విధులు బహిష్కరించిన 'గాంధీ' నర్సులు

by Shyam |   ( Updated:2020-07-11 09:05:27.0  )
విధులు బహిష్కరించిన గాంధీ నర్సులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ నర్సులు శనివారం నుంచి విధులు బహిష్కరించారు. గడచిన 14 సంవత్సరాలుగా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలోనే పనిచేస్తున్నామని, ఇప్పటివరకు సర్వీసులను క్రమబద్ధీకరించలేదని, వేతనాలు కూడా పెంచలేదని, తమకంటే వెనకవచ్చినవారికి ఎక్కువ వేతనాలు వస్తున్నాయని నర్సులు ఆరోపించారు. సుమారు 220మంది నర్సులు విధులు బహిష్కరించడంతో గాంధీ ఆసుపత్రిలో ఆ మేరకు కరోనా పేషెంట్లకు అందే సేవలకు అంతరాయం కలిగింది. డిమాండ్ల పరిష్కారం కోసం శుక్రవారం వైద్య విద్య డైరెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేసినా సానుకూల స్పందన రాకపోవడంతో శనివారం నుంచి విధులను పూర్తిగా బహిష్కరించారు. ఆసుపత్రి ఆవరణలోనే ధర్నాతో నిరసన తెలియజేశారు. డీఎంఈకి శుక్రవారం వినతిపత్రం సమర్పించాలన్న ప్రయత్నం ఫలించలేదు.

కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో నిర్దిష్ట కాల పరిమితికి కొద్దిమంది నర్సులను ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమించుకుందని, తమకంటే ఎక్కువ వేతనాలు (రూ. 23,000) ఇస్తోందని, దీర్ఘకాలంగా పనిచేస్తున్న తమకు మాత్రం అన్ని కటింగ్‌లు పోగా చేతికి రూ. 15,000 మాత్రమే వస్తున్నాయని వాపోయారు. ఇదే విషయాన్ని ఆసుపత్రి ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే వేర్వేరు జీవోల పరిధిలోకి వచ్చే రెండు అంశాలను పోల్చి చూడడం సరికాదన్న సమాధానం వచ్చిందని నర్సుల ప్రతినిధి ధనలక్ష్మి వ్యాఖ్యానించారు. పద్నాలుగేళ్ళుగా పనిస్తున్న సీనియారిటీని కాదని, ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో రిస్కు తీసుకుని పనిచేస్తున్నా తమకు తక్కువ వేతనాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం, కొత్తగా వచ్చినవారికి ఎక్కువ వేతనాలు ఇవ్వడం సమంజసం కాదని ఆమె వ్యాఖ్యానించారు. న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించకుంటే ఇకపైన కూడా విధుల బహిష్కరణను కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed