వద్దని కొందరు… సై అని మరికొందరు…

by Ramesh Goud |
వద్దని కొందరు… సై అని మరికొందరు…
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై ఆసక్తికరమైన చర్చ సాగినట్టు సమాచారం. శనివారం శామీర్‌పేట్‌లోని ఈటల రాజేందర్‌ను కలిసేందుకు వెళ్లిన హుజురాబాద్ నాయకులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు ఈ చర్చకు తెరలేపినట్టుగా తెలుస్తోంది. సామరస్యంగా వ్యవహారాన్ని సెటిల్ చేసుకుంటే బావుంటుందన్న అభిప్రాయాన్ని కూడా ఈటల ముందు కొంతమంది వ్యక్త పరిచినట్టు సమాచారం. అధినేత కేసీఆర్‌తో విబేధించిన చాలా మంది రాజకీయాల్లో సక్సెక్ కాలేకపోయారన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే బెటర్ అన్న సూచనలు కూడా చేశారని, అయితే మరికొందరు మాత్రం పొమ్మన లేక పొగపెడుతున్న టీఆర్ఎస్‌లో కొనసాగడం సరికాదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అధినేత అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా పార్టీలో సీనియరైన ఈటలను అవమానించినట్టేనని అన్నట్టుగా తెలుస్తోంది. గులాబీ జెండాను వదిలేసి ప్రత్యక్ష్య పోరాటానికి దిగి సత్తా ఏంటో చూపించాల్సిన సమయం ఆసన్నమైందని ఈటలకు వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్తున్నారని సమాచారం. వారితో ఈటల తనమనసులోని మాట బయటపెట్టకపోయినప్పటికీ అందరి అభిప్రాయాలను మాత్రం తెలుసుకుంటూ మౌనంగా ఉన్నారట.

అక్కడేం జరుగుతోంది… ?

శామీర్‌పేట్‌లోని ఈటల నివాసంలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ఓ వైపున ఇంటలీజెన్స్ మరో వైపున పార్టీ నాయకులు ఎప్పటికప్పడు ఆరా తీస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుండే ఈటల ఇంటివద్ద మోహరించిన నిఘా వర్గాలు చీమ చీటుక్కుమన్నా చీఫ్‌కు సమాచారం చేరవేస్తున్నాయి. అలాగే ఈటల సెకండ్ క్యాడర్‌తో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్లలో మాట్లాడుతూ ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునే పనిలో పడ్డారు. ఫైనల్ గా ఈటల నిర్ణయం ఏంటో అన్న విషయంపై అంచనా వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed