Political Betting: మునిగేదెవరో.. తేలేదెవరో?

by Indraja |
Political Betting: మునిగేదెవరో.. తేలేదెవరో?
X

దిశ ప్రతినిధి, కడప: నేతల తలరాతలు తేల్చే నాలుగో తేదీ ఎవరు గెలుస్తారో, ఎవరు మునుగుతారో తెలియదు కానీ, ఆ రోజు పందెం రాయుళ్లలో ఎవరు మునుగుతారు. ఎవరు తేలుతారు.. పందెం గెలిచి ఎవరు తలెగరేస్తారు.. ఎవరు నెత్తిన గుడ్డ వేసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. లక్షలు, కోట్ల పందెం కాసిన బెట్టింగ్ రాయుళ్ళు మాత్రం నరాలు తెగే ఉత్కంఠకు గురవుతున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, క్రికెట్, పొలిటికల్ బెట్టింగ్‌కి పెట్టింది పేరైన కడప జిల్లాలో ఈ ఎన్నికల ఫలితాలపై భారీగానే బెట్టింగ్ సాగింది. ఓ అంచనా ప్రకారం రూ.50 కోట్లకు పైగా బెట్టింగ్ సాగి ఉంటుందని భావిస్తున్నారు. పందేలు కాసిన వారిలో కొందరు రాజకీయ నాయకులు కూడా ఉన్నారని సమాచారం. జిల్లాలో ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థుల కంటే బెట్టింగ్ రాయుళ్ళు ఎన్నికల సరళిని క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారంటే ఏ స్థాయిలో బెట్టింగ్‌కు దిగారో ఊహించవచ్చు.

ప్రభుత్వం పైనే భారీగా..

రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఏదన్న దానిపైనే ఎక్కువగా పందాలు కాస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందా! ఒంటరిగా బరిలో దిగిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వస్తుందా! అన్నదానిపైనే ఎక్కువగా పందేలు కాశారు. పోలింగ్ అయిన నాలుగైదు రోజుల వరకు జగన్మోహన్ రెడ్డికి 80 సీట్లు వస్తాయని, అన్ని రావని బెట్టింగ్ జరిగింది.

పోలింగ్‌కు ముందు అయితే 70 నుండి 80 వరకు సీట్లు వస్తాయి అని పందాలు కాశారు. పోలింగ్ ముగిసిన వారం నుండి వైసీపీ అధికారంలోకి వస్తుందని, కొందరు టీడీపీ అధికారంలోకి వస్తుందని కొందరు రూపాయికు రూపాయి బెట్టింగ్ కాశారు. ప్రభుత్వంపై కోట్ల రూపాయల్లో బెట్టింగ్ సాగింది. కడప బెట్టింగ్ కాస్త జిల్లా దాటి ఇతర జిల్లాలకు కూడా ప్రాకింది. ప్రభుత్వం ఏ పార్టీకి వస్తుంది అనేదానితో పాటు చంద్రబాబుకు కుప్పంలో మెజారిటీ ఎంత, పిఠాపురంలో పవన్, మంగళగిరిలో లోకేష్‌లపై బెట్టింగ్ జరుగుతోంది.

కడప, కమలాపురంపై జోరు

కడప జిల్లాలోని కడప అసెంబ్లీ, కమలాపురం అసెంబ్లీ స్థానాలపై బాగా బెట్టింగ్ జరుగుతోంది. ఈ రెండు చోట్ల తెలుగుదేశం, వైసీపీ నువ్వా నేనా? అన్నట్లు పోటీ పడడంతో పందాలకు పెద్ద ఆస్కారం ఏర్పడింది. కమలాపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చైతన్య గెలుపు ఖాయమని ఆ పార్టీలో ధీమా పెరుగుతోంది. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పైనే సుమారు పది కోట్ల రూపాయలు మేరకు బెట్టింగ్ జరిగిందని అంచనా వేస్తున్నారు.

వీటితోపాటు ప్రొద్దుటూరు అసెంబ్లీ పైన పెద్ద ఎత్తునే బెట్టింగ్ సాగుతోంది. అలాగే పులివెందులలో జగన్ మెజార్టీ గత ఎన్నికల కంటే తగ్గుతుందని పందెం కాస్తుండగా, షర్మిలకు పార్లమెంట్ అభ్యర్థిగా లక్ష ఓట్లు దాటుతాయని కొందరు, లక్షన్నర నుంచి రెండు లక్షల దాకా వస్తాయని మరికొందరు బెట్టింగ్ పెడుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలపై ఒక మేరకు పందేలు సాగుతున్నట్లు సమాచారం.

మిగతా చోట్ల కొద్దో గొప్పో బెట్టింగ్ జరుగుతున్నా కడప, కమలాపురం గెలుపులపైనా, ప్రభుత్వ ఏర్పాటు, షర్మిల ఓట్ల పైన బెట్టింగ్ జోరుగా కాస్తున్నారు. ఇప్పటికే చాలా మటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇరు పార్టీల బెట్టింగ్ రాయుళ్ళు మధ్యవర్తి చేతికి ఆ మొత్తాలను అప్పగించడం జరుగుతోంది. ఈ మొత్తాల గ్యారెంటీగా ఉన్న మధ్యవర్తి ఐదు శాతం మొత్తాన్ని పట్టుకొని మిగిలిన మొత్తాన్ని గెలిచిన పార్టీకి చెల్లిస్తారు. ఈ ప్రకారం సాగుతున్న బెట్టింగ్‌లో నాలుగో తేదీ ఎవరు మునుగుతారో! ఎవరు తేలుతారో అన్నది బెట్టింగ్ రాయుళ్ళలో నరాలు తెగే ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story

Most Viewed