17న సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

by Shyam |   ( Updated:2020-06-16 11:52:42.0  )
17న సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా కట్టడి, వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్న ప్రధాని మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో బుధవారం నిర్వహించనున్నారు. ఇప్పటికే 21 రాష్ట్రాల సీఎంలతో మంగళవారం మోదీ మాట్లాడారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, పుదుచ్చేరి తదితర రాష్ట్రాలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఐదు దఫాలుగా వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన మోడీ ఇప్పుడు ఆరో విడత నిర్వహిస్తున్నారు. గత నెల 11వ తేదీన ఐదవసారి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన సమయానికి దేశం మొత్తం మీద కేసుల సంఖ్య 67 వేలుగా ఉంది. తెలంగాణలో కేవలం 1,275 మాత్రమే కేసులు ఉన్నాయి. కానీ ఈ నెల రోజుల వ్యవధిలో దేశంలో మొత్తం కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరువ కాగా, తెలంగాణలో మాత్రం ఐదు వేలు దాటాయి. ఇక మృతుల విషయంలోనూ దేశవ్యాప్తంగా గత నెల 11వ తేదీన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు నాటికి 2,206 ఉంటే తెలంగాణలో కేవలం 32 మాత్రమే. నాల్గవ విడత నుంచే లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడం, ప్రస్తుతం మరింతగా పెంచడంతో అటు కేసులూ పెరిగాయి. ఇటు మృతుల సంఖ్య కూడా పెరిగింది. ఈ నెల 30న ముగిసే లాక్‌డౌన్ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకునే ముందు ఇప్పుడు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి అభిప్రాయాలను సేకరిస్తుండడం గమనార్హం.

Advertisement

Next Story