మరోకోణం : కేసీఆర్.. రేవంత్.. మధ్యలో ఈటల!

by Anukaran |   ( Updated:2021-11-07 01:18:16.0  )
మరోకోణం : కేసీఆర్.. రేవంత్.. మధ్యలో ఈటల!
X

హుజూరాబాద్ ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సుమారు 24వేల మెజారిటీతో టీఆర్ఎస్‌కు అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను ఓడించారు. ఈ ఫలితం అధికార పార్టీ సహా మూడు ప్రధాన పక్షాల పైనా వేర్వేరుగా ప్రభావం చూపింది. ఎన్ని పథకాలు తెచ్చినా, ఎన్నెన్ని పనులు చేసిపెట్టినా, జనాభాలో సగానికి పైగా కుటుంబాలకు పింఛన్లు, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు అందించినా, చివరకు ఓటుకు ఆరు నుంచి పది వేలు పంచినా ప్రజలు తమను ఆదరించకపోవడం టీఆర్ఎస్‌కు భారీ షాక్. గత ఎన్నికల్లో 60వేలకు పైగా ఓట్లు సాధించి ఇప్పుడు కేవలం మూడు వేలకు పరిమితమై డిపాజిట్ కోల్పోవడం కాంగ్రెస్ నిస్సహాయ స్థితికి నిదర్శనం.

ఈ ఫలితం ద్వారా భారీగా లబ్ధి పొందే పార్టీ రాష్ట్ర బీజేపీ. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రత్యామ్నాయం తామేననే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఆ పార్టీకి లభించనుంది. అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ను వెనక్కి తోసి ఇకముందు దూకుడుగా కేసీఆర్ పాలనపై సమరశంఖం పూరిస్తుంది. ఉద్యమంలో మొదటినుంచీ కీలకంగా ఉన్న ఈటలను రంగంలోకి దింపడం ద్వారా టీఆర్ఎస్‌లోని అసంతృప్తవాదులను, యూటీ బ్యాచ్ నేతలను తమ పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నమూ కమలనాథులు చేస్తారు. తెలంగాణ అంతటా పేరున్న నేతగా ఆయనను తమ పబ్లిక్ ఫేస్‌గా వాడుకుని, వీలైతే సీఎం అభ్యర్థిగా ప్రకటించి గ్రామగ్రామాన తిప్పడాన్నీ కొట్టేయలేం.

అయితే, బీజేపీకి అంత సులువుగా కాంగ్రెస్ పార్టీ దారి ఇస్తుందా అన్నది ఇక్కడ గమనించాల్సిన అంశం. గత ఆరేళ్లుగా ఆ పార్టీలో నెలకొన్న నిష్క్రియ, నిస్సహాయ వాతావరణం రేవంత్‌రెడ్డి రాకతో పూర్తిగా మారిపోయింది. నిరాశ, నిస్పృహల్లో ఉన్న కార్యకర్తల్లో ఆయన ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. దళిత, ఆదివాసీ దండోరాలు, నిరుద్యోగ జంగ్ సైరన్ వంటి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్దయెత్తున చేపట్టాలని తలపెట్టారు. ఇప్పటికే కేసీఆర్‌కు ధీటైన నేతగా, ఆయనను మించిన వాడి వేడి వాక్బాణాలు సంధించే డైనమిక్ పర్సన్‌గా రేవంత్‌కు తెలంగాణలో పేరుంది. సీనియర్ల నుంచి కొంత ప్రతిఘటన ఎదురవుతున్నా జిల్లాల్లో మాత్రం ఆయనకు అనుకూల వాతావరణమే కనబడుతున్నది. కేసీఆర్‌ అజేయుడనే నమ్మకాన్ని వమ్ము చేసే ఉద్దేశంతోనే ఆయన హుజూరాబాద్‌లో వీక్ క్యాండిడేట్‌ను నిలిపారనే వాదన వినవస్తోంది. ఒకసారి గులాబీ బాస్‌ను బలహీనపరిస్తే, ఇక రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం చాలా సులభమనే అంచనాల్లో ఆయనున్నారని సన్నిహితులు చెబుతున్నారు. మోడీ-షా ద్వయానికీ, కేసీఆర్‌కూ మధ్య ఉన్న అనుమానాస్పద సంబంధాలే తమను రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా నిలబెడతాయనే ఆశతో రేవంత్ ఉన్నట్లు సమాచారం.

అయితే, ఇప్పుడు కేసీఆర్‌కు రేవంత్‌కు మధ్యలో ఈటల ఎంటరవుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన త్వరలో ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాలను కలువనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణకు సంబంధించిన కీలక బాధ్యతలే అప్పగిస్తారని సమాచారం. ఇంతకాలం కమలం పార్టీ వ్యవహారాలతో అంటీ ముట్టనట్లుగా ఉన్న ఈటల ఆ తర్వాత క్రియాశీలమవుతారని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర పార్టీలో అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పవర్ సెంటర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఈటల మూడో పవర్ సెంటర్‌గా రూపుదిద్దుకోవడం ఖాయమని బీజేపీ ఆఫీసులో టాక్ నడుస్తోంది. పార్టీ వ్యవహారాలను బండికి అప్పగించి ప్రచార సారథ్యాన్ని ఈటలకు అప్పగించే చాన్సే ఎక్కువుందని అంటున్నారు. పాదయాత్ర వంటిది ప్లాన్ చేసి గ్రామగ్రామానికి వెళ్లి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఎన్ని అక్రమాలు చేస్తోందో, ఎంత అవినీతికి పాల్పడుతోందో ఈటలతో చెప్పిస్తారని భావిస్తున్నారు. ఈ విషయంలో మిగతా ఏ నాయకుని కంటే కూడా ఈటలకే సానుకూలత ఎక్కువ ఉంటుందని వాళ్ల అభిప్రాయం.

అయితే ఇక్కడొక తిరకాసు ఉంది. తెలంగాణలో పాగా వేయాలన్న అమిత్ షా ఎజెండాను పక్కన పెడితే కమలదళం గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. హుజూరాబాద్‌తో పాటే 13 రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో ఆ పార్టీ సానుకూల ఫలితాలను పొందలేకపోయింది. రాజస్థాన్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటకల్లో సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. బెంగాల్‌లో పోటీచేసిన నాలుగింటిలోనూ డిపాజిట్ రాలేదు. ఇప్పటికే దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో సైతం కష్టాల కడలి ఈదుతోందన్న వార్తలు మీడియాలో వస్తున్నాయి. క్రితంసారి వచ్చినన్ని ఎంపీ సీట్లు వచ్చే 2024 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీకి ఉత్తరాదిన రావన్నది మాత్రం స్పష్టం. నార్త్ లో కోల్పోయిన సీట్లను సౌత్‌లో సాధించడం ప్రస్తుతం వారి వ్యూహంగా కనిపిస్తున్నది. కర్నాటక మినహా దక్షిణాదిన ఆ పార్టీ ఉనికి నామమాత్రమే కనుక ఇక్కడి ప్రాంతీయ పార్టీలను చేరదీయడమే వారి ముందున్న ఏకైక మార్గమవుతుంది. ఈ పరిస్థితుల్లో తమిళనాట డీఎంకే లేదా ఏఐడీఎంకే, ఏపీలో వైఎస్సార్‌సీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ కీలకమవుతాయి. అందుకే ఆ పార్టీ టీఆర్ఎస్‌తో ఏరి కోరి వైరం కొని తెచ్చుకుంటుందా అన్నది ప్రశ్నార్థకమే.

కేంద్ర నాయకత్వ వైఖరి రాష్ట్ర బీజేపీకి, ప్రత్యేకించి ఈటలకు సమస్యలను తెచ్చిపెట్టడం ఖాయం. ఇప్పటికే హుజూరాబాద్‌ ఎన్నికకు ముందు వరసగా రెండుసార్లు సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోడీ-షాలను కలిసిరావడం కలకలం రేపింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ విజయాల తర్వాత బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి ఫైర్‌బ్రాండ్ లీడర్లు రూలింగ్ పార్టీపై సంధించిన ఆరోపణాస్త్రాల్లో ఇటీవల పదును తగ్గిందనే ప్రచారమూ ఉంది. హుజూరాబాద్ ఎన్నిక కూడా టీఆర్ఎస్, బీజేపీల మధ్య కంటే కేసీఆర్‌కు, ఈటలకు మధ్య వ్యక్తిత్వ పోరుగానే కొనసాగింది. ఏ ఒక్క సభలోనూ రాజేందర్ జై శ్రీరాం అనలేదు. మోడీ పాలన ప్రస్తావన తీసుకురాలేదు. ప్రజలు కూడా ఈ విజయాన్ని బీజేపీ విజయంగా కంటే ఈటల విజయంగానే చూస్తున్నారు. మరోవైపు, హుజూరాబాద్ ఫలితం నేపథ్యంలో సీఎం కేసీఆర్ మళ్లీ ఢిల్లీ వెళతారని, మోడీ-షాలను కలిసి చక్రం తిప్పడం ఖాయమని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఏమైనా రాబోయే రెండేళ్ల కాలం రాష్ట్ర రాజకీయాలకు చాలా కీలకంగా ఉండబోతోంది. కేసీఆర్.. రేవంత్.. ఈటల.. ఈ ముగ్గురి మధ్య ఉత్కంఠభరిత పోరు జరగబోతోంది. మూడో దఫా అధికారంలోకి రావడం కష్టసాధ్యంగా కనబడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌కు పాలన పగ్గాలు అప్పగించి తాను జాతీయ రాజకీయాలకు వెళతారా? లేదంటే తనే కొనసాగి ఇప్పటిదాకా తను నమ్ముకున్న సంక్షేమ పథకాలనే పీక్స్ కు తీసుకెళ్లి భారీగా ఓట్లను రాబట్టే అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఆవిష్కరిస్తారా?.

సీనియర్ల వ్యతిరేకతను తటస్థపరుస్తూనే బీజేపీ బలంగా దూసుకువచ్చిన పరిస్థితులను రేవంత్ ఎలా ఎదుర్కొంటారు? టీఆర్ఎస్, బీజేపీ రెండూ కుమ్మక్కయ్యాయని, ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ.. అంటూ ఆ రెండు పార్టీలపై తాను చేస్తున్న ఆరోపణలు నిజమని ప్రజలను నమ్మించడంలో సక్సెస్ అవుతారా? కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు ఏ మేరకు సహకరిస్తుంది?

కొత్త పార్టీలో.. కొత్త బాధ్యతల్లో ఈటల ఎలా ఇమిడిపోతారు? తెలంగాణ వ్యాప్తంగా ప్రజాభిమానాన్ని ఎలా చూరగొంటారు? టీఆర్ఎస్ అసంతృప్తులను బయటకు లాగుతారా? వామపక్ష భావజాలం నుంచి వచ్చిన ఆయనను సంఘ్ పరివార్ విశ్వసిస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.
– డి. మార్కండేయ

పెట్రో ధరలు తగ్గించండి KTR సార్.. నెటిజన్లపై TRS నేతల ఓవరాక్షన్.!

Advertisement

Next Story

Most Viewed