- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘మంట’ పెట్టే రాష్ట్రాల్లో మనదే సెకెండ్ ప్లేస్..
దిశ, తెలంగాణ బ్యూరో : పెట్రోలు, డీజిల్ ధరల పెంపు సామాన్యుల నడ్డి విరుస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పట్టనట్లుగా ఉన్నాయి. ధరల పెంపు కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదని, చమురు సంస్థల పరిధిలోని అంశమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతులెత్తేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిస్సహాయంగానే ఉండిపోయింది. ప్రజలకు భారం తగ్గేలా టాక్సులను తగ్గించే విషయంలో ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో పెట్రోలు ధర రూ. 95 ఉంటే అందులో బేస్ ప్రైస్ మాత్రం కేవలం రూ.30 లోపే. మిగిలినదంతా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ సహా రకరకాల పన్నులు, సర్‌చార్జీ రూపంలో వసూలు చేస్తున్నదే. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు రూ.33 మేర పన్ను విధిస్తోంది. పెట్రోలు రేటు వంద రూపాయలకు చేరువ అవుతున్నా కేంద్రంగానీ, రాష్ట్రంగానీ పన్నులు తగ్గించడానికి సిద్ధపడడంలేదు.
పన్ను రేటులో సెకండ్ ప్లేస్‌లో తెలంగాణ..
దేశం మొత్తం మీద పెట్రోలు, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. అన్నింటింటే ఎక్కువగా రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోలుమీద 36 శాతం విధిస్తుండగా తర్వాతి స్థానంలో 35.2 శాతంతో తెలంగాణ ఉంది. డీజిల్ విషయాన్ని చూస్తే ఒడిశా లీటరు మీద 28 శాతం పన్ను వసూలు చేస్తుండగా తర్వాతి స్థానంలో తెలంగాణ 27 శాతం వసూలు చేస్తోంది. పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని పరిశీలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో 36,21,674 మిలియన్ టన్నుల మేర డీజిల్ విక్రయాలు జరగ్గా, సుమారు 12,88,298 మిలియన్ టన్నుల వరకు పెట్రోలు విక్రయాలు జరిగాయి.
పన్నులు, సెస్‌ల పేరుతో కేంద్రం దోపిడీ..
పెట్రోలు, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేర పన్నులు వసూలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం సెస్‌ల పేరుతో మరింత దోచుకుంటోంది. కరోనా పరిస్థితుల్లో కూడా కేంద్రం పెట్రోలు, డీజిల్‌పైన రూ.13 చొప్పున రెండు విడతల్లో ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. గతేడాది మార్చి 13వ తేదీ నాటికి ఒక్క లీటరు పెట్రోలు మీద రూ. 19.98 మేర ఎక్సయిజ్ డ్యూటీ ఉంటే ఆ మరుసటి రోజు నుంచి మూడు రూపాయల చొప్పున పెంచింది. మే నెలలో ఒకేసారి పది రూపాయల మేర పెంచింది. దీంతో కేవలం ఎక్సైజ్ డ్యూటీ రూ.32.98కు పెరిగింది. ఇందులో బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ కేవలం రూ. 2.98 మాత్రమే. ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ రూ.12, రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ రూ.18 చొప్పున విధించింది. వీటికి తోడు తాజాగా అగ్రికల్చర్ సెస్ పేరుతో మరో వడ్డన వేసింది. అయితే దీని ప్రభావం వినియోగదారులపై పడదంటూ కేంద్రం సుతిమెత్తగా చెప్పినా చమురు సంస్థలు మాత్రం ఈ భారాన్ని కూడా ప్రజలపైనే వేశాయి. బ్రాండెడ్ పెట్రోలు, బ్రాండెడ్ డీజిల్ పైన విధించే పన్నులు ఎక్కువగా ఉండడంతో వీటి ధర ఇప్పటికే మార్కెట్‌లో వంద రూపాయలు దాటిపోయాయి.
అసలు కంటే కొసరే ఎక్కువ..
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర పన్ను కేవలం 14 శాతమే (అప్పటి ధరతో పోలిస్తే రూ. 10.39). అప్పట్లో ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌కు 70 డాలర్లు ఉన్నా పెట్రోలు, డీజిల్ ధరలు మాత్రం గరిష్టంగా రూ.70 దాటలేదు. కానీ మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడేళ్లలో ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ, రోడల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్, అగ్రికల్చర్ సెస్ లాంటివి విధించడంతో కేంద్ర పన్నులే బ్రాండెడ్ పెట్రోలుమీద రూ.34.10, బ్రాండెడ్ డీజిల్‌పై రూ.34.20 చొప్పున వసూలు చేస్తోంది. యూపీఏ హయాంలో పెట్రోలు బేస్ ప్రైస్ (మూల ధర) రూ.47.12 ఉంటే ఇప్పుడు అది కేవలం రూ.29.34కు తగ్గింది. అప్పట్లో (2014 మే నెల) పెట్రోలు ధర మార్కెట్‌లో రూ.71.41 ఉంటే ఇప్పుడు (ఫిబ్రవరి 2021) రూ. 98 దాకా చేరుకుంది. అసలు ధర కంటే కేంద్రం, రాష్ట్రాలు విధిస్తున్న పన్నులే ఎక్కువగా ఉన్నాయి.