వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా బిడ్డింగ్ వేస్తావా?: బీజేపీ నేత విజయశాంతి

by Javid Pasha |
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా బిడ్డింగ్ వేస్తావా?: బీజేపీ నేత విజయశాంతి
X

దిశ, తెలంగాణ బ్యూరో : సిర్పూర్ పేపర్ మిల్లు, అజంజాహి మిల్లు, రేయాన్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాని కేసీఆర్ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా బిడ్డింగ్ దాఖలు చేస్తాననడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడి ప్రజలంతా ఛీదరించుకుంటుండటంతో మంత్రి కేటీఆర్ కొత్త డ్రామాకు తెరదీశారని ఆమె ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేవలం కేంద్రంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అడిగితే తలాతోక లేకుండా బైలడిల్ల గనుల గురించి కేటీఆర్ మాట్లాడటం సిగ్గుచేటని ఆమె విమర్శించారు.

తెలంగాణలో మూతపడ్డ సంస్థలను పునరుద్ధరించడం చేతగాని కేటీఆర్.. మోడీపై అభాండాలు మోపడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనంగా చెప్పుకొచ్చారు. మోడీ పాలనలో ప్రభుత్వరంగ సంస్థలన్నీ మూతపడుతున్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలేనన్నారు. ఫూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థను మినహా ఏ ప్రభుత్వ రంగ సంస్థను మోడీ పాలనలో ప్రైవేట్ పరం చేశారో సమాధానం చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. తండ్రీకొడుకులు ఎన్ని డ్రామాలు చేసినా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ పోరు ఆగదని, మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేసే వరకు ఉద్యమిస్తామని విజయశాంతి హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed