రూపాయికే ఇడ్లీ అందిస్తున్న సర్పంచ్

by vinod kumar |
రూపాయికే ఇడ్లీ అందిస్తున్న సర్పంచ్
X

దిశ, వెబ్ డెస్క్: రూపాయికే ఇడ్లీ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు.. కమలాతాళ్. తమిళనాడులోని పెరూర్‌కి చెందిన ఈ బామ్మ 80 ఏళ్ల వయసులోనూ ఇడ్లీలు తయారు చేసి ఒక్క రూపాయికే అమ్ముతూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఎంతోమంది నష్టాల్లో కూరుకుపోయారు. కమలాతాళ్ కూడా నష్టాలను చవిచూసింది. కానీ తాను మాత్రం ఇడ్లీల ధరను ఏ మాత్రం పెంచలేదు. వలస కూలీలు, పేద ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఒక్క రూపాయికే అందిస్తున్నానని ఆమె చెబుతారు. తాజాగా ఆమె స్ఫూర్తితో తమిళనాడులోని వెంకటాచలపురం గ్రామ సర్పంచ్ ఊరి ప్రజలకు ఒక్క రూపాయికే ఇడ్లీ అందిస్తున్నారు.

లాక్‌డౌన్ వల్ల ఉపాధి లేక, ఏ పనులు లేక.. ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసరాలు లేక ఆహారం కూడా కడుపు నిండా తినడం లేదు. ఈ నేపథ్యంలో తన గ్రామస్తులకు అతి తక్కువ ధరలో అల్పాహారం అందించేలా ముందుకొచ్చారు వెంకటాచలపురం సర్పంచ్. తిరుచ్చి జిల్లా పుల్లుంబడి సమీపంలోని వెంకటాచలపురం గ్రామంలో ఒక ఇడ్లీ కేవలం ఒక్క రూపాయికే అందిస్తూ గ్రామస్తుల కడుపు నింపుతున్నారు. కమలాతాళ్ స్ఫూర్తిగా తీసుకుని ఈ టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించినట్టు సర్పంచ్ పళనిస్వామి పేర్కొన్నారు. ప్రధానంగా వృద్ధులు, రైతుల కోసం దీన్ని ప్రారంభించామనీ… రోజుకు 650 నుంచి 675 ఇడ్లీలు అందిస్తున్నామని పళనిస్వామి పేర్కొన్నారు. లాక్డౌన్ ఎత్తేశాక కూడా ఈ రూపాయి ఇడ్లీని కంటిన్యూ చేస్తానని పళనిస్వామి చెబుతున్నారు.

tags: tamil nadu, palaniswami,idli,rupee

Advertisement

Next Story

Most Viewed