రైతు ఆత్మహత్యకు తగిన మూల్యం చెల్లించుకున్నారు

by Sridhar Babu |

దిశ, కరీంనగర్ :
కాల్వశ్రీరాంపూర్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్య ఘటనపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారుల తీరుపై కన్నెర్ర చేశారు. దానికి కారణమైన వారిపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు. మంగళవారం వీఆర్వో, వీఆర్ఏలను సస్పెండ్ చేయగా, తహశీల్దార్‌ను కలెక్టరేట్ డి విభాగం సూపరింటిండెంట్‌గా బదిలీచేశారు. వివరాల్లోకి వెళితే..జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్ కార్యాలయం ఎదుట రాజిరెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతను రాసిన సూసైడ్ నోట్‌లో తహసీల్గార్ పేరుతో పాటు వీఆర్వో, వీఆర్ఏలను బాధ్యులుగా పేర్కొన్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. రైతు మరణంపై స్పందించిన పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులపై చర్యలకు పూనుకున్నారు. విచారణలో భాగంగా వారిపై రైతు చేసిన ఆరోపణలు నిజమేనని ప్రాథమిక ఆధారాలు లభించాయి. దీంతో వీఆర్వో గురుమూర్తి, వీఆర్ఏ సి.స్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే శ్రీరాంపూర్ తహశీల్దార్ వేణుగోపాల్‌ను కలెక్టరేట్ డి విభాగం సూపరింటిండెంట్‌గా బదిలీ చేశారు.అనంతరం శ్రీరాంపూర్ తహశీల్దార్‌గా సునీతను నియమించారు.

Advertisement

Next Story

Most Viewed