- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల్యాణ కర్ణాటకపై జాతీయ పార్టీల ఫోకస్.. ప్రచారానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు!
దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణలోని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఆ రాష్ట్రంలో ఈశాన్య ప్రాంతంగా చెప్పుకునే ఒకప్పటి హైదరాబాద్-కర్ణాటక రీజియన్‌లోని రాయచూర్, బీదర్, గుల్బర్గ, యాద్గిర్, కొప్పల్, బళ్లారి జిల్లాల్లో ఈ మూడు పార్టీలు ప్రచారం చేయాలని భావిస్తున్నాయి. ఈ జిల్లాల్లోని 40 అసెంబ్లీ సెగ్మెంట్లలో తెలుగు ఓటర్లు నిర్ణయాత్మకం కానున్నారు. కాంగ్రెస్ పార్టీకి కాస్త ఎక్కువ పట్టు ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో బీజేపీ పాగా వేసింది. ఇందులోని నాలుగు జిల్లాల్లో తెలంగాణ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అందువల్లే టీకాంగ్రెస్‌కు చెందిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఇన్‌చార్జిగా ఆ పార్టీ నియమించింది. బీజేపీ సైతం ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన డీకే అరుణను ఆ పార్టీ తరఫున సహ ఇన్‌చార్జిగా నియమించింది.
ఈ జిల్లాల్లో ఏయే నియోజకవర్గాల్లో తెలుగు, తెలంగాణ ఓటర్లు ఏ మేరకు ప్రభావం చూపుతారో శ్రీధర్‌బాబు ఒక అంచనాకు వచ్చారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలను ప్రచారంలోకి దించడానికి హస్తం పార్టీ రూపొందించిన వ్యూహానికి ఆయన కొన్ని సూచనలు, సలహాలు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను స్టార్ క్యాంపెయినర్లుగా ఏఐసీసీ త్వరలో ఖరారు చేయనున్నట్టు తెలిసింది. ఇక పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రచారానికి రావాల్సిందిగా శ్రీధర్‌బాబు ఇప్పటికే ఆహ్వానించారు. పార్లమెంటు సమావేశాలు ఈ నెల రెండో వారంలో ముగియగానే ఆయన సైతం ప్రచారానికి హాజరుకానున్నారు. ఈ నెల 25 వరకు రేవంత్‌రెడ్డి తెలంగాణలో పాదయాత్ర ఖరారుకావడంతో అది ముగిసిన వెంటనే ఆయన సైతం అక్కడి ప్రచారానికి వెళ్లనున్నారు.
తెలంగాణ బీజేపీ నేతలు సైతం
కల్యాణ కర్ణాటక ప్రాంతంలో ప్రచారం కోసం బీజేపీ సైతం దీటైన వ్యూహాన్నే రూపొందించుకున్నది. ఇప్పటికే సహ ఇన్‌చార్జిగా డీకే అరుణను నియమించింది. ప్రచారం కోసం రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా నేత లక్ష్మణ్ తదితరులు కూడా ప్రచారానికి వెళ్లనున్నారు. ఈశాన్య కర్ణాటకలోని ఆరు జిల్లాలు ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్ (నిజాం కాలంలో)లో భాగంగా ఉన్నందున తెలంగాణ ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంటుందని బీజేపీ అంచనా వేసింది. అందులో భాగమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల అక్కడ పర్యటించి బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. నిజాం సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైనా.. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబరు 17ను విమోచనా దినోత్సవంగా జరపడంలేదని కామెంట్ చేశారు.
నిర్ణయం తీసుకోని బీఆర్ఎస్
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చాలని ఆలోచన జరిగినప్పటి నుంచి కర్ణాటకలోని జేడీఎస్ నేతలతో కేసీఆర్ సన్నిహిత సంబంధాలనే కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్‌గా నామకరణం చేసిన కార్యక్రమానికి (అక్టోబరు 5, 2022), ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ లాంఛనంగా బీఆర్ఎస్‌కు ఆమోదం తెలపడంతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో (డిసెంబర్ 9, 2022) జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి జేడీఎస్ నేత కుమారస్వామి హాజరయ్యారు. అప్పటికే ఆయనను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు పిలిపించుకుని విందు ఇచ్చారు. ఆ తర్వాత ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి, రాజశ్యామల యాగానికి సైతం కుమారస్వామి హాజరయ్యారు. స్వయంగా బెంగళూరు నగరానికి వెళ్లిన కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడను ఆయన నివాసంలో కలుసుకుని బీఆర్ఎస్, జేడీఎస్ సంబంధాలపై సుదీర్ఘంగా చర్చించారు. జేడీఎస్‌ను మిత్రపక్షంగా భావిస్తూ స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్న కేసీఆర్ ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత ప్రచారం విషయంలో లాంఛనంగా నిర్ణయం తీసుకోలేదు. ఆ పార్టీకి మద్దతు ఇస్తామని, కుమారస్వామి సీఎం అవుతారని అప్పట్లో ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి స్వయంగా హాజరవుతారా? లేక పార్టీ నేతలను ఇక్కడి నుంచి పంపుతారా? అనేదానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయదని, జేడీఎస్‌కు మద్దతు ఇస్తుందని కుమారస్వామి గతేడాది అక్టోబరు 10న బెంగళూరు నగరంలో ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పోటీ చేస్తుందని, తాము పొత్తులో భాగంగా కొన్ని సీట్లను ఇచ్చిపుచ్చుకుంటామన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు వెలువడినా అటు జేడీఎస్, ఇటు బీఆర్ఎస్ పరస్పర మద్దతుపై, ప్రచారంపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం గమనార్హం.
కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రభావం
కర్ణాటకలోని మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసంగా 20% మేర తెలుగు ఓటర్ల ప్రభావం ఉంటుంది. ఆ రాష్ట్ర జనాభా ఏడు కోట్ల కాగా.. అందులో సుమారు కోటి మంది తెలుగు ప్రాంతాలకు చెందినవారే. కల్యాణ కర్ణాటకలోని ఆరు జిల్లాల్లోని 40 అసెంబ్లీ సెగ్మెంట్లలో తెలుగు మాట్లాడే ప్రజల ప్రభావం ఉంటుంది. ఇందులో నాలుగు జిల్లాల్లో తెలంగాణ ప్రభావం ఎక్కువే. అందుకే కాంగ్రెస్, బీజేపీలు ముందుగానే దృష్టి సారించి దానికి తగిన ప్రచార వ్యూహాన్ని రూపొందించుకున్నాయి. తాము అధికారంలోకి వస్తే బెంగళూరు నగరంలో తెలంగాణ భవన్ కట్టిస్తామంటూ జేడీఎస్ నేత కుమారస్వామి 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం తెలుగువారి పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ అక్కడి వారిని ప్రోత్సహిస్తూ ఉంటాయి.
కల్యాణ కర్ణాటక ప్రాంతంలోని ప్రజలు వారి ఇండ్లల్లో తెలుగులోనే మాట్లాడుకుంటారు. తెలుగు భాషను చక్కగానే అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడి నుంచి ఏ పార్టీ నేత వెళ్లి తెలుగులో మాట్లాడినా వారికి అర్థమవుతుంది. ఆ కారణంగానే ఇక్కడి నుంచి వెళ్లే బీజేపీ, కాంగ్రెస్ నేతలు తెలుగులోనే మాట్లాడతారు. ఇక బెంగళూరు నగరంలోని మహదేవపుర లాంటి పలు ప్రాంతాల్లోనూ తెలుగు ఓటర్లు చాలా కాలం క్రితమే స్థిరపడ్డారు. దీనికి తోడు కోలార్, తుమకూరు, చిక్కబళ్లాపుర, చిత్రదుర్గ తదితర ప్రాంతాల్లోనూ తెలుగు ఓటర్ల సంఖ్య ఎక్కువే. ఇక హెబ్బళ్, దేవనహళ్లి, బళ్లారి తదితర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు ఎక్కువ సంఖ్యలో స్థిరపడ్డారు. కల్యాణ కర్ణాటకలో బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభావం కాస్త ఎక్కువే. బీజేపీ మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి బళ్లారి, కొప్పల్ జిల్లాల్లో ఒక మేరకు ప్రభావం చూపగలుగుతుండడంతో కొత్త పార్టీ పేరుతో ఇప్పుడు పోటీ చేస్తున్నందున ఎవరి ఓట్లు చీలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.