సంచలనంగా మారిన హెటిరో డ్రగ్స్ బ్లాక్ మనీ.. పొలిటికల్ సపోర్టుతోనే సాధ్యం.?

by Anukaran |   ( Updated:2021-10-14 00:52:28.0  )
సంచలనంగా మారిన హెటిరో డ్రగ్స్ బ్లాక్ మనీ.. పొలిటికల్ సపోర్టుతోనే సాధ్యం.?
X

దిశ, ప్రత్యేక ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ ఫార్మాకంపెనీలో భారీగా డబ్బులు పట్టుబడటం చర్చనీయాంశమైంది. హెటిరో డ్రగ్స్ కంపెనీలో పట్టుబడ్డ వందల కోట్లకు రాజకీయ రంగు అంటుకున్నదా? కేంద్ర ప్రభుత్వం పక్కా సమాచారంతోనే ఐటీ అధికారులను సోదాలకు పంపిందా..? అన్నది పొలిటికల్​సెక్షన్స్‌లో హాట్​టాపిక్‌గా మారింది. ఒకే సంస్థలో మునుపెన్నడూ లేని విధంగా రూ. 150 కోట్లు పట్టుబడటం రికార్డ్ సృష్టించింది. మరో రూ. 500కోట్ల లావాదేవీలకు లెక్కలు లేవని ఐటీ అధికారులు ప్రకటించడం కలకలం రేపింది. రాజకీయ అండతోనే ఫార్మా కంపెనీ విచ్చలవిడిగా ఔషధాలను అమ్మి వందల కోట్ల రూపాయలను ఆర్జించినట్టు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.

కాసులు కురిపించిన కరోనా..

కరోనా కరాళ నృత్యం చేసిన వేళ హెటిరో కంపెనీకి కాసుల వర్షం కురిసింది. ఈ సంస్థ సరఫరా చేసిన రెమిడెసివర్, రిట్రీవల్ ఔషధానికి మార్కెట్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది. రెమిడెసివర్ ఇంజక్షన్ల కోసం బారులు తీరిన సందర్భాలు కూడా ఉన్నాయి. రెమిడెసివర్ బ్లాకులో భారీ ధర పలికిన విషయం విధితమే. కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి వయల్స్‌ను నల్లబజారుకు తరలించారని కరోనా బాధితుల కుటుంబీకులు గగ్గోలు పెట్టారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు కూడా కరోనా వైరస్ సోకిందని కరుణ చూపకుండా రెమిడెసివర్ దందాతో జేబులు గుల్ల చేశాయి. దీంతోపాటు కరోనా వైరస్ నియంత్రణకు హెటిరో డ్రగ్స్ టోసిలీ జుమాబ్ అనే ఔషధాన్ని తయారు చేసి స్వదేశంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి తీసుకుంది. తద్వారా వందల కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించినట్లు కేంద్రానికి పక్కా సమాచారం అందింది.

రెండు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నుడాయన..

హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత సంపన్నుల జాబితాలో చేరారు. హెటిరో డ్రగ్స్ అధినేత ఇటీవలి వరకు టీటీడీ సభ్యుడిగా కొనసాగారు. ఇరు రాష్ట్రాల్లోనూ రాజకీయ అండ పుష్కలంగా ఉంది. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు ఓ పార్టీ ఓకే చెప్పినట్టు గతంలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో హెటిరో డ్రగ్స్‌కు చెందినవారు ఒక రాష్ట్రం పాలకవర్గం తరఫున వివాదంలో తలదూర్చినట్లు ప్రచారం జరుగుతున్నది.

ఈ పరిస్థితుల్లో ఔషధ కంపెనీ ఆర్థిక లావాదేవీలపై కొందరు పక్కా ఆధారాలతో కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో ఐటీ అధికారులు ఏకకాలంలో రెండు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని దాదాపు 60 బ్రాంచ్ కార్యాలయాలు, డైరెక్టర్ల ఇండ్లు, ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లపై దాడులు చేసి భారీ ఎత్తున నిల్వచేసిన నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కళ్లు బైర్లు కమ్మే విధంగా దాచిపెట్టిన నగదును చూసి ఐటీ అధికారులు విస్మయానికి గురయ్యారు. గతానికి భిన్నంగా ఈసారి పక్కా ఆధారాలతో మీడియాకు నల్లధనం ఫోటోలను కూడా ఐటీ శాఖ విడుదల చేసింది.

గుట్టల్లా నోట్ల కట్టలు..

ఐటీ సోదాల్లో దాదాపు రూ. 150 కోట్ల నగదు స్వాధీనమైంది. మరో రూ. 500 కోట్ల లాభాలకు సంబంధించిన లెక్కలు చూపలేదు. హెటిరో డ్రగ్స్ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంతో పాటు విజయవాడ, గుంటూరు బ్రాంచిల్లో సుమారు వారం రోజుల పాటు సోదాలు నిర్వహించారు. దాదాపు 20 మంది అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో తనిఖీలు చేశారు. కంపెనీ కార్యాలయాల్లోనే కాకుండా ప్రైవేట్ అపార్ట్‌మెంట్స్, ఫ్లాట్లలో కోట్లాది రూపాయలను దాచిపెట్టడం విశేషం. వాస్తవానికి ప్రముఖ కంపెనీల లావాదేవీలు డిజిటల్, ఎలక్ట్రానిక్, నెట్ బ్యాంకింగ్ ద్వారానే జరుగుతాయి. నగదు రూపంలో లావాదేవీలు జరగడం చాలా అరుదు. కానీ కంపెనీలో బ్యాంకుల కన్నా భారీ మొత్తంలో నగదు నిల్వలు లభించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నోట్లకు రాజకీయ రంగు ఏమైనా అంటుకున్నదా? అన్న కోణంలో ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.

బిహైండ్ ద స్క్రీన్ ఎవరు.?

హెటిరో లావాదేవీలతో రాజకీయ పార్టీలకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా కానీ సంబంధాలు ఉన్నాయా? అన్న అంశంపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. సదరు కంపెనీ యాజమాన్యానికి రాజకీయ సంబంధాలు ఉండడం వల్లే కరోనా సమయంలో ఎక్కువ లాభార్జనకు ఆస్కారం ఏర్పడిందని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. గతంలో రెండు ప్రముఖ కంపెనీలపై ఐటీ దాడులు జరపడం కలకలం సృష్టించింది. కానీ ఆ సోదాలకు సంబంధించిన వివరాలేవీ వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం హెటిరో డ్రగ్స్ నల్లధనం విచారణను ఐటీ అధికారులు ఏ విధంగా ముందుకు తీసుకుపోతారనేది చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story