‘చిప్’తో చీప్ ట్రిక్స్..!

by Anukaran |   ( Updated:2020-09-05 21:56:35.0  )
‘చిప్’తో చీప్ ట్రిక్స్..!
X

దిశ, క్రైమ్ బ్యూరో :

పెట్రోల్ బంకుల్లో అత్యాధునిక చిప్‌లను అమర్చి భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ పోలీస్, లీగల్ మెట్రాలజీ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ బంకుల్లోనూ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులకు కూడా సమాచారం అందించారు. దీంతో తెలంగాణలో 11 బంకులు, ఏపీలో 22 బంకులను పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం వివరాలు వెల్లడించారు. ఏపీలోని ఏలూరుకు చెందిన షేక్.సుభాని భాషా, బాజి బాబా, మాదాసు గిరి, ఇప్పిలి మల్లేశ్వర్ రావు‌లు ముఠాగా తయారయ్యారు. ఒక సాఫ్ట్‌వేర్‌‌తో ప్రత్యేక ప్రోగ్రాంను చాలా తెలివిగా డిజైన్ చేసి ఈ మోసాలకు ప్లాన్ చేశారన్నారు. ముంబయికి చెందిన జోసెఫ్, థామస్ అనే వ్యక్తుల వద్ద రూ.80 వేల నుంచి 1.20 లక్షలు ఖర్చయ్యే ఇంటిగ్రేటెడ్ చిప్‌లను తయారు చేయించి.. పెట్రోల్ బంకుల్లో డిస్ ప్లే వెనుక అమర్చుతున్నట్టు తెలిపారు.

ఇలా చిప్‌లు అమర్చడం వల్ల డిస్‌ప్లేలో మనకు లీటరు పెట్రోల్ (1000 మి.లీ) కొట్టించినట్టుగానే కనపడుతున్నా.. వాస్తవానికి మనకు 40 మి.లీ వరకు పెట్రోల్ తగ్గుతోందన్నారు. ఇదంతా పెట్రోల్ బంక్ యజమానులకు తెలిసే ఏడాదికి పైగా జరుగుతోందన్నారు. ఈ మొత్తం కోట్లల్లో ఉంటుందన్నారు. బాటిళ్లల్లో పెట్రోల్ పోసేటప్పుడు మాత్రం మోసం తెలియకుండా ఉండేందుకు నిజమైన పైప్ నుంచే పెట్రోల్ నింపుతారన్నారు. తెలంగాణలో రంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, ఆర్‌సీ పురంలలో 11 పెట్రోల్ బంకుల్లో ఈ చిప్‌లను గుర్తించినట్టు తెలిపారు. పోలీసులు, లీగల్ మెట్రాలజీ అధికారులు చెక్ చేసినా కూడా దొరకకుండా ఉండేందుకు దీనికొక ప్రత్యేక మదర్ బోర్డును తయారు చేశారన్నారు.

ఏపీలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో కూడా చిప్‌లను అమర్చినట్టు విచారణలో తేలడంతో ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. దీంతో తెలంగాణలో 11, ఏపీలో 22 బంకులు సీజ్ అయినట్టు తెలిపారు. తెలంగాణలో సీజ్ అయిన బంకుల్లో 4 బీపీసీఎల్, 2 హెచ్‌పీసీఎల్, 5 ఐఓసీఎల్ బంకుల్లో చిప్పులు అమర్చారు. వీటితో పాటు కర్నాటక, తమిళనాడులోని బంకుల్లో కూడా చిప్‌లను అమర్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడు ఎస్కే సుభానిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుంచి 14 చిప్‌లు, 8 డిస్‌ప్లేలు, 3 జీబీఆర్ కేబుల్స్, 1 మదర్ బోర్డు, 1 హ్యుందాయ్ ఐ 20 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సజ్జనార్ తెలిపారు.

Advertisement

Next Story