అసోంకు ప్రధాని మోదీ భరోసా

by Shamantha N |
అసోంకు ప్రధాని మోదీ భరోసా
X

గువహతి: అసోంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితి గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రాష్ట్ర సీఎం సర్బానంద సోనోవాల్‌ను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి కావాల్సిన సహాయాన్ని అందిస్తామని ప్రధాని మోడీ ఈ సందర్భంగా హామీనిచ్చినట్టు సీఎం వెల్లడించారు. వరదల వల్ల రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 54 లక్షలమంది ప్రభావితులయ్యారు. దాదాపు 81 మంది మరణించారు. ప్రస్తుత వరదలు 18 మందిని పొట్టనబెట్టుకున్నాయి. 81 మంది వరదల్లో మునిగి చనిపోగా, 26 మంది కొండ చరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ సల్మారా, బార్పేటా జిల్లాల్లో శనివారం ఇద్దరు నీటమునిగి చనిపోయారు. రక్షక చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 99వేల క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేసింది.

కజిరంగ పార్క్‌లో తొమ్మిది రైనోలు మృతి

అసోంలోని ప్రఖ్యాత కజిరంగ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ 85 శాతం(430 చ.కి.మీ మేర విస్తరించి ఉంది) నీటమునిగింది. ఈ పార్క్‌లో ఈ ఏడాది మొత్తం 108 జంతువులు చనిపోగా అందులో తొమ్మిది రైనోలున్నాయని పార్క్ అధికారులు వెల్లడించారు. అలసిపోయిన రైనోలు రహదారి మీదకు వచ్చి సేదతీరుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు అడవి దున్న, రైనోలు, దుప్పిలు సహా 60 జంతువులు నీటిలో మునిగి చనిపోయాయని, వరద నీటిని తప్పించుకుంటుండగా నేషనల్ హైవే 37పై వాహనాలు ఢీకొని సుమారు 15 జింకలు మరణించాయని అధికారులు తెలిపారు. మరో 15 జంతువులు చికిత్సపొందుతూ మరణించాయని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed