మధ్యప్రదేశ్‌లో ఆపరేషన్ 'కమలం'?

by Shamantha N |   ( Updated:2020-03-04 03:53:52.0  )
మధ్యప్రదేశ్‌లో ఆపరేషన్ కమలం?
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశమంతటా కరోనా బీభత్సం సృష్టిస్తుంటే.. మధ్యప్రదేశ్‌లో మాత్రం రాజకీయాల హైడ్రామా నడిచింది. తమ ఎమ్మెల్యేలను హోటల్‌కు తరలించి బీజేపీ బేరసారాలు ఆడుతున్నదన్న కాంగ్రెస్ ఆరోపణలతో మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. పది మంది ఎమ్మెల్యేలను హర్యానాలోని ఓ లగ్జరీ హోటల్‌కు తరలించి బీజేపీ ప్రలోభపెడుతున్నదని కాంగ్రెస్ ఆరోపించడంతో.. ఆపరేషన్ కమలం జరుగుతున్నదా? అనే అనుమానాలు వస్తున్నాయి.

బీజేపీ నేతలు.. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సోమవారం రాత్రి చేసిన వ్యాఖ్యలతో ఈ కలకలం మొదలైంది. తర్వాతి రోజే పది మంది ఎమ్మెల్యేలను హర్యానా గురుగ్రాంలోని ఓ లగ్జరీ హోటల్‌కు బీజేపీ తరలించిందని కాంగ్రెస్ ఆరోపించింది. హర్యానాలో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. హర్యానా పోలీసుల సహకారంతో తమ ఎమ్మెల్యేలతో మాట్లాడకుండా బీజేపీ అడ్డుకుంటున్నదని మధ్యప్రదేశ్ మంత్రి తరుణ్ బానోత్ మంగళవారం రాత్రి ఆరోపించారు. కాగా, తమ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి బీజేపీ రూ. 50-60 కోట్లు ఆఫర్ చేస్తున్నదని, ఇంత సొమ్ము ఎక్కడినుంచి వచ్చింది అని కాంగ్రెస్ మంత్రి జీతు పట్వారి వ్యాఖ్యానించారు.

అయితే, కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్, ఆయన కుమారుడు హర్యానా హోటల్ చేరినట్టు తెలిసింది. నలుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తిరిగి పొందగలిగిందని ఆ పార్టీవర్గాలు తెలిపాయి. కాగా, ఈ పరిణామాలపట్ల భయపడాల్సిన అవసరం లేదని సీఎం కమల్‌నాథ్ అన్నారు. ‘మిస్సింగ్’ ఎమ్మెల్యేలు అందరు తిరిగివస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాగా, బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేసింది. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలతో తమకు సంబంధం లేదని తెలిపింది.

2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాలకు గాను కాంగ్రెస్ 114 స్థానాలను, బీజేపీ 107 సీట్లను గెలుచుకుంది. బీఎస్‌పీ, ఎస్‌పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు సహా 121 మంది మద్దతుతో కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో కొనసాగుతున్నది.

Tags : madhya pradesh, poaching, bjp, congress, haryana, operation kamal, lotus

Advertisement

Next Story

Most Viewed