పీసీసీ వర్సెస్ సీఎల్పీ.. కాంగ్రెస్‌లో కీలక నేతల మధ్య కోల్డ్ వార్

by Anukaran |   ( Updated:2021-07-10 02:06:07.0  )
pcc revanth
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు తగాదాలకు కేరాఫ్.. అలాంటిది రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టాక ఎన్నో ఏళ్లుగా నిస్తేజంలో ఉన్న పార్టీకి ఓ ఊపు వచ్చింది. అయితే రేవంత్ కు పీఠం అప్పగించడంపై కొందరు సీనియర్లు అసంతృప్తితో పాటు ఆగ్రహానికి లోనయ్యారు. ఇది సహజమే అయినప్పటికీ.. పార్టీకి రెండు కళ్లలాంటి పీసీసీ చీఫ్, సీఎల్పీ నేతల మధ్య అప్పుడే కోల్డ్ వార్ స్టార్టవడమే ఇక్కడ అత్యంత కీలకమైన విషయం. ఆదిలోనే ఇద్దరు ముఖ్య నేతల మధ్య యుద్ధం మొదలు కావడంతో పార్టీ నేతలతో పాటు, క్యాడర్ లో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. మొన్నటి వరకూ భట్టిని అంత పట్టించుకోని రేవంత్ రెడ్డి.. పీసీసీ పదవి ఖాయం అయ్యాక సీనియర్లను కలిసే క్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కూడా భేటీ అయ్యేందుకు ప్రయత్నించగా.. ఆయన ఎంతకూ ఒప్పుకోలేదని సమాచారం. మల్లు రవి మధ్యవర్తిత్వం ద్వారా ఓకే చెప్పారని పార్టీవర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి నొచ్చుకున్నారని, దానికి రేణుక చౌదరీ ఆజ్యం సైతం తోడైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు.. భట్టికి పొగ పెట్టేందుకు రేణుక తన ప్రయత్నాలను ఇప్పటినుంచే ముమ్మరం చేసిందనే ప్రచారం ఊపందుకుంది.

మల్లు రవి మధ్యవర్తిత్వంతో..

వాస్తవానికి రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి కన్ఫామ్ అయ్యాక పార్టీ సీనియర్లందరినీ మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు. ఆ క్రమంలోనే సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్కతో కూడా భేటీకి సిద్ధమవగా ఆయన ఏమాత్రం అంగీకరించలేదని తెలుస్తోంది. అయితే భట్టి సోదరుడు మల్లు రవి మధ్యవర్తిత్తంతో గంటకు పైగా చర్చించి బుజ్జగిస్తేనే కలిసేందుకు ఓకే చేశాడని పార్టీ వర్గాలో ప్రచారం జరుగుతోంది. ఇది రేవంత్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించిందని.. అయినా సంయమనంతో ఉన్నారని ఆయన వర్గీయులు అంటున్నారు. అంతేకాదు మొదట ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నేతలందరితో హైదరాబాద్ లో రేణుక చౌదరీ ఇంట్లో రేవంత్ సమావేశం ఏర్పాటు చేస్తే, భట్టితో పాటు ఆయనవర్గానికి చెందిన నేతలు, పీసీసీ ఉపాధక్షుడిగా ఎన్నికైన భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, వారి అనుచర గణం హాజరు కాకపోవడం సైతం రేవంత్ కు ఆగ్రహం తెప్పించింది. పీసీసీ పదవీ స్వీకార కార్యక్రమానికి కూడా భట్టి విక్రమార్క బలవంతగానే హాజరైనట్లు ఆయన సన్నిహితులే చెబుతున్నారు.

సీఎల్పీ నుంచి భట్టిని తప్పించేలా..

రేణుక చౌదరీ, భట్టి విక్రమార్కకు ఒకరంటే ఒకరికి పడదు. రేణుక చౌదరీ గతంలో ఖమ్మం ఎంపీగా పోటీచేసినప్పుడు భట్టి తన ఓటమికి కారణమయ్యాడని.. అంతేకాక వర్గాలను ప్రోత్సహిస్తూ వచ్చాడనేది రేణుకవర్గం వాదన.. ఈ నేపథ్యంలో ఇద్దరూ గ్రూపులను ప్రోత్సహించుకుంటూ ఖమ్మంలో చివరికి కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో రేణుక సన్నిహితుడిగా పేరున్న రేవంత్ కు పీసీసీ పీఠం దక్కడంతో ఇక రేణుక వర్గం మళ్లీ ఎత్తులు వేస్తోంది. అంతే కాదు స్వయంగా రేవంత్ రెడ్డి, భట్టికి కూడా పడదు. ఈ క్రమంలో తమకు అనుకూలంగా లేని వ్యక్తి సీఎల్పీ నేతగా ఉంటే మళ్లీ గ్రూపు తగాదాలు ఖాయమనే భావనకు వచ్చిన ఆయన సీఎల్పీ నుంచి తప్పించేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. భట్టిని తప్పించి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు మరో ఇద్దరు నేతల పేర్లను కూడా సీఎల్పీకి ప్రతిపాదించేందుకు ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఢిల్లీ పెద్దల వద్దకు ఫిర్యాదులు..

2018లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఆరు స్థానాలు గెలుచుకున్నా అందులో నలుగురు కారెక్కారు. అయినా సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్క ఏమాత్రం వారిని ఆపలేకపోయారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి రాములు నాయక్ తరఫున ఎవరూ ప్రచారం చేయకపోవడంతో స్వయంగా ఆయనే తన బాధను వెల్లగక్కాడు. ఇక తన భుజాలపై వేసుకున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పార్టీ ప్రభావం చూపించలేకపోయింది. ఇక దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్, తదనంతర పరిణామాలు, పరిహారం ఇప్పించడంలో భట్టి పార్టీ లైన్ దాటి సీఎం కేసీఆర్ తో భేటీ అవడం కూడా పార్టీకి నష్టం చేసే విషయాలుగానే అధిష్టానం పరిగణించేలా చేశారు. అంతేకాదు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది కూడా పార్టీలో బాగా ప్రచారం జరిగింది. వీటన్నింటినీ చూపి అధిష్టానం వద్ద భట్టిని పూర్తిగా ఇరికించారు. అయితే వీటన్నింటిపై పార్టీ పెద్దలు ఢిల్లీ పిలిపించి మరీ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.

భట్టిని ఒంటరి చేసేలా..

రేవంత్ సహకారంతో రేణుక ఇప్పటికే భట్టికి చెక్ పెట్టేందుకు స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది. అంతేకాదు భట్టి వర్గాన్ని మెల్లిమెల్లిగా ఆయనకు దూరం చేసి ఒంటరిని చేయడంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్లాన్ చేసినట్లు పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. దీనిలో భాగంగానే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మైనార్టీ నాయకుడిపై పలు కేసులు నమోదవగా భట్టి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో.. ఇటీవల సదరు నాయకుడితో స్వయంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పూర్తి భరోసా ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను అధికార పార్టీ వారు కిడ్నాప్ చేశారనే ఆరోపణలు వచ్చినా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో క్యాడర్ మొత్తం తీవ్ర అసహనంతో ఉంది. అయితే అంతేకాదు భట్టి అనుకూల వర్గంతో కొందరు రేణుక అనుచరులు ఇప్పటికే మాట్లాడారని, వారు సైతం ఇప్పడు భట్టి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

కారు పార్టీవైపు భట్టి చూపు..?!

ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీలో భట్టి విక్రమార్కదే హవా.. ఉన్నంతలో ఆయన తన ప్రభను కొనసాగించారు. అయితే ఇప్పుడుకాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు, రేవంత్ కు పీసీసీ పీఠం కట్టబెట్టడం, అధిష్టానానికి తనపై ఫిర్యాదు చేయడం, చివరకి సీఎల్పీ నుంచి కూడా తప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం కావడం, తనను పార్టీలో ఏమాత్రం పట్టించుకోకపోవడంతో భట్టి విక్రమార్క టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నట్లు ఆయన అత్యంత సన్నిహితులు అంటున్నారు. అంతేకాదు ప్రభుత్వంపై గత కొన్నేళ్లుగా ఆయన మెతక వైఖరి ప్రదర్శిస్తుండడం కూడా అందుకే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ సీఎల్పీ నేత నుంచి భట్టిని తప్పిస్తే పార్టీ మారడం తథ్యమంటున్నారు. దీనిపై అటు టీఆర్ఎస్ అధిష్టానం నుంచి, ఇటు భట్టి నుంచి కూడా ఒకరికి ఒకరు సంకేతాలు ఇచ్చిపుచ్చుకున్నారని కూడా తెలుస్తోంది. అందుకే మరియమ్మ లాకప్ డెత్ విషయంలో సీఎం కేసీఆర్ ఆ స్థాయిలో స్పందించారని కూడా వర్తాలు వస్తున్నాయి.

భట్టి, రేవంత్ మధ్య రేణుక ఆజ్యం..

పార్టీ పగ్గాలు చేపట్టగానే భట్టి తీరుపై అసహనంతో ఉన్న రేవంత్ రెడ్డికి.. రేణుక చౌదరీ ఇంకా ఆజ్యం పోస్తుందనే చర్చ తీవ్రంగా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పదేపదే కొత్త పీసీసీ చీఫ్ కు రేణుక అనుచరులు ఫిర్యాదులు చేయడం చేస్తున్నారని కొందరు నేతలు చెబుతున్నారు. అయితే ఆమె తీరుపై కూడా కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ గ్రూపులను ప్రోత్సహించకుండా, ఏ ఒక్కవర్గానికి తావివ్వకుండా రేవంత్ తన పని తాను చేసుకుపోవాలని, లేకపోతే మళ్లీ కాంగ్రెస్ పరిస్థితి దెబ్బతింటుందని కాంగ్రెస్ అభిమానులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed