- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణం పోతుందన్నా.. బండి కదలట్లే..
దిశ, నల్లగొండ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో అత్యవసర సేవలు మినహా మిగతావన్నీఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజారవాణా పూర్తిగా స్తంభించిపోయింది. కేవలం సొంత వాహనాలు మాత్రమే అత్యవసర సమయాల్లో దిక్కుగా మారుతున్నాయి. ఇంతటి విపత్కార పరిస్థితుల్లో ఆ వాహనాలు సైతం సకాలంలో మరమ్మత్తులు లేక ముందుకెళ్లనని మొండికేస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా బైకులు, కార్లు, ట్రాక్టర్ రిపేర్ షాపులు తెరుచుకోలేదు. అయితే చాలా వాహనాలు సకాలంలో మరమ్మత్తులు లేక నిలిచిపోతున్నాయి. ఈ క్రమంలో మెకానిక్‌లను ఆశ్రయిద్దామంటే.. షాపులు మూసివేయడంతో ఎవరూ అందుబాటులో ఉండట్లేదు. దీంతో ఏం చేయాలో తెలియక వాహనదారులు సతమతమవుతున్నారు. మెకానిక్ దుకాణాలకు కొంతైనా వెసులుబాటు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మరీ దారుణం..
ప్రస్తుత రోజుల్లో ప్రజలకు ద్విచక్ర వాహనమే ప్రధాన రవాణా సాధనంగా మారింది. దాదాపుగా ఇంటికో బైక్ కంపల్సరీ అయ్యింది. ఎంతటి ఆపత్కాలంలోనైనా బైక్‌తోనూ ఎంత దూరమైనా ఈజీగా వెళుతున్నారు. అయితే, ద్విచక్ర వాహనాలు లాక్‌డౌన్ సమయంలో మరమ్మత్తులకు గురైతే రిపేర్ చేయించేందుకు మెకానిక్‌లు దొరకట్లేదు. ఏదైనా గమ్యాన్ని చేరుకునే సమయంలో వాహనం ఆగిపోతే వాహనదారులకు ఏం చేయాలో తెలియక కిలోమీటర్ల కొద్ది వాహనాన్ని నెట్టుకుంటూ వెళుతున్నారు. ఇక గర్భిణులు, జబ్బు చేసినోళ్లు ఆస్పత్రికి పోవాలంటే.. ఆటోలోళ్లు పోలీసులు కొడ్తరని రాట్లేదు. ఇంట్లో ఉన్న బైక్ మరమ్మత్తుల కారణంగా పనిచేయట్లేదు. ఎనకటి కాలంలో లెక్క ఎడ్లబండ్లే దిక్కయ్యాయి. అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండాల్సిన అంబులెన్సులు కరోనా రోగుల కోసం హైదరాబాద్ వెళ్లాయి. మొన్న ఈ మధ్య సూర్యాపేట జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో ఓ గర్బిణి నడిరోడ్డుపైనే ప్రసవించింది. ఆ ఘటన జరిగిన తెల్లారే నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రైవేటు వాహనంలో ఓ గర్బిణి ఆస్పత్రికి వెళ్తోంది. ఆ వాహనం పానగల్ సమీపంలోకి పోగానే ఆగిపోయింది. తెల్లవారుజాము సమయం కావడం.. అటుగా ఏ వాహనం రాకపోవడం.. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఆ గర్బిణి సైతం నడిరోడ్డు మీదనే ప్రసవించింది. దాదాపు రెండు గంటల పాటు నడిరోడ్డు మీదనే ఉండాల్సి వచ్చింది.
వ్యవసాయ పనులకు ఎసరు పెడుతున్న ట్రాక్టర్లు..
ప్రస్తుతం వ్యవసాయ పనులు సగానికిపైగా ట్రాక్టర్ల పైనే ఆధారపడి ఉన్నాయి. దున్నకం దగ్గరి నుంచి ధాన్యాన్ని ఇంటికి చేర్చే వరకు ట్రాక్టర్లే కీలకంగా ఉన్నాయి. అయితే ఇవి మరమ్మత్తులకు గురవుతుండడం.. మెకానిక్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల వ్యవసాయ పనులు నిలిచిపోతున్నాయి. వేసవి కాలంలో ధాన్యాన్ని మార్కెట్లకు చేర్చడం.. పెంట మన్ను పొలాల్లో తోలడం, గడ్డిని ఇంటికి చేర్చడం.. పత్తి కట్టె తొలగించడం, దుక్కులు పొతం చేయడం వంటి పనులన్నీ ట్రాక్టర్ మీదనే ఆధారపడ్డాయి. అయితే ఈ పనులు చేసే క్రమంలో ట్రాక్టర్‌పై లోడు ఎక్కువగా పడి మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. కానీ, మెకానిక్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల ట్రాక్టర్లను పక్కన బెడుతున్నారు. ఫలితంగా ఇటు ఉపాధి కోల్పోవడమే కాక ఎక్కడి వ్యవసాయ పనులు అక్కడే నిలిచిపోతున్నాయి.
ఎమర్జెన్సీ సిబ్బందికి అవే ఇబ్బందులు..
లాక్‌డౌన్ సమయంలో అత్యవసరంగా సేవలందిస్తోన్న పోలీసులు, వైద్య, విద్యుత్ తదితర శాఖల్లో పనిచేస్తోన్న అత్యవసర సిబ్బందికి అవే తిప్పలు తప్పడం లేదు. ప్రజారవాణా అందుబాటులో లేకపోవడంతో సొంత వాహనాలే దిక్కయ్యాయి. సొంత వాహనాలంటే.. మేజర్‌గా ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. రోజువారీ విధుల్లో భాగంగా డ్యూటీలకు వెళ్లే సమయంలో అవికాస్త మొరాయిస్తున్నాయి. దీంతో విధులకు ఎట్ల హజరుకావాల్నో తెలవట్లేదు. ముఖ్యంగా వైద్య సేవలందించే వారిలో ఎక్కువ మహిళలదే పాత్ర. ఆపత్కాలంలో సేవలు అందించి ఇంటికి రాకపోకలు సాగించే సమయంలో వారి ద్విచక్ర వాహనాలు మొరాయిస్తున్నాయి. దీంతో ఏం జేయాల్నో అర్థంకావడంలేదు. మెకానిక్ షాపులకు కొంత మేరైనా వెసులుబాటు ఇవ్వాలని.. లేకపోతే రాకపోకలకు ప్రభుత్వమే ఏవైనా వాహనాలను ఏర్పాటు చేయాలని పలువురు మహిళా వైద్య సిబ్బంది కోరుతున్నారు.
ముప్పుతిప్పలు పడ్డ : పాటి కృష్ణారెడ్డి, రైతు
నేను కేవలం నా వ్యవసాయ పనుల కోసమే ట్రాక్టర్ కొన్నా. వ్యవసాయ పనులకు ట్రాక్టర్ ఉపయోగపడే సీజన్ ఇదే. వెనుక గిల్లకు బేరింగ్‌లు పోయినయ్. బాగు చేయిద్దామని మెకానిక్ షాపుకు పోతే ఆడ ఎవళ్లు లేరు. మెకానిక్ ఫోన్ చేస్తే.. పోలీసోళ్లు కొడుతుర్రు నేను రానన్నడు. కల్లంల వడ్లు అన్నే ఉన్నయ్. మబ్బు చూస్తే వర్షం వస్తట్టుంది. ట్రాక్టర్ బాగు చేస్తందుకు మెకానిక్‌లు దొరకట్లే. వారం రోజుల నుంచి పక్కన పెట్టిన.
చెకప్ కోసమని..
ఈ చిత్రంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న పోలీసు వెనుక కూర్చున్న మహిళ అప్పుడే పుట్టిన పాపను ఆస్పత్రికి చెకప్ కోసం తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. ఎలాంటి వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఐదు కిలోమీటర్లకు పైగా కాలినడకన కోదాడలోని ఆస్పత్రికి చేరుకుంది. పాపకు చెకప్ పూర్తి కాగానే.. ఎప్పటిలాగానే కాలినడకన ఇంటికి బయలు దేరింది. పైనుంచి ఎండ వేడిమి.. చేతిలో చిన్నపాప.. మరోవైపు ఉక్కపోత.. ఇన్నీ బాధల్నీ తట్టుకుని కాలినడకన ఐదారు కిలోమీటర్లు నడవడం అనేది మాములు విషయం కాదు. దీన్ని గమనించిన కోదాడకు చెందిన ఓ ఏఎస్ఐ తన ద్విచక్ర వాహనంపై ఆ మహిళను ఎక్కించుకుని ఇంటి దగ్గర దించాడు.
అప్పుజేసి కిరాయి కట్టాలె : ఊడుగు నాగరాజు, చౌటుప్పల్
చౌటుప్పల్ లో బైక్ రిపేర్ దుక్నం నడిపిస్తున్న. దాదాపు 40 రోజులు కావొస్తుంది దుక్నం బంజేసి. ఇంట్ల పూటకెళ్లట్లే. కిరాయి నెలకు రూ.5వేలు కట్టాలె. లాక్‌డౌన్‌కు ముందు రోజుకు ఒకటో రెండో బండ్లు రిపేర్ చేస్తే ఆ రోజుకు పూట గడిచేది. ఏ రోజు రిపేర్లు వస్తే.. ఆ రోజుకే సరిపోయేది. లాక్‌డౌన్‌ల అదికూడా లేకపోయింది. చేతిలో చిల్లి గవ్వ లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలె.
Tags: vehicles, lunacy, people, problems, pregnant women, police, corona effect