే వినిపిస్తోంది. ఏపీలో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తుంటే జగన్‌కు బద్ధ శత్రువైన కాంగ్రెస్‌లోకి షర్మిల చేరడం రాజకీయంగా సంచలనంగా మారింది. వైఎస్సార్ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన అనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వద్దకు షర్మిల వెళ్లగా కేసీఆర్‌ను పరామర్శించే పేరుతో హైదరాబాద్‌కు వచ్చిన జగన్ తన టూర్ షెడ్యూల్‌లో చివరి నిమిషంలో మార్పులు చేసుకుని అనూహ్యంగా లోటస్ పాండ్‌లోని తన తల్లి విజయమ్మ వద్దకు వెళ్లారు. ఓ వైపు సోనియా గాంధీతో షర్మిల భేటీ అయితే మరోవైపు తన తల్లితో జగన్ మంతనాలు జరపడంతో వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతోందనే చర్చ వైఎస్సార్ ఆభిమానులు, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెంచుతోంది.

వైఎస్ ఫ్యామిలీలో ట్రయాంగిల్ స్టోరీ:

మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించేందుకు హైదరాబాద్‌కు జగన్ వచ్చారు. నిజానికి ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే చంద్రబాబు సహా ఇతర ప్రముఖులు కేసీఆర్‌ను పరామర్శించినా జగన్ మాత్రం రాలేదు. కానీ తన సోదరి కాంగ్రెస్‌లో చేరిక ఖాయం కావడంతో అనూహ్యంగా పరామర్శ పేరుతో కేసీఆర్ వద్దకు వచ్చిన జగన్.. అక్కడి నుంచి నేరుగా తన తల్లి విజయమ్మతో భేటీ కావడం వెనుక జగన్ టూర్‌లో ఏదో తెలియని రాజకీయ వ్యవహారం నడుస్తోందనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. చాలా కాలంగా జగన్‌కు షర్మిలకు మధ్య దూరం పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో నిన్న తాడేపల్లికి వెళ్లిన షర్మిల.. తన కొడుకు వివాహ ఆహ్వాన పత్రికను అన్న, వదినకు అందజేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లిన షర్మిల ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే సమయంలో జగన్ దాదాపు రెండేళ్ల అనంతరం లోటస్ పాండ్‌కు వెళ్లడం అక్కడ తన తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. దీంతో జగన్‌కు, షర్మిలకు మధ్య విజయమ్మ ఎవరి పక్షాన ఉండబోతున్నారు అనేది ఆసక్తిగా మారుతోంది.

ఇద్దరి మధ్య క్లియర్ కట్:

చాలా కాలంగా జగన్‌కు షర్మిలకు మధ్య దూరం పెరిగినట్లు వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. వైఎస్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలు సైతం ఇందుకు బలం చేకూర్చాయి. అయితే వచ్చే నెలలో షర్మిల కుమారుడి వివాహం జరగనుంది. ఈ సమయంలో పెళ్లి పనుల్లో బిజీగా ఉండాల్సిన షర్మిల రాజకీయంగా స్పీడ్ పెంచారు. దీంతో కుమారుడి వివాహానికి షర్మిల పొలిటికల్ ట్రాక్ చేంజ్‌కు ఏదైనా లింక్ ఉందా అనే ఊహాగానాలు సైతం తెరపైకి వస్తున్నాయి. తన కొడుకు వివాహా ఆహ్వాన పత్రికను అందజేసే పేరుతో అన్న, వదిన వద్దకు వెళ్లిన షర్మిల ఇదే సమయంలో రాజకీయంగా తన భవిష్యత్ నిర్ణయాలను వారితో తేల్చి చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక షర్మిల తీసుకున్న నిర్ణయంపై తన ఆలోచనను జగన్ ఇవాళ తన తల్లితో చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో జగన్, షర్మిల మధ్య రాజకీయం మరింత ఉత్కంఠ భరితంగా ఉండబోతున్నదని తెలుస్తోంది. అయితే షర్మిల నిర్ణయం జగన్‌కు కలిసి వస్తుందా లేక కొంప ముంచుతుందా అనేదానిపై ఎవరి విశ్లేషణలు వారికి ఉన్నప్పటికీ అంతిమంగా రాజశేఖర్ రెడ్డి సంతానం ఇలా పొలిటికల్ బాహాబాహీకి సిద్ధం కావడంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది వైఎస్ అభిమానులను టెన్షన్ పెట్టిస్తోందనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed