- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగిసిన ఫైజర్ టీకా ట్రయల్స్
న్యూఢిల్లీ: కరోనాను నియంత్రించే టీకా అన్వేషణలో కీలక ముందడుగు పడింది. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ అభివృద్ధి చేస్తున్న టీకా మూడో దశ ట్రయల్స్ బుధవారం ముగిశాయి. కరోనా వైరస్‌ను నిలువరించే సామర్థ్యం 95శాతం కలిగి ఉన్నట్టు టీకా తుది దశ ట్రయల్స్ ఫలితాలు వెల్లడించినట్టు సంస్థ వెల్లడించింది. ప్రధానమైన సైడ్ ఎఫెక్ట్‌లు దాదాపుగా కనిపించలేవని వివరించింది. జర్మన్ సంస్థ బయోన్‌టెక్ ఎస్‌ఈ తో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ టీకా వయస్సు, ప్రాంతాలకతీతంగా మెరుగైన ఫలితాలనిచ్చిందని తెలిపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టీకాను పంపిణీ చేయడానికి మార్గం సుగమమైంది. కరోనాను నిలువరించే నిరోధక శక్తిని లోకమంతటా అందజేయవచ్చు. 65ఏళ్ల పైబడినవారిలో ఈ టీకా 94శాతం సమర్థతను కలిగి ఉన్నట్టు ఫైజర్ సంస్థ తెలిపింది.
టీకా సేఫ్టీ, సమర్థతకు సంబంధించిన రెండు నెలల డేటా తమ దగ్గర ఉన్నదని, త్వరలోనే అమెరికాలో ఎమర్జెన్సీ వినియోగ అనుమతులకు దరఖాస్తు చేయబోతున్నట్టు వివరించింది. ఈ ట్రయల్స్ డేటాను యూఎస్‌తోపాటు ఇతర దేశాల రెగ్యులేటరీలకు అనుమతులకోసం సమర్పించడానికి ప్రణాళికలు వేస్తున్నట్టు తెలిపింది. అలాగే, నిపుణుల సమీక్షకు, సైంటిఫిక్ జర్నల్‌లకు అందించనున్నట్టు వివరించింది. ప్రతిరోజు లక్షలాది మంది కరోనా బారిన పడుతున్న తరుణంలో ఈ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసే ప్రభావవంతమైన టీకాను అత్యవసరంగా తీసుకురావాల్సి ఉన్నదని ఫైజర్ సీఈవో అల్బర్ట్ బౌర్ల అన్నారు.
ఇదీ రిజల్ట్..
ఫైజర్ టీకాను సుమారు 43వేల మంది వాలంటీర్లపై నిర్వహించారు. ఇందులో 170 మందికి వైరస్ సోకింది. వీరిలో ప్లేస్‌బో(టీకాకు నకిలీ రూపం) ఇచ్చినవారే 162 మంది ఉన్నారు. కాగా, ఎనిమిది మంది టీకా తీసుకున్నవారున్నారు. మొత్తంగా పది మందిలో కరోనా తీవ్ర లక్షణాలు కనిపించాయి. వీరిలో ఒక్కరుమాత్రమే ఫైజర్ టీకాను తీసుకున్నవారున్నారు. తీవ్రత స్వల్పంగాగల సైడ్ ఎఫెక్ట్‌లు కనిపించాయని, వాటినీ వెంటనే నయం చేయవచ్చునని సంస్థ తెలిపింది. కేవలం రెండు శాతం మంది వాలంటీర్లలో మాత్రమే నీరసం కనిపించిందని వివరించింది.
ఈ ఏడాదే ఐదు కోట్ల డోసులు:
ఈ ఏడాదిలోనే ఐదు కోట్ల టీకా డోసులను ఉత్పత్తి చేయాలని అంచనా వేస్తున్నట్టు ఫైజర్ పునరుద్ఘాటించింది. అంటే ఈ ఏడాదిలోనే 2.5కోట్ల మంది కోసం టీకా ఉత్పత్తికి ప్రణాళికలు వేస్తున్నది. ఒక వ్యక్తికి ఫైజర్ టీకా రెండు డోసుల చొప్పున వేయాల్సి ఉంటుంది. కాగా, వచ్చే ఏడాదిలో 130 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేస్తున్నది.
నెక్స్ట్ వ్యాక్సిన్స్ ఇవే..
కరోనా టీకా కోసం రేసు కొనసాగుతూనే ఉన్నది. ఫైజర్ తర్వాత ట్రయల్స్ డేటా రిలీజ్ చేసే జాబితాలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రా జెనెకా టీకా ఉండబోతున్నది. ఈ నెల లేదా వచ్చే నెలలో ఆక్స్‌ఫర్డ్ టీకా ట్రయల్స్ డేటా విడుదల చేసే అవకాశమున్నది. జాన్సన్ అండ్ జాన్సన్ కూడా ఇదే ఏడాదిలో డేటా ప్రకటిస్తామని తెలిపింది.
భారత్‌లో ఫైజర్ సాధ్యాసాధ్యాలపై పరిశీలన
ఇప్పటి వరకు చాలా టీకాలు ప్రోటీన్ బేస్డ్‌గా అభివృద్ధి చేశారు. తొలిసారిగా మొడెర్నా, ఫైజర్ టీకాలను మెస్సెంజర్ ఆర్ఎన్ఏ టెక్నాలజీతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ టీకాలను అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో నిల్వ ఉంచాల్సి ఉంటుంది. మనదేశం ఇప్పటివరకు ఎంఆర్ఎన్ఏ టీకాలను వినియోగించలేదు. ఫలితంగా కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో టీకాలను నిల్వ చేసే సదుపాయాలు లేవు. కాబట్టి, అంచనాలకు మించి సత్ఫలితాలను అందించిన ఫైజర్ టీకాను భారత్‌లో పంపిణీ చేయడం దాదాపు అసాధ్యమనే పరిస్థితులున్నాయి. కొవిడ్19పై వేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్ హెడ్, నిటి అయోగ్(హెల్త్) మెంబర్ డాక్టర్ వీకే పాల్ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దేశంలో అవసరానికి సరిపడా ఫైజర్ టీకాలు అందుబాటులో ఉండకపోవచ్చునని, కానీ, ఈ టీకా కొనుగోలు, పంపిణీ సాధ్యసాధ్యాలను భారత్ పరిశీలిస్తున్నదని వివరించారు. మైనస్ 70 డిగ్రీల దగ్గర నిల్వ చేయడం అతిపెద్ద సవాల్ అని, అయినప్పటికీ భారత్‌కు టీకాను తీసుకొచ్చే అంశంపై ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు.