పోలీసులకు రెండో దఫాలోనే వ్యాక్సిన్

by Shyam |   ( Updated:2021-01-16 09:21:17.0  )
పోలీసులకు రెండో దఫాలోనే వ్యాక్సిన్
X

దిశ, క్రైమ్ బ్యూరో : కరోనాతో యుద్దం ప్రకటించిన వారిలో పోలీస్ శాఖ పాత్ర మరువలేనిది. ఈ క్రమంలోనే పోలీసులు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తింపు పొందారు. ప్రపంచం అంతటా కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడప్పుడా అంటూ ఎదురు చూస్తున్న తరుణంలో మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు కావడం మంచి పరిణామమే. కానీ, వ్యాక్సిన్ తయారీ అనంతరం దేశంలోని 130 కోట్ల మందికి ఒకేసారి సరఫరా చేయడం అంత సులువైన విషయం కాదు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విడతలవారీగా వ్యాక్సిన్ సరఫరాకు ప్రణాళికలను రూపొందించింది. దీంట్లో భాగంగా.. ముందస్తుగా ఫ్రంట్‌లైన్ వారియర్స్ కు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని భావించారు.

అయితే, మొదటి విడత వ్యాక్సిన్ సరఫరా, దేశ జనాభాతో పోల్చుకుంటే వ్యాక్సిన్ తయారీ యూనిట్లు తక్కువగా ఉండటంతో ప్రాధాన్యతా అంశాల వారీగా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. దీంతో వ్యాక్సిన్ వేయించుకునే ఫ్రంట్‌లైన్ వారియర్ల జాబితాలో వైద్య శాఖ, మున్సిపల్ శాఖ సిబ్బందికి ప్రాధాన్యత ఇచ్చారు. వైద్య శాఖ, మున్సిపల్ శాఖతో పాటు ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పోలీసు శాఖకు మాత్రం రెండో విడతలో వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

అందుకు సంబంధించిన జాబితా ఇప్పటికే ఆయా కార్యాలయాల వారీగా డీజీపీకి చేరింది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఇప్పటికే జాబితాను డీజీపీ కార్యాలయానికి అందజేసినట్టు, డీజీ కార్యాలయం నుంచే పోలీసు శాఖ సిబ్బంది పేర్లు నమోదైనట్టు నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. పోలీసులు ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినప్పటికీ, మన కంటే వైద్యారోగ్య శాఖకు, మున్సిపల్ శాఖకు మొదటి ప్రాధానత్య ఇవ్వడం సరైన నిర్ణయం అన్నారు. పోలీసులకు మరో నెల రోజుల్లో రెండో దఫాలో వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు సమాచారం ఉందన్నారు.

Advertisement

Next Story