‘పరకాల’పై ప్రజల పట్టు.. ‘చల్ల’బరుస్తోన్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి

by Ramesh Goud |   ( Updated:2021-07-31 03:14:31.0  )
Parakala
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ప‌ర‌కాల జిల్లా ఏర్పాటు ఉద్యమం రోజురోజుకూ పెరుగుతోంది. నెల‌రోజుల క్రితం పురుడు పోసుకున్న జిల్లా సాధ‌న ఉద్యమం క్రమంగా జ‌న బాహుళ్యంలోకి వెళ్తోంది. ప‌ర‌కాల ప‌ట్టణం వ‌ర‌కే ప‌రిమిత‌మైన ఉద్యమం క్రమంగా మండ‌లాలు, గ్రామీణ ప్రాంతాల‌కు విస్తరిస్తోంది. స‌క‌ల జ‌నులు జిల్లా ఏర్పాటుకు మ‌ద్దతు ప‌లుకుతుండ‌టంతో రోజూ వివిధ సంఘాల నేతృత్వంలో నిర‌స‌న ర్యాలీలు, ప్రద‌ర్శన‌లు కొన‌సాగుతున్నాయి. వ్యాపారులు మొద‌లు దినస‌రి కూలీలైన హ‌మాలీల వ‌ర‌కు జిల్లా సాధ‌న ఉద్యమంలో భాగ‌స్వాములవుతుండ‌టం గ‌మ‌నార్హం.

అయితే ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నా.. ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి మాత్రం జిల్లా ఏర్పాటు అసాధ్యమ‌ని ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి ఎన్ని ఆటంకాలు సృష్టించినా, కేసులు బ‌నాయించిన జిల్లా ఏర్పాటు అయ్యేంత వ‌ర‌కు మా పోరాటం ఆగ‌ద‌ని జేఏసీ నేత‌లు స్పష్టం చేస్తున్నారు. అయితే జిల్లా ఏర్పాటు ఎమ్మెల్యేకు ఇష్టం లేద‌ని, ఆయ‌న‌కు హ‌న్మకొండ‌పైనే ప్రేమ ఉంద‌ని ప‌ర‌కాల ప్రజలు విమ‌ర్శిస్తున్నారు.

పరకాల జిల్లా ఏర్పాటు ఉద్యమం ఊపందుకోవ‌డంతో అధికార పార్టీ నేత‌లు సైతం ఇరుకున ప‌డుతున్నారు. జిల్లా ఏర్పాటును వ్యతిరేకించ‌లేక‌, ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి ఆజ్ఞల‌ను అనుస‌రించ‌లేక రాజ‌కీయ ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. కాగా, ఇప్పటికే జేఏసీ ఆధ్వర్యంలో ప‌ర‌కాల బంద్‌కు పిలుపునివ్వగా వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దీంతో జిల్లా ఏర్పాటు డిమాండ్ ప్రజ‌ల్లో బ‌లంగా ఉందని రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. దీన్ని ఎలా ప‌రిష్కరించుకోవాలో అర్థం కాక ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి త‌ల ప‌ట్టుకున్నట్లు స‌మాచారం.

Advertisement

Next Story