- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉస్మానియా ఆస్పత్రిలో టెన్షన్.. టెన్షన్
దిశ ప్రతినిధి, హైదరాబాద్: చారిత్రాత్మక ఉస్మానియా ఆస్పత్రిలో అత్యవసరం మినహా ఇతర శస్త్ర చికిత్సలన్నీ వాయిదా పడుతున్నాయి. ‘కర్ణుడి చావుకు కారణాలు అనేకం’ అన్నట్లు ఆపరేషన్లు వాయిదా పడడానికీ అనేక కారణాలున్నాయి. గత నెలలో కురిసిన వర్షాలకు పాత భవనంలోకి వరద నీరు రావడంతో అందులోని రోగులను ఇతర వార్డుల్లోకి తరలించి ఆపరేషన్ థియేటర్లను తరలించకుండానే తాళం వేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆదేశించడం, లో ప్రెషర్ తో ఆక్సిజన్ సరఫరా, థియేటర్లలో పని చేసే టెక్నీషియన్లు లేక పోవడం వంటి కారణాలతో ఆపరేషన్లు నిలిచి పోతున్నాయి. దీంతో సుమారు 20 రోజులుగా కొన్ని విభాగాలలో రోగులకు ఒక్క ఆపరేషన్ చేయలేదంటే పరిస్థితి ఏ దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
లో ప్రెషర్..
ఉస్మానియా హాస్పిటల్ లో అవసరాల మేరకు రోగులకు ఆక్సిజన్ అందడం లేదు. ప్రస్తుతం ఆస్పత్రి మొత్తానికి ఆక్సిజన్ సరఫరా చేసే ప్లాంట్పాత భవనాన్ని అనుసరించి ఉన్న జైలు వార్డు వద్ద ఉంది. ఇక్కడి నుంచి పాత భవనం, లివర్ కేర్ బ్లాక్, హౌజ్ సర్జన్ క్వార్టర్లు, కులీ కుతుబ్ షా భవనం మీదుగా ఓపీ భవనానికి సరఫరా అవుతుంది. ఇది దూరం కావడంతో ఓపీ భవనం, కులీ కుతుబ్ షా భవనంలోని రోగులకు అవసరానికి తగినట్లుగా ప్రెషర్ రావడం లేదు. ఆయా భవనాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కే ఆక్సిజన్ కావాల్సిన ఒత్తిడితో చేరడం లేదు. ఇక పై అంతస్తులకు ప్రెషర్ తో కూడిన ఆక్సిజన్ సరఫరా కావడం గగనంగా మారింది. దీనికి తోడు రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఓపీ భవనంలోని రెండో అంతస్తులో 100 పడకలతో ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. ఆయా పడకలకు కూడా ఆక్సిజన్ అందించాల్సి రావడంతో ‘మూలిగే నక్క మీద తాటి కాయ పడినట్లుగా’ పరిస్థితులు మారాయి. అక్సిజన్ ప్రెషర్ పెంచడానికి గతంలో ఓపీ భవనం వద్ద అదనపు సిలిండర్లతో ప్లాంటు ఏర్పాటు చేసినా ఐసొలేషన్ పడకల ఏర్పాటు చేసి ఆక్సిజన్ అందిచాల్సి రావడం, దాని ప్రభావం ఇతర అన్ని అత్యవసర విభాగాలపై పడింది. యూరాలజీ విభాగంలో లీకేజీలతో థియేటర్ మూత పడింది.
మూత పడిన మూడు థియేటర్లు..
ఉస్మానియా పాత భవనంలో జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, సర్జికల్ గ్యాస్ట్రో, అనస్థీషియా, జనరల్ మెడిసిన్ విభాగాలు పని చేసేవి. అప్పట్లో జనరల్ సర్జరీ విభాగంలో మొత్తం 8 యూనిట్లలో సర్జరీలు జరిగేవి. ఇదే కాకుండా ఆర్థో , సర్జికల్ గ్యాస్ట్రో లకు చెందిన రోగులకు సైతం శస్త్ర చికిత్సలు నిర్వహించే వారు. కాగా గత నెల 23వ తేదీ నుంచి భవనానికి తాళం వేయడంతో సర్జికల్ గ్యాస్ట్రో విభాగంలో అన్ని ఆపరేషన్లు 20 రోజులుగా నిలిచి పోగా ఇతర అన్ని విభాగాలలో ఎలక్టివ్ సర్జరీలు వాయిదా పడుతున్నాయి. కార్డియో థోరాసిక్ విభాగంలో పని చేసే టెక్నీషియన్ కొన్ని నెలల క్రితం పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో నేటికీ మరో టెక్నీషియన్ నియామకం కాకపోవడంతో ఈ విభాగంలో అత్యవసరం శస్త్ర చికిత్సలు మాత్రమే చేస్తున్నారు. కులీ కుతుబ్ షా భవనంలో నాలుగు, ఓపీ భవనంలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఇందులో నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, కార్డియో థోరాసిక్, న్యూరో సర్జరీ విభాగాలు పై అంతస్తుల్లో ఉండగా వీటికి ఆక్సిజన్ లో ప్రెషర్ తో చేరుతుండగా ఆయా విభాగాలలో ఎలక్టివ్ సర్జరీలు వాయిదా పడుతున్నాయి. ఓపీ భవనంలో ఉన్న థియేటర్లలో అత్యవసర శస్త్ర చికిత్సలు అవసరం ఉన్న రోగులకే సరిపోవడం లేదు. పాత భవనాన్ని మూసి వేయక ముందు సుమారు 120 వరకు ఎలక్టివ్ సర్జరీలు నిర్వహించే వారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో ప్రతి నిత్యం 20 నుంచి 25 వరకు మాత్రమే అత్యవసర శస్త్ర చికిత్సలు చేస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది.
మరో మూడు నెలల వరకు..!
ఆస్పత్రిలో రోగులకు ప్రెషర్ తో కూడిన ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఓపీ భవనం వద్ద 2 కేఎల్ ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు చేసింది. ఇది పూర్తవడానికి మరో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అప్పటి వరకు ఎలక్టివ్ ఆపరేషన్లు వాయిదా వేస్తారా ? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.