తెలంగాణ రాజకీయాల్లో కొత్త అంకం..?

by Shyam |
తెలంగాణ రాజకీయాల్లో కొత్త అంకం..?
X

దిశ, న్యూస్ నెట్‌వర్క్ : నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అంకానికి తెర లేపినట్లయింది. పాలిటిక్స్‌లోకి వచ్చిన తర్వాత కవిత ఎన్నడూ రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలుపొందడంతో కేంద్ర రాజకీయాలకు పరిమితమయ్యారు. పార్లమెంటులో లేవనెత్తాల్సిన అంశాలపైనే ఫోకస్ పెట్టారు తప్ప రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టలేదు. 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో ఏడాదిన్నరపాటు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందడంతో రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చినట్లయింది. ఇప్పటికే అసెంబ్లీలో కేటీఆర్ సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా ఉండగా ఇకపైన మండలిలో కవిత ఆ పాత్ర పోషించే అవకాశాలున్నాయి.

చాలా మంది సీనియర్ నేతలు కేసీఆర్‌తో సన్నిహితంగా ఉంటుంటారు. యువతరం నేతలంతా కేటీఆర్‌కు దగ్గరగా ఉంటారు. ఇప్పటివరకు వీరిద్దరూ పొలిటికల్, పవర్ సెంటర్‌గా ఉన్నారు. తాజాగా కవిత ఎమ్మెల్సీ కావడంతో మండలిలోని చాలామంది సభ్యులు (టీఆర్ఎస్‌కు చెందినవారు) సీనియర్లు అయినప్పటికీ అనివార్యంగా ఆమె కనుసన్నల్లో ఉండక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె రాజకీయ పాత్ర మండలికే పరిమితం కాకుండా మూడో పవర్ సెంటర్‌గా ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. హరీశ్‌రావు వర్గం అంటూ ఆయనకు సన్నిహితంగా ఉండే కొద్దిమందిని ఒక గ్రూపుగా జమకట్టిన వార్తలు కొత్తేమీ కాదు. ఇప్పుడు కవిత ఎంట్రీతో పార్టీలో కొత్త సమీకరణాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

పార్టీకొకరు, పాలనకొకరు?

కేటీఆర్‌ను ఎప్పటికైనా ముఖ్యమంత్రిని చేయడం ఖాయమని టీఆర్ఎస్ పార్టీలోని చాలా మంది నాయకులే మాట్లాడుతూ ఉంటారు. గత ఐదారు నెలలుగా కేటీఆర్ మంత్రులందరితో సమీక్షా సమావేశాలు నిర్వహించడం దానికి బలం చేకూరుస్తోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిపెడతారని, ముఖ్యమంత్రిగా కేటీఆర్ పాలనా పగ్గాలు చేపడతారన్నది ఆ నాయకుల ఉద్దేశం. అలాంటి పరిస్థితుల్లో కవితకు పార్టీ వ్యవహారాల బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందన్నది పార్టీ వర్గాల అంచనా. ఆమె మంత్రి కావడం ఖాయమని కొందరు.. ఒకవేళ అయితే ఏ శాఖ నిర్వహిస్తారు.. ఇలాంటి చర్చలు మొదలయ్యాయి. పంచాయతీరాజ్ అని ఒకరు, హోం అని మరికొందరు చర్చించుకుంటున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు ఆమెను అభినందించడానికి పోటెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా పలకరించారు.

బతుకమ్మ నుంచి..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు రాష్ట్ర ప్రజలకు ఆమె ‘బతుకమ్మ’ కవితగా తెలుసు. ఆ తర్వాత ఐదేళ్లపాటు పార్లమెంటు సభ్యురాలిగా చూశారు. ఇకపైన ఎమ్మెల్సీగా చూడబోతున్నారు. ఎంపీగా ఉన్న సమయంలో జిల్లాకు సంబంధించిన అంశాలపైన మాత్రమే ఫోకస్ పెట్టిన కవిత ఇప్పుడు మొత్తం రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో చొరవ తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని సెగ్మెంట్లనూ గెలుచుకున్నా పార్లమెంటు ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు ఆమెకు తెలియందేమీ కాదు. ఇప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ఆ జిల్లా నేతలు టెన్షన్ పడుతున్నారు. ఆగ్రహం, అనుగ్రహం ఏది వచ్చినా దానికి తగిన ఫలితాన్ని చవిచూడక తప్పదు. అందుకే వారు ఆమెను ప్రసన్నం చేసుకోవాలంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed