వామ్మో.. ఈ ఉద్యోగం మాకొద్దు బాబోయ్

by Anukaran |   ( Updated:2020-08-30 22:41:43.0  )
వామ్మో.. ఈ ఉద్యోగం మాకొద్దు బాబోయ్
X

దిశ, న్యూస్ బ్యూరో : నిరుద్యోగం తాండవిస్తున్నా పంచాయతీ కార్యదర్శులు రాజీనామా బాట పడుతున్నారు. పంచాయతీల్లో నెలకొన్న సమస్యలు, రాజకీయాలు, నిధుల కొరతతో పాటుగా పనిభారం పెరగడం, ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేస్తున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 176 మంది పంచాయతీ సెక్రెటరీలు విధులకు రామంటూ రాజీనామా లేఖలు సమర్పించారు. తాజాగా ప్రభుత్వం పెట్టిన ఆంక్షలతో రాష్ట్ర వ్యాప్తంగా మరికొంత మంది కూడా తమ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అసలు సవాలక్ష పనులతో సతమతమవుతున్న పంచాయతీ కార్యదర్శులకు ఇప్పడు పన్నుల వసూళ్లు, హరితహారం మొక్కలు, పల్లె ప్రకృతి వనాలను టార్గెట్‌గా పెట్టారు. కరోనా కష్టకాలం, గ్రామాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 70 శాతం పన్నులను 15 రోజుల్లో వసూలు చేయాలని, లేకుంటే జీతాలు వేయడం కష్టమేనని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

కొలువు చేయడం కష్టమే

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగ భద్రత లేక పనిభారం ఎక్కువై, జీతం తక్కువై కష్టాల కడలిలో కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం విపరీతమైన పని భారం మోపడంతో ఉద్యోగం చేయలేక ఒత్తిడిని తట్టుకోలేక త్రిశంకు స్వర్గం‌లో కొట్టుమిట్టాడుతున్నారు. ఏ ఉద్యోగులకూ లేని కఠినమైన నిబంధనలు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియమావళిలో చేర్చారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలోని 7వేల మంది పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగం చేయడమా, మానివేయడమా? అనే మీమాంసలో ఉన్నారు. 2018 అక్టోబర్‌లో ప్రభుత్వం రాష్ట్రంలోని 9,355 పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ నిర్వహించింది. జిల్లాస్థాయిలో మెరిట్‌ సాధించిన వారికి 2019 ఏప్రిల్‌ నెలలో హడావుడిగా నియామక పత్రాలను జిల్లా కలెక్టర్లు అందజేశారు. డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంఫిల్‌, పీహెచ్‌డీ చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలు సాధించారు. రాక రాక సర్కారు ఉద్యోగం రావడంతో సంబురపడ్డారు. కానీ వారి సంబరం కొద్ది రోజుల్లోనే ఆవిరైపోయింది. అన్ని శాఖల సర్కారు ఉద్యోగులకు ప్రతి నెలా ఠంచనుగా 1వ తేదీన జీతాలు వస్తుండగా జేపీఎస్‌లకు మాత్రం మూడు నెలలకోసారి జీతాలు ఇస్తుండటంతో వారి కుటుంబాల్లో నిరాశ ఏర్పడింది. జీతాలు ఆలస్యంగా రావడంతో వారి కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారింది. దీనికి తోడు ప్రభుత్వం విపరీతమైన పని ఒత్తిడి పెట్టడంతో మానసికంగా, ఆర్థికంగా నష్టపోతూ శారీరకంగా అలసిపోయారు. చాలామంది ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రైవేట్‌ ఉద్యోగాల వైపు పరుగులు తీస్తున్నారు. ఇంత కాలంగా ఉన్నజాయింట్‌ చెక్‌‌పవర్‌ పోవడం, మరిన్ని అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేయడం, అడ్డగోలు నిబంధనలతో కొత్త చట్టం రావడం మూలిగే నక్కపై తాటిపండు పడిన విధంగా తయారైంది.

కరోనా వేళ కాసుల వసూల్

తాజాగా పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన ఆదేశాలతో మరింత మంది ఉద్యోగాలను వదులుకోవాలని భావిస్తున్నారు. కరోనా దుర్భర పరిస్థితుల్లో రోజువారీగా గ్రామంలో మందులు పిచికారీ చేయించడం, కరోనా బాధితులను చూసుకోవడం ఉండగా… అవన్నీ కాదని పన్నుల వసూళ్లు చేయాలని ఆదేశాలిచ్చారు. సెప్టెంబర్ 15 వరకు 70 శాతం పన్నులు వసూలు కావాల్సిందే. లేకుంటే ఉద్యోగానికి గండమే. అలాగే ఇన్నిరోజులు హరితహారం మొక్కలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు హడావుడిగా ఆదేశాలిచ్చింది. ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలను నాటాలని, పంచాయతీ కార్యదర్శులదే బాధ్యత అని ఆదేశించింది. పల్లె ప్రకృతివనాల నిర్వహణ, ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ వంటి కొత్త బాధ్యతలన్నీ మోపడంతో నౌకరీ చేయడమే కష్టంగా మారింది. ఇక గ్రామాల్లో సర్పంచులు, కార్యదర్శులకు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. మండలస్థాయి అధికారులు రాచిరంపాన పెడుతున్నారు. ఉద్యోగంలో తక్కువ అనుభవం, ఎక్కువ పనిభారం ఉండటంతో మానసికంగా కుంగిపోయి ఉద్యోగాలు మానుకుంటున్నారు. మండలస్థాయి అధికారులు అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రతిరోజు (సెలవు రోజుల్లో కూడా) ఆఫీసుకు పిలిపించుకొని నానా నిబంధనలు పెడుతున్నారు. పొద్దంతా గ్రామంలో పాలకవర్గ సభ్యులతో అలసిపోయి ఎంపీడీవో కార్యాలయానికి వస్తే సమీక్ష సమావేశాల పేరిట అక్కరకురాని విషయాలతో రాత్రి వరకు సమీక్షలు నిర్వహించి ఉద్యోగాలు చేయలేని పరిస్థితి కల్పిస్తున్నారు.

నిధుల్లేవ్

మరోవైపు పంచాయతీల్లో నిధుల్లేకపోవడం కూడా పంచాయతీ కార్యదర్శులపై భారం పడుతోంది. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతినెలా ప్రభుత్వం రూ.339 కోట్లు విడుదల చేస్తున్నా.. ఒక్కో గ్రామానికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకే వస్తున్నాయి. పెద్ద గ్రామాల పరిస్థితి కొంత ఫర్వాలేకున్నా చిన్నగ్రామాల్లో నిధులు సమస్యగా మారాయి. అయితే పంచాయతీ పాలకవర్గాల ఖర్చులు, మండలాధికారుల పర్యటనల ఖర్చుతో పాటు ఇప్పుడు ప్రతిరోజూ గ్రామంలో సమావేశాలు ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. వీటి ఖర్చులు కూడా కార్యదర్శులదే. రోడ్ల నిర్వహణకు కూడా రూపాయి రావడం లేదు. గుంతలు లేని రోడ్ల కోసం మొరం పోయించడం, చదును చేసేందుకు వేల రూపాయలు ఖర్చు అవుతున్నా వాటికి రూపాయి విదల్చడం లేదు. మరోవైపు ప్రభుత్వం పారిశుధ్య కార్మికులు, మల్టీపర్పస్ ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పల్లెప్రగతి నిధులు వాటికే సరిపోతున్నాయి. దీంతో ఖర్చులకు చిల్లిగవ్వ ఉండటం లేదు. బిల్లులు పెడుతున్నా విడుదల చేయడం లేదు. కార్యదర్శులకు రూ.15 వేలు వేతనం చెల్లిస్తామని ప్రకటించిన ప్రభుత్వం వాటిని సక్రమంగా చెల్లించడం లేదు. వచ్చిన వేతనం కూడా చాలకపోవడం, గ్రామాల్లో ఖర్చులు పెరిగిపోవడంతో కార్యదర్శులు విధులపై ఆసక్తి చూపడం లేదు. లక్ష్య సాధనలో విఫలమైతే మూడేళ్ల తర్వాత వారి ఉద్యోగం పర్మినెంట్‌ కాదని కొత్త చట్టంలో ఆంక్షలు విధించారు. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు పంచాయతీ కార్యదర్శి జవాబుదారీ అని, పంచాయతీలో ఏది జరిగినా ఆయనే బాధ్యత వహించాలని కూడా సర్కారు స్పష్టం చేసింది. ఇటీవల ఉపాధి పనులను కూడా వారిపైనే పెట్టడంతో, హరితహారంలో మొక్కలు నాటేందుకు కూలీలు దొరకక స్వయంగా ఇండ్లకు వెళ్లి కూలీలను తీసుకువచ్చిన పరిస్థితి చాలా గ్రామాల్లో నెలకొంది. దీనికి తోడుగా పంచాయతీకి నిధులు రాకపోవడంతో పారిశుద్ధ్యం, వీధిలైట్ల ఏర్పాటు, తాగునీటి సరఫరా వంటి సమస్యలు పరిష్కరించలేక పోవడంతో వారిపై ప్రజలు, ప్రతిపక్షాల ఒత్తిడి పెరిగింది.

ఆ కొలువులు మాకొద్దు

ఏ ప్రభుత్వ శాఖలో అయినా ఉద్యోగం రాగానే విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. ఇక్కడ మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. మొత్తం పోస్టుల్లో 1310 మంది మొదట్లోనే వదులుకున్నారు. వీరిలో కొంతమంది బాధ్యతలు స్వీకరించినా మొదటి మూడు నెలల జీతం తీసుకోకుండానే వెళ్లిపోయారు. ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్లను ఎదుర్కోలేక మరికొంతమంది నిష్క్రమిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వెంటనే పే స్కేల్‌ అమలవుతుంది. కానీ పంచాయతీ కార్యదర్శి కొలువు ఇందుకు మినహాయింపు. మూడేళ్ల వరకూ నెలసరి వేతనం కింద రూ.15 వేలు మాత్రమే ఇస్తారు. మూడేళ్ల తర్వాత పనితీరును మదింపు చేస్తారు. సంతృప్తికరంగా ఉంటేనే శాశ్వత ఉద్యోగిగా గుర్తిస్తారు. జీతం తక్కువగా ఉండటం, పర్మినెంట్‌ చేసేందుకు మొక్కలు 85 శాతం బతకడం సహా అనేక నిబంధనలు పెట్టడంతో తీవ్ర అసంతృప్తి చెంది రాజీనామా చేస్తున్నామని చెబుతున్నారు.

జిల్లాల వారీగా రాజీనామాలు

నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకూ 139 మంది రాజీనామా చేయగా, ఆదిలాబాద్‌ జిల్లాలో 62 మంది, ఉమ్మడి మెదక్‌లో 212 మంది, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 142 మంది రాజీనామా చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 163 మంది ఈ ఏడాది మే వరకు పంచాయతీ కార్యదర్శి పోస్టులను వదిలేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 267 మంది, రంగారెడ్డి జిల్లాలో 61 మంది, వరంగల్ జిల్లాలో 214 మంది ఇప్పటికే రాజీనామా చేశారని పంచాయతీ కార్యదర్శుల సంఘం వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed