పవర్‌స్టార్‌ది వ్యూహాత్మక మౌనమేనా !

by srinivas |
పవర్‌స్టార్‌ది వ్యూహాత్మక మౌనమేనా !
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రశ్నిస్తూ పాలిటిక్స్‌ చేస్తానన్న పవన్ కల్యాణ్ వైఖరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి జనసేన అధినేత అనుసరిస్తున్న విధానం, నడిపిస్తున్న ఉద్యమం ఎవరికీ అంతుచిక్కడం లేదు. 2014ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీతో దోస్త్ కట్టిన ఆయన తర్వాత జరిగిన పరిణామాలతో పక్కకు జరిగి ఇరుపార్టీలపై గబ్బర్ సింగ్ డైలాగులు పేల్చారు. మళ్లీ 2019ఎన్నికల్లో వామపక్ష పార్టీలు, బీఎస్పీతో జతకట్టి ఘోరంగా ఓడిపోయాక మళ్లీ పాత స్నేహితుడు బీజేపీకి సుస్వాగతం చెప్పారు. దీంతో ఆరేళ్ల రాజకీయ ప్రస్థానంలో పార్టీలతో ఫ్రెండ్ షిప్‌‌ను వెంట వెంటనే వదిలించుకొని తన దారి తాను చూసుకోవడం విశ్లేషకులకు సైతం ఊహకందని విధంగా మారింది. ఇప్పుడు అదే క్రమంలో రాజధానులపై ఆయన చేసిన కామెంట్స్ సైతం గతంలో పార్టీలతో పొత్తులకు ముడిపడినట్లే ఉండటం తీవ్ర చర్చకు దారితీస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులపై అసెంబ్లీలో ప్రకటన చేయడానికి ముందు పవన్ కల్యాణ్ రాయలసీమ ప్రాంతంలో పర్యటించినప్పుడు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికీ పవన్ ఇంకా బీజేపీతో దోస్త్ కన్ఫామ్ చేసుకోలేదు. ఇక్కడికి హైకోర్టు వస్తేనే సీమ ప్రాంత ప్రజలు బాగుపడతారని, వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లతో రాయలసీమ ప్రజల్లో ఇంకాస్త ఇమేజ్‌‌ను క్యాచ్ చేసుకునేందుకు వ్యూహం రచించారు. కానీ పవన్ డిమాండ్ చేసిన కొన్నిరోజులకే సీఎం జగన్ మూడు రాజధానులంటూ ప్రకటన చేయడంతో ఒక్కసారిగా పవన్ యూటర్న్ తీసుకున్నారు. నవ్యాంధ్రకు అమరావతి రాజధానిగా ఉండాలని జగన్‌ తీరుపై మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ రైతులకు భరోసా ఇస్తూ అమరావతి ఇక్కడి నుంచి తరలిపోదని వారికి దైర్యం నూరి పోశారు.

కానీ పవన్‌ వ్యాఖ్యలను మీడియా, రాజకీయ నేతలు గుర్తు చేయడంతో కర్నూలులో న్యాయ రాజధాని ఉంచి అమరావతిలో ఎగ్జిక్యూటివ్, శాసన రాజధానిగా కొనసాగించాలని మళ్లీ ఎత్తుకు పైఎత్తు వేసేలా మాట్లాడారు. మళ్లీ మూడు రాజధానుల బిల్లులపై గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాక ఓ ప్రకటన విడుదల చేసి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రైతులు, ప్రజల మనోభావాలు కాపాడాలని ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇదే క్రమంలో కేంద్రం సైతం రాజధానుల అంశం రాష్ట్రానికి సంబంధించినదని స్పష్టం చేయడంతో రాష్ట్ర బీజేపీ సైతం అచీతూచి వ్యవహరించింది. దీంతో పవన్ కూడా ఒక్కమాట మాట్లాడకుండా ఉంటున్నారు. గతంలో రాజధాని రైతులకు అండగా ఉంటానని చెప్పిన పవన్‌.. ఇప్పుడేం మాట్లాడకుండా ఉండేసరికి రాజకీయ వర్గాల్లో సైతం అంతుచిక్కడం లేదు. రైతులకు ఎవరు మద్దతివ్వకున్నా ఒక్కడినే మాట్లాడుతా.. ఒక్కడినై కొట్లాడుతానన్న పవర్ స్టార్… ఇప్పుడు రాష్ట్రంలో మూడు రాజధానులపై వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తుంటే పల్లెత్తు మాట అనకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అయితే పవన్‌ కల్యాణ్ మూడు రాజధానుల అంశంపై మాట్లాడకపోవడానికి మూడు కారణాలున్నాయని అందుకే అచితూచి వ్యవహరిస్తున్నారని పొలిటికల్‌ సర్కిల్‌లో పాయింట్ తెరమీదకు వచ్చింది. స్టేట్‌లో బీజేపీ, జనసేన పొత్తులో ఉండటం వల్ల మూడు రాజధానులపై కేంద్రం ఇప్పటికే స్పష్టం చేయడంతో ఏం అనలేక పోతున్నారన్నది ఓ పాయింట్ అయితే అమరావతిని రాజధానిగా ఉంచాలని టీడీపీ డిమాండ్ చేస్తున్న తరుణంలో మళ్లీ అదే పాయింట్ ఎత్తుకుంటే టీడీపీతో జతకట్టే జనసేన ఇలాంటి కామెంట్లు చేస్తుందన్న ఆరోపణలు వస్తాయన్నది రెండో పాయింట్‌గా చెబుతున్నారు. ఇక మూడో విషయానికి వస్తే ఒక్క అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉండాలని పట్టుబడితే.. ఉత్తరాంధ్ర, రాయలసీమలో పార్టీకి ఉన్న పట్టు కోల్పోతుందని అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఏం మాట్లాడకుండా సమయం వచ్చినప్పుడు వ్యూహత్మకంగా మాట్లాడే అవకాశం ఉందని విశ్లేషకుల నుంచి వినపడుతున్న మాట. ఈ నేపథ్యంలోనే రోజుకో ట్విస్ట్ మూడు రాజధానులపై వస్తుండటంతో బీజేపీతో కలిసి పవన్‌ ఏ స్టాండ్ తీసుకొని మళ్లీ పాలిటిక్స్‌లో స్పీడప్ అవుతారన్నది ముందు ముందు చూడాల్సిన అంశం.

Advertisement

Next Story