క్లైమోర్ మైన్స్ నిర్వీర్యం చేసిన పోలీసులు

by Sumithra |
clymore mines
X

దిశ, ములుగు : అజ్ఞాత మావోయిస్టులు అమర్చిన క్లైమోర్ మైన్స్ ఆదివారం ఉదయం నిర్వీర్యం చేశారు. దీనికి సంబంధించి ములుగు. ఏఎస్పీ పి. సాయి చైతన్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఉదయం ఐదు గంటలకు ఎస్సై, స్టేషన్ సిబ్బంది, ప్రత్యేక బలగాలతో కలిసి కౌశెట్టివాయి గ్రామం నుండి చౌలేడు వైపు కూంబింగ్ ఆపేరేషన్ చేసుకుంటూ వెళ్తుండగా గుట్ట దగ్గర ఉన్న బాటకు కొద్ది దూరంలో ఎలక్ట్రిక్ వైరు కనిపించిందని తెలిపారు.

అట్టి వైరును పరిశీలించగా అక్కడ సీపీఐ-మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మెంబర్ పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, తెలంగాణా రాష్ట్ర మిలటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్, జేఎంఎండబ్ల్యూపీ డివిజనల్ కమిటీ సెక్రటరీ కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్, బీకేఈజీ డివిజనల్ కమిటీ సెక్రటరీ కొయ్యడ సాంబయ్య అలియాస్ అజాద్, ఏటూరునాగారం-మహాదేవ్‌పూర్ దళ కమాండర్ రీనా, యాక్షన్ టీం సభ్యులు కోవాసి మంగు అలియాస్ భద్రు, కోవాసి గంగ అలియాస్ మహేష్, రవి, కొంతమంది అజ్ఞాత మావోయిస్టులు, మిలీషియా సభ్యులు కలిసి కూంబింగ్ కి వచ్చే పోలీసులను హతమార్చాలనే ఉద్దేశ్యంతో క్లైమోర్ మైన్స్ పెట్టినట్టు గుర్తించడం జరిగిందని తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ సంగ్రామ్ జి పాటిల్ కు సమాచారం అందించగా, వారు వెంటనే ములుగు నుండి బీడీ టీమ్ ను పంపించగా నిపుణులు అట్టి వైరుకు అనుసంధానం చేసిన క్లైమోర్ మైన్స్ నుండి డిటోనేటర్లను వేరు చేసి దానిని నిర్వీర్యం చేశారు.

ఇద్దరు పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి అట్టి క్లైమో మైన్స్ లో దాదాపుగా 23 సెంటిమీటర్ల పొడవు, 10.5సెంటిమీటర్ల వెడల్పు గల ఇనుప పైపు, అందులో నింపిన జిలెటిన్ పౌడర్, రెండు అంగుళాల పొడవున్న ఇనుప బోల్టులు, రెండు డిటోనేటర్లు దానిని పేల్చుటకు అనుసంధానంగా ఉన్న 10 మీటర్ల ఎలక్ట్రిక్ వైరు, 5 కంట్రీ మేడ్ గ్రెనేడ్స్ ను సాక్షుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. కూంబింగ్ వెళ్ళే పోలీసులను హతమార్చాలనే ఉద్దేశ్యంతో కుట్ర పన్నిన సీపీఐ-మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులపై చట్టరీత్యా కేసు నమోదు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్లో ములుగు ఏఎస్పీ పోతరాజు సాయి చైతన్య ఐపీఎస్, సీఐ శ్రీనివాస్, తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వర్లు, బాంబు డిస్పోజల్ టీం పాల్గొన్నారు.

Advertisement

Next Story