ఎప్పుడు పోతుందో తెలియదు.. మంత్రి పదవిపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

by srinivas |
ఎప్పుడు పోతుందో తెలియదు.. మంత్రి పదవిపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
X

ఏపీ, దిశ బ్యూరో: ఏపీలో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ చేయబోతున్నారని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని మొత్తం మార్చేసి.. కొత్త టీమ్ ను తీసుకుంటామని గతంలోనే సీఎం జగన్ ప్రకటించారు. జగన్ సర్కారు పదవీ బాధ్యతలు చేపట్టి.. రెండున్నర రేళ్లు కావడంతో మంత్రుల్లో టెన్షన్ నెలకొన్నది. ఇందుకు బలం చేకూర్చేలా ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. మంత్రులందరినీ మార్చేస్తారంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. తాజాగా మరో మంత్రి పేర్ని నాని సైతం ఈ విషయంపై మాట్లాడారు. సమాచార-రవాణా శాఖల మంత్రి పేర్ని నాని ఇటీవల మచిలీపట్నంలో సినీ నిర్మాతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నాకు మంత్రి పదవి మీద ఆశ ఎందుకుంటుంది? ఈ పదవి ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియదు’ అంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మంత్రుల మదిలో టెన్షన్ ..

మంత్రివర్గ మార్పుపై ఇప్పటికే మంత్రులు పేర్ని నాని, బాలినేని బహిరంగంగా మాట్లాడారు. అయితే మిగిలిన క్యాబినెట్ మంత్రులు అంతర్గతంగా ఈ విషయంపై టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. మొత్తం మంత్రివర్గాన్ని మార్చబోతున్నారా? లేక కొంతమందిని మాత్రమే మార్చబోతున్నారా? అన్న విషయంపై సైతం ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. మరోసారి సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని సీఎం జగన్ కొత్త టీంను ఏర్పాటు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? తదితర విషయాలపై సీఎం జగన్ సర్వే చేయిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి త్వరలోనే మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అన్న వార్తలకు రోజు రోజుకు బలం చేకురుతోంది.

Advertisement

Next Story