బీసీసీఐ Vs పీసీబీ

by Shyam |
బీసీసీఐ Vs పీసీబీ
X

దిశ, స్పోర్ట్స్: బీసీసీఐ క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జరుగకుండా ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో అన్నింటిని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) వినియోగించుకుంటున్నది. మొదటి నుంచి ఐపీఎల్ అంటే ఒక రకమైన వ్యతిరేకత పెంచుకున్న పీసీబీ ఇప్పుడు ఏకంగా ఈ సీజన్‌లో జరగాల్సిన లీగ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏ సమయంలో, ఏ ప్రదేశంలో లీగ్ నిర్వహించాలని బీసీసీఐ భావించిందో అదే సమయంలో, అక్కడే ఆసియాకప్ నిర్వహిస్తామని ప్రకటించింది. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో మిగిలిన నాకౌట్ మ్యాచ్‌లను నవంబర్‌లో పెడతామని చెబుతున్నది. మొత్తానికి ఈ ఏడాదిలో ఐపీఎల్ జరుగకుండా అడ్డుకోవాలని, తద్వారా బీసీసీఐని ఆర్థికంగా దెబ్బతీయాలని పెద్ద ప్లాన్ వేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఆసియా కప్ శ్రీలంకలో..

ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఐపీఎల్ నిర్వహణ ఇక్కడ సాధ్యం కాదని, యూఏఈ లేదా శ్రీలంకలో ఆసియాకప్ నిర్వహిస్తామని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఈ వార్త బయటకు వచ్చిన గంటల్లోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బాంబు పేల్చింది. శ్రీలంక వేదికగా సెప్టెంబర్‌లో ఆసియాకప్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా నవంబర్ మొదటి వారంలో పీఎస్ఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను కూడా జరుపుతామని చెప్పింది. వాస్తవానికి బీసీసీఐ తమ లీగ్‌ను శ్రీలంకలో జరుపడానికి మొగ్గుచూపుతున్నదన్న అంతర్గత సమాచారం మేరకే పీసీబీ ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు. శ్రీలంకలో కరోనా కేసులు తక్కువగా ఉండటమే కాకుండా అక్కడ విదేశీ, దేశీయ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. స్టేడియాలు, మౌలిక సదుపాయాలు కూడా బాగుంటాయి. అందుకే బీసీసీఐ అటు మొగ్గు చూపింది. కానీ, ఇప్పుడు ఆసియాకప్ సెప్టెంబర్‌లో శ్రీలంకలో నిర్వహిస్తామని చెప్పి ఐపీఎల్‌కు గండి కొట్టే ప్రయాత్నాలు చేస్తున్నది.

మొదటి నుంచి అదే ధోరణి

కరోనా వైరస్ నేపథ్యంలో ఐపీఎల్ వాయిదా పడిన నాటి నుంచి బీసీసీఐ ప్రత్యామ్నాయ మార్గాలకు పాక్ అడ్డు పడుతూ వస్తున్నది. టీ20 వరల్డ్ కప్‌ను రద్దు చేయించి, ఆ సమయంలో ఐపీఎల్ ఆడించాలని బీసీసీఐ చూస్తున్నదని ఆరోపించింది. ఒక దేశవాళీ లీగ్ కోసం ఐసీసీ ఈవెంట్‌ను వాయిదా వేస్తారా అంటూ ముందుగానే విమర్శలు చేసింది. కానీ, బీసీసీఐ ఏనాడూ టీ20 వరల్డ్ కప్ రద్దు చేయాలని కోరలేదు. దానిపై ఐసీసీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే మేం ముందుకెళ్తామని చెప్పింది. వాస్తవానికి ఈ ఏడాది ఆసియాకప్ నిర్వహణ బాధ్యత పీసీబీదే. కానీ, ఏ సమయంలో ఎక్కడ నిర్ణయించాలో ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) నిర్ణయించాలి. కానీ, ఎలాంటి సమావేశం లేకుండా పీసీబీ ముందుగానే తన సొంత నిర్ణయాలు తీసుకోవడం కూడా బీసీసీఐకి నచ్చట్లేదు. పీసీబీకి ఆసియాకప్ నిర్వహించాలనే చిత్తశుద్ధి ఉంటే ఏసీసీతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కానీ, ఇతర దేశాల క్రికెట్ వ్యవహారాలను చెడగొట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పీఎస్ఎల్‌ను వాయిదా వేయడమో లేదా వేరే సమయంలో నిర్వహించుకోవడమో చేయాలని బీసీసీఐ కోరినా పీసీబీ మాత్రం పట్టించుకోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed