టీఆర్ఎస్ ‘డబుల్’ టోకరా

by Shyam |
టీఆర్ఎస్ ‘డబుల్’ టోకరా
X

పేదల అవసరాలను ఆసరాగా తీసుకున్న అధికార పార్టీ నాయకులు కొందరు కోట్ల రూపాయల దందాలకు పాల్పడుతున్నారు. తాజాగా మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులు అలాంటి నలుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ళు మంజూరయినట్టు జిల్లా కలెక్టర్ పేరుతో రబ్బర్ స్టాంపులు (సీల్)లను సృష్టించి పేదలను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అధికారుల పేరుతో తయారుచేసిన కొన్ని నకిలీ ధృవీకరణ పత్రాలనుసైతం స్వాధీనం చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ టోకెన్లు కూడా స్వాధీనమైనవాటిలో ఉన్నాయి. ఈ ఉదంతంలో సుమారు 75 మందికి ఈ తరహా టోకెన్లను ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు.

డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరయ్యాయంటూ సామాన్య ప్రజలను మోసం చేయడం ఇదే మొదటిది కాదు. గతంలోనూ జీహెచ్ఎంసీ స్టాంపులతో ఉన్న నకిలీ మంజూరు పత్రాలను బాధితులకు ఇచ్చారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఇప్పిస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న వారు యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్ ఏరియాల్లో నివసిస్తున్నారు. స్థానికంగా ఉండే టీఆర్ఎస్ నేతలతో సాన్నిహిత్యం ఉంది వీరికి. జీహెచ్ఎంసీలో ఉండే సిబ్బందితోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. వీటి వల్లనే సులభంగా మోసం చేయగలుగుతున్నారు. ఇప్పటిదాకా ఇలాంటి మూడు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. అయితే అధికార పార్టీ, బల్దియా ఉద్యోగుల పేరుతో ఇంకెన్ని దందాలు నడుస్తున్నాయో! ఇలాంటి దందాల గురించి బయటకు చెప్తే నిజంగా వచ్చే ఇల్లు ఎక్కడ కోల్పోతామోననే భయం కూడా బాధితులను వెంటాడుతోంది.

అవగాహన లేక మోసపోతున్న సామాన్యులు

డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించే పనులను హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ చూస్తుంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో లక్ష ఇండ్ల నిర్మాణం జరుగుతోంది. వీటిని పూర్తి స్థాయిలో కట్టిన తర్వాత ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు కలిసి ఇండ్లు అవసరమైన పేదలను గుర్తించి జాబితాను తయారు చేస్తారు. అవసరమైతే లాటరీ పద్ధతిని చేపడుతారు. లబ్ధిదారుల కేటాయింపులో జీహెచ్ఎంసీ కమిషనర్ సహా మరే ఇతర అధికారులకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం ఉండదు. అయితే బాధితుల దగ్గర మాత్రం జీహెచ్ఎంసీ నకిలీ లెటర్ హెడ్లు, వాటిపై స్టాంపులు, కమిషనర్ల ఫోర్జరీ సంతకాలు కనిపిస్తున్నాయి.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనలో జిల్లా కలెక్టర్ల స్టాంపులు, ఫోర్జరీ సంతకాలు కూడా బైటపడ్డాయి. జీహెచ్ఎంసీ, కలెక్టర్ల స్టాంపులను, లెటర్ హెడ్స్ ను దొంగతనంగా తయారు చేస్తున్నా సంబంధిత అధికారులు తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు కదా.. వారే దర్యాప్తు చేస్తారన్నట్టు ‘దిశ’ ప్రతినిధితో ఉన్నాతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో రికవరీ చాలా తక్కువే. నిందితులకు శిక్ష పడినా బాధితులకు మాత్రం నష్టం తప్పదు. జీహెచ్ఎంసీ, కలెక్టర్ల అధికారిక ముద్రలను ఎవరు తయారు చేయిస్తున్నారు.. ఎక్కడ తయారు చేస్తున్నారు.. పేషీల్లో పనిచేసే వారి సహకారం లేకుండా ఇంత పకడ్భందీగా సాధ్యమేనా.. ‘డబుల్’ బెడ్ రూం దందా నిర్వహించడంలో ఎవరెవరి పాత్ర ఎలాంఠిది.. ఇలాంటి అంశాల్లో అధికారుల నుంచి పెద్దగా రియాక్షనే లేదు.

డబుల్ బెడ్ రూం ఇళ్ళ కేటాయింపులు ఎలా జరుగుతుందో ప్రజల్లో చాలా వరకు స్పష్టమైన అవగాహనే లేదు. అందువల్లనే రాజకీయ ప్రోద్బలం ఉన్న పైరవీకారులు ప్రజలను సులభంగా మోసం చేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న అవగాహన కూడా అంతంతమాత్రమే.

Advertisement

Next Story