ఐపీఎల్ అడ్డుకునేందుకు పాక్ ప్రయత్నాలు !

by Shyam |
ఐపీఎల్ అడ్డుకునేందుకు పాక్ ప్రయత్నాలు !
X

ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్‌ను అడ్డుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు మొదలు పెట్టిందా ? అంటే అవుననే అనిపిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ టోర్నీ వాయిదా పడగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించే అవకాశాలు లేవు. దీంతో బీసీసీఐ ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ఐపీఎల్ నిర్వహిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై బీసీసీఐ ఇంత వరకు స్పందించనే లేదు. కానీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుగానే అడ్డుపుల్లలు వేస్తోంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్‌లో ఆసియా దేశాలతో దుబాయ్ వేదికగా పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఆసియా కప్ నిర్వహించాల్సి ఉంది. టోర్నీ నిర్వహణపై ఈ సారి నిర్ణయాధికారం పాకిస్తాన్‌దే. దీంతో ఐపీఎల్ కోసం ఆసియాకప్‌ను వాయిదా వేయమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహ్సాన్ మణి అన్నారు. అంతకు కొన్ని గంటల ముందే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మనుగడకు బీసీసీఐ అవసరం లేదని మండిపడిన ఎహ్సాన్ మణి.. ఈసారి ఏకంగా ఐపీఎల్‌ను టార్గెట్ చేసినట్టుగా కనబడుతోంది.

‘ఆసియా కప్ జరిగితే ఎన్నో దేశాల క్రికెట్ బోర్డులకు లాభదాయకమని, తద్వారా వచ్చే డబ్బును ఆయా దేశాల్లో క్రికెట్ అభివృద్దికి ఉపయోగించవచ్చని ఎహ్సాన్ అన్నారు. ‘కేవలం బీసీసీఐ కోసం ఈ టోర్నీని వాయిదా వేయలేమని, అయినా ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లోని ఇతర సభ్య దేశాలను కూడా అడగాల్సిన అవసరం ఉందని’ ఆయన అభిప్రాయపడ్డాడు. కాగా, డబ్బుల నష్టాన్ని చూపించి ఇతర ఆసియా దేశాల క్రీడాకారులను ఐపీఎల్‌కు దూరంగా ఉంచాలని పాకిస్తాన్ ప్లాన్ చేస్తున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ఆసియా కప్ జరగాల్సిందే.. అదే సమయంలో ఐపీఎల్‌కి ఇబ్బంది కలగకుండా షెడ్యూల్ చేసుకోవచ్చు. కానీ, పాకిస్తాన్ అసలు ఐపీఎల్ జరగకూడదని కోరుకుంటుందనే విషయమ స్పష్టమవుతోంది. ఐపీఎల్‌లో పాకిస్తాన్ మినహా అన్ని ఆసియా జట్ల క్రీడాకారులు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల క్రీడాకారులు పలు ఫ్రాంచైజీల్లో కీలక సభ్యులుగా ఉన్నారు. తమ క్రీడాకారులకు డబ్బు, మ్యాచ్ ప్రాక్టీస్ అవుతుంటే ఇతర బోర్డులు మాత్రం ఐపీఎల్‌ను ఎందుకు తిరస్కరిస్తాయి. ఒకసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరిగితే దీనిపై నిర్ణయం తీసుకునే వీలుంది.

Tags: IPL, Pakistan, Asia cup, BCCI, cricket board chairman

Advertisement

Next Story

Most Viewed