ఉంటుందా? ఉండదా?.. ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్!

by Shyam |
ఉంటుందా? ఉండదా?.. ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు ఉంటుందా? ఉండదా ? ప్రస్తుతం ఏ ఇద్దరు ఉద్యోగులు ఒక దగ్గర చేరినా ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు అంతగా ఎందుకు చర్చ అనుకుంటున్నారా? ఇందుకు ఓ బలమైన కారణం ఉంది. తెలంగాణ ప్రభుత్వంతో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వస్తున్న ఓ ప్రధాన ఉద్యోగ సంఘం నేత మరికొన్ని గంటల్లో పదవీ విరమణ చేయనున్నారు.

సీఎంతో సత్సంబంధాలు

ఈ నేపథ్యంలో అధికార పార్టీ గతంలో హామీనిచ్చినట్లుగా పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతారా లేదా అనేది ఉద్యోగులందరిలో మెదులుతున్న ప్రశ్న. రాష్ట్రంలో ఎన్నో ఉద్యోగ సంఘాలున్నప్పటికీ రెండు ఉద్యోగ సంఘాల నేతలు సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ రెండు సంఘాలలోని ఓ సంఘం అగ్రనేతకు గతంలో శాసన మండలి చైర్మన్ పదవి కూడా దక్కింది. మరో సంఘం వ్యవస్థాపకుడు ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు పర్యాయాలు శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి పదవిని చేపట్టారు.

ఇలా ప్రధానమైన రెండు సంఘాల నేతలు ప్రభుత్వానికి అతి సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నప్పటికీ ఉద్యోగుల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా పీఆర్సీ, ఐఆర్, పదవీ విరమణ వయస్సు పెంపు వంటివి పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులను అసహనానికి గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓ ప్రధాన యూనియన్ అధ్యక్షుడు ఈ నెలఖారుతో పదవీ విరమణ చేయాల్సి ఉంది.

గతంలో మాదిరి ఇప్పుడు జరుగుతుందా?

ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం ఇప్పట్లో లేకపోతే భవిష్యత్తులోనూ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగే నాయకుడే పదవీ విరమణ చేయబోతుంటే, ఇక ఇతరుల సంగతేమిటనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)డాక్టర్ రమేష్ రెడ్డి పదవీ విరమణ చివరి రోజున బోధనాస్పత్రుల్లో పని చేసే వైద్యుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన నేటికి కూడా అదే పదవిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కూడా ఆ ఉద్యోగ సంఘం అగ్ర నాయకుని విషయంలో కూడా ఇదే జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది.

పిలుపు కోసం ఎదురు చూపులు

శనివారం ఐచ్చిక సెలవు అయినప్పటికీ ప్రభుత్వం నుంచి పిలుపు వస్తుందనే ఆశతో ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారు. నాంపల్లిలోని సంఘం ప్రధాన కార్యాలయంలో ఉదయం నుంచి ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు.

Advertisement

Next Story