రూ.72 లక్షల ధర పలికిన అరుదైన చేప

by Shyam |
రూ.72 లక్షల ధర పలికిన అరుదైన చేప
X

దిశ, ఫీచర్స్ : తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ధర పలికే చేప ఏదైనా ఉందంటే అది పులసే. ఏడాదిలో ఒకటి రెండు నెలలు మాత్రమే లభించే ఈ చేప ధర వేలల్లో ఉంటుంది. అయితే దాని స్పెషల్ టేస్ట్ కోసం చాలామంది డబ్బులకు వెనకాడరు. ఈ సంగతి పక్కనబెడితే తాజాగా పాకిస్థాన్‌ జాలరి వలకు చిక్కిన ఓ అరుదైన చేప వేలంలో రూ.72 లక్షలకు అమ్ముడుపోయి ఆ దేశంలో అత్యంత భారీ ధర పలికిన చేపగా రికార్డు సృష్టించింది.

పాకిస్థాన్‌‌, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని గ్వదార్ తీరప్రాంతంలో ఆదివారం సాజిద్ హాజీ అబాబాకర్ అనే జాలరి వలకు అట్లాంటిక్ క్రోకర్ అనే అరుదైన చేప చిక్కింది. ఇది 48 కిలోల బరువుండగా.. వేలంలో రూ.84.4 లక్షల ధర పలికింది. అయితే ట్రెడిషన్ డిస్కౌంట్స్ ప్రకారం రూ.72 లక్షలుగా నిర్ణయించినట్టు ఫిషర్‌మ్యాన్ అబాబాకర్ వెల్లడించాడు. ఇక ఈ వేలం గురించి చెప్పిన ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ నదీమ్.. ఇంత భారీ మొత్తానికి చేపను విక్రయించడం ఇదే మొదటిసారని తెలిపాడు. దీని చర్మం, ఎముకలను మెడిసిన్స్ తయారీలో ఉపయోగిస్తారని, అందుకే యూరోప్, చైనాలో ఈ అట్లాంటిక్ క్రోకర్‌కు డిమాండ్ ఎక్కువని వివరించాడు.

కాగా, గతవారం కూడా ఇదే జాతికి చెందిన చేపను రూ.7.8 లక్షలకు విక్రయించారు. సాధారణంగా ఈ చేప 1.2 కిలోల బరువుంటుండగా.. గత రికార్డులు పరిశీలిస్తే తాజాగా దొరికిన చేపనే అత్యంత భారీదని తెలిపారు. అయితే చేప వయసును బట్టి 20 నుంచి 90 కిలోల వరకు పెరుగుతుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed