AP Politics: నాడు విగ్రహాల దొంగ.. నేడు వైసీపీ కీలక నేత

by Indraja |
AP Politics: నాడు విగ్రహాల దొంగ.. నేడు వైసీపీ కీలక నేత
X

దిశ వెబ్ డెస్క్: నిన్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై పిన్నెల్లి పైశాచికం అనే పేరుతో టీడీపీ పుస్తకాన్ని విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, పి.అశోక్‌ బాబు, పిల్లి మాణిక్యాలరావు, ధారూ నాయక్‌, పారా కిశోర్‌రెడ్డి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆలయాల్లో విగ్రహాల దొంగగా జీవితం ప్రారంభించి నేడు వైసీపీ ఎమ్మెల్యేగా ఎదిగారని ఆరోపించారు.

అయితే ఆయన ఎదిగే నేపథ్యంలో ఎన్నో అరాచకాలకు పాల్పడ్డాడని టీడీపీ నేతలు మండిపడ్డారు. నియోజకవర్గంలో ఆయన ఎనిమిది హత్యలు, 130 దాడులు చేశారని విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము అనే విషయాన్ని పిన్నెల్లి సోదరులు పూర్తిగా విస్మరించారని, దీనికి మాచర్ల నియోజకవర్గంలో వాళ్ళు సృష్టించిన మారణహోమమే నిదర్శనం అని పేర్కొన్నారు, కేవలం రెండు లక్షల ఆదాయం ఉన్న పిన్నెల్లి నేడు 2000 కోట్లకు అధిపతి అయ్యారని తెలిపారు. గ్రానైట్, గ్రావెల్, మద్యం దోపిడీ, భూకబ్జాలు, ఇతరుల ఆ ఆస్తులను కబ్జా చేయడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి నేడు కోట్లకు పడగలెత్తారని దుయ్యబట్టారు.

201-2012లో రూ.1.95 లక్షల ఆదాయం ఉన్న పిన్నెల్లి నేడు అధికారికంగా 43 లక్షలు చూపిస్తున్నారని, అయితే అనధికారికంగా ఏడాదికి 250 కోట్లకు పైగానే ఆదాయం ఉందని ఆరోపించారు, గతంలో అప్పుల బాధను తాళలేక ఊరు వదిలి వెళ్ళిపోయిన పిన్నెల్లి నేడు వందల ఎకరాల భూములను ఎలా సంపాదించారని ప్రశ్నించారు. భూ కబ్జాలతో వందల ఎకరాలను ఆక్రమించుకున్న పిన్నెల్లి చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతూ వేల కోట్లను గడించారని అన్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే చంబల్‌లోయలోని బందిపోట్లకు పిన్నెల్లికి ఎలాంటి తేడా లేదని పేర్కొన్నారు. అలానే మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ మారణహోమం సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా పోయిందిని, కాని వైసీపీ హయాంలో ఈవీఎంలు సైతం ధ్వంసం చేసే పరిస్థితికి మళ్లీ ఫ్యాక్షనిజం పురుడుపోసుకుందని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed