కేటీఆర్ విషయంలో సర్వత్రా నిరసన.. కారణమేమిటంటే..?

by Shyam |   ( Updated:2020-06-17 02:18:22.0  )
కేటీఆర్ విషయంలో సర్వత్రా నిరసన.. కారణమేమిటంటే..?
X

కరోనా మహమ్మారి నేతల్లో బుగులు రేపుతోంది. ఈ వైరస్ కూలీ, అధికారి, ఎమ్మెల్యే, ఎంపీ అనే తేడా లేకుండా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. జనగామ ఎమ్మెల్యేతో పాటు మరో నలుగురికి పాజిటివ్ నిర్ధారణ కావటంతో జిల్లా నాయకుల్లో టెన్షన్ మొదలైంది. వారిని కలిసిన వారు క్వారంటైన్‌లోకి వెళుతున్నారు. ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు. సమస్యలను ఫోన్లలోనే పరిష్కరిస్తామని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న మంత్రి కేటీఆర్ వరంగల్‌‌లో పర్యటించనునన్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అసలే జిల్లాలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. నేతలూ వైరస్‌తో పోరాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మంత్రి పర్యటనకు వస్తుండడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

దిశ, వరంగల్: కరోనా మొన్నటి వరకు సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయగా, ప్రస్తుతం ప్రజాప్రతినిధులను కలవర పెడుతోంది. అధికార పార్టీకి చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తి‌రెడ్డి యాదగిరి‌రెడ్డికి కరోనా పాజిటివ్ రావటంతో ప్రజా‌ప్రతినిధులు అలర్ట్ అయ్యారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మిగతా లీడర్లందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇకపై ప్రజలెవరూ తమ వద్దకు రావొద్దని, తాము కూడా ప్రజల వద్దకు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. కరోనా తగ్గుముఖం పట్టేంత వరకు ఏవైనా సమస్యలుంటే ఫోన్ లో సమాచారం ఇస్తే చాలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మంత్రులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఇళ్లు ఉన్నప్పటికీ సొంతూళ్లలో ఉంటున్నారు. అక్కడి నుంచే గ్రామాల పర్యటన చేస్తున్నారు. మంత్రి దయాకర్ రావు పర్వతగిరిలో ఉంటున్నారు. మరో మంత్రి సత్యవతి రాథోడ్ సైతం పట్టణాల్లో ఉండకుండా పల్లెల్లోనే ఉంటూ కార్యక్రమాలకు హాజరవుతున్నారు.

సర్కార్ ఆస్పత్రికి కరోనా ఫీవర్

ములుగు జిల్లా కేంద్రంలోని సర్కార్ ఆస్పత్రికి కరోనా ఫీవర్ పట్టుకుంది. క్యాన్సర్ సోకిన రోగికి ములుగు ఏరియా ఆస్పత్రి‌లో వైద్యం అందించారు. అతనికి కరోనా టెస్టులు చేశారు. అతనికి పాజిటివ్ రిపోర్ట్ రావటంతో అతనికి వైద్య సేవలందించిన 30 మంది‌ని ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేశారు. మరో ఇద్దరిని ఇంటి వద్దే క్వారంటైన్‌లో ఉండాలని సూపరింటెండెంట్ జగదీశ్వర్, డాక్టర్ రవీందర్ చెప్పారు. ములుగు జిల్లాలోని నర్సింగాపూర్‌లో పాజిటివ్ నమోదు కావటంతో 53 మంది ఆశావర్కర్లు, ఏఎన్ఎమ్‌లు కలిసి ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 17న వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఆయన రాక కోసం జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే‌లు, అధికారులు వారం రోజులుగా హంగూ ఆర్భాటాలతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో కనీస నిబంధనలు పాటించడం లేదు. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉండడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed