ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా రూట్ మార్చుకున్న బీజేపీ?

by Nagaya |   ( Updated:2022-09-09 04:35:56.0  )
ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా రూట్ మార్చుకున్న బీజేపీ?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచి ఏప్రిల్ 2024 వరకు దాదాపు 600 రోజుల గడువు ఉంది. దీంతో ఎన్నికల కోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో అధికారమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతుండగా ముచ్చటగా మూడోసారి అధికార పీఠంపై కూర్చోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా జాతీయ రాజకీయ ముఖ చిత్రం క్రమంగా మారుతోంది. అనూహ్యమైన పరిణామాలతో నేషనల్ పొలిటికల్ సర్కిల్ హీటెక్కుతోంది. బీజేపీని ఢీ కొట్టాలంటే ఐక్యమత్యమే చివరి అస్త్రంగా ప్రతిపక్షాలు భావిస్తున్న నేపథ్యంలో బీజేపీ సైతం అలర్ట్ అయింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టల ప్లాన్ అమలు చేస్తోంది. ఇన్నాళ్లు కరోనా పరిస్థితులు, ఇతరత్ర కారణాలతో పెండింగ్‌లో ఉండిపోయిన పనులను ప్రభుత్వ పరంగా స్పీడప్ చేస్తోంది. బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాల మధ్య సైలెంట్‌గా సాగుతున్న రాజకీయం ఆసక్తిని రేపుతోంది.

ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా బీజేపీ వ్యూహం

మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోందనే టాక్ వినిపిస్తోంది. 543 లోక్ సభ స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. ఇప్పటి వరకు గెలవని స్థానాలు ఏంటో విశ్లేషించుకుని అక్కడ గెలుపు కోసం కావాల్సిన కసరత్తును పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, నితీష్ కుమార్ ఢిల్లీలో సిద్ధం చేస్తున్న రాజకీయ ప్రయత్నాలు, అరవింద్ కేజ్రీవాల్ 'మేక్ ఇండియా నంబర్ 1 మిషన్' కార్యక్రమాలకు సమాధానాలు చెప్పేందుకు బీజేపీ రెడీ అవుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పరంగా మరింత స్పీడ్ పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని రోజుల క్రితం జాతీయోద్యమ సందడితో ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించారు. గురువారం రీ డెవలప్ చేసిన సెంట్రల్ విస్టాను జాతికి అంకితం చేయనున్నారు. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌లో కేజ్రీవాల్ విమర్శలకు చెక్ పెడుతూ పీఎం -శ్రీ పథకానికి ప్రభుత్వం రూ.27360 కోట్లు కేటాయించింది. ఇక పీఎం గతి శక్తి కార్యక్రమం కింద రైల్వే స్థలాలను దీర్ఘకాలం పాటు లీజుకిచ్చే విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా 300 కార్గో టెర్మినళ్ల ఏర్పాటుకు అవకాశం లభిస్తుండడంతో పాటు 1.25 లక్షల ఉద్యోగాలు వస్తాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా మరికొన్ని కార్యక్రమాలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి.

ఆ స్థానాలపై అమిత్ షా నజర్

ఇక పార్టీ పరంగాను బీజేపీ సన్నద్ధం అయ్యేందుకు కృషి చేస్తోంది. 2019లో పార్టీ ఓడిపోయిన 144 సీట్లపై దృష్టి పెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల మంత్రులను కోరారు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే బలమైన నేత లేకపోవడం బీజేపీకి మరింత చేయూతగా మారుతోంది. నితీష్ కుమార్ అన్ని పార్టీలను ఏకం చేస్తున్నాడు. కేజ్రీవాల్ బీజేపీపై యుద్ధం ప్రకటించినా వీరిద్దరు హిందూత్వ విషయంలో బీజేపీని దీటుగా ఎదుర్కోలేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం ఆ దిశగా విమర్శలు గుప్పిస్తున్నా ఆయన వైఖరిపట్ల విపక్షాల్లో కొంత మంది అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. దీంతో తన పనిని మరింత సులువు చేసుకునేలా బీజేపీ పావులు కదుపుతోందట. 2019 నాటి పరిస్థితులు ఎలా ఉన్నా 2024 లో పరిస్థితులు భిన్నంగా ఉండనున్నాయి. దీంతో గత ఎన్నికల్లో గెలుపొందిన స్థానాలను కాపాడుకుంటూనే ఓడిపోయిన స్థానాల్లో గెలిచేందుకు మంత్రులకు షా దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో 2015లో జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో భారతదేశంలోని తీరప్రాంత రాష్ట్రాలైన బెంగాల్, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళలో పార్టీ సీట్లను గెలుచుకోవాలనే 'కోరమాండల్ కోస్ట్' ప్రణాళికను బీజేపీ తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఇక్కడ ఆ పార్టీకి విజయం దక్కించలేకపోయింది. దీంతో 2019లో రెండు లేదా మూడు స్థానాల్లో నిలిచిన 144 సీట్లు తన కోరమాండల్ ప్లాన్‌కు తన శక్తియుక్తులను వెచ్చించడం కంటే బలంగా ఉన్న ప్రాంతాల్లో ఏకీకృతం చేయడానికి బీజేపీ ఆసక్తిగా కనిపిస్తోంది. బీహార్, మహారాష్ట్ర, బెంగాల్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో సంభవించే నష్టాలను భర్తీ చేయడానికి పకడ్బందీ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో టీఆర్ఎస్‌‌కు సైతం గట్టి షాకిచ్చేలా క్షేత్రస్థాయిలో సంప్రదింపులు కొనసాగిస్తోందని తెలుస్తోంది. మరి బీజేపీ దూకుడును కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తిగా మారింది.

Also Read : ఓవర్ టు 2024 ఎలక్షన్! విపక్షాలు ఏకం అయ్యేనా?

Also Read : లోక్ సభకు ఉపఎన్నిక? పక్కా ప్లాన్ సిద్ధం చేసిన బీజేపీ

Advertisement

Next Story