Online Fashion:ఆన్‌లైన్ ఫ్యాషన్ పరిశ్రమలో భారీగా పెరుగుతున్న ఆర్డర్లు

by Harish |   ( Updated:2021-06-11 03:43:20.0  )
busines 1
X

దిశ, వెబ్‌డెస్క్: అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆన్‌లైన్ ఫ్యాషన్ పరిశ్రమలో ఆర్డర్లు 51 శాతం, స్థూల వ్యాపార విలువ(జీఎంవీ) 45 శాతం పెరిగినట్టు యూనికామర్స్ నివేదిక తెలిపింది. ‘ఫ్యాషన్ ఈ-కామర్స్ రిపోర్ట్’ పేరుతో విడుదలైన నివేదిక ప్రకారం.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ పరిశ్రమలో ఆన్‌లైన్ వ్యాపార విధానాలు, మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ రంగం వృద్ధి సాధిస్తోందని నివేదిక అభిప్రాయపడింది. ప్రధానంగా ఆఫ్‌లైన్ మాదిరిగానే ఆన్‌లైన్ ఫ్యాషన్ విభాగంలో బ్రాండ్ కంపెనీలు వ్యూహాత్మకంగా కొనసాగుతున్నాయి.

ఈ-కామర్స్ పరిశ్రమలో తమ బ్రాండ్ల విస్తరణకు అనుగుణంగా ఆన్‌లైన్‌లోనూ కంపెనీలు రిటైల్ బ్రాండ్లను తీసుకొస్తున్నాయి. ఇటీవల పెరుగుతున్న డీ2సీ(డైరెక్ట్-టూ-కస్టమర్) విధానంతో ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీలు వినియోగదారులతో మెరుగైన సంబంధాల కారణంగానే వృద్ధి కొనసాగేందుకు వీలవుతోంది. దీంతో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే బ్రాండ్ కంపెనీల ఆర్డర్లు 66 శాతం పెరిగాయి. ఇదే సమయంలో కొత్తగా వస్తున్న బ్రాండ్ కాని సాధారణ కంపెనీలు సైతం ఆర్డర్లలో 45 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఈ ఆన్‌లైన్ ఫ్యాషన్ షాపింగ్ ధోరణి టైర్2, టైర్3 నగరాల్లో అధికంగా ఉందని నివేదిక తెలిపింది. ఇందులో మహిళల ఫ్యాషన్ విభాగం 50 శాతంతో మెజారిటీ వాటాను కలిగి ఉంది. గతంతో పోలిస్తే ఇది 30 శాతం అధికం కావడం గమనార్హం. ఇదే సమయంలో పిల్లల దుస్తుల విభాగం ఆర్డర్లు 200 శాతం వృద్ధి సాధించాయి. పురుషుల ఫ్యాషన్ ఆర్డర్లు 37 శాతం వృద్ధి సాధించాయి. ఇటీవల వచ్చిన మార్పుల నేపథ్యంలో భారత ఆన్‌లైన్ ఫ్యాషన్ విభాగంలో భారీగా ఆర్డర్లు పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ ధోరణి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని యూనికామర్స్ సీఈఓ కపిల్ మఖిజా చెప్పారు.

Online fashion industry witnessed an order volume growth of 51 per cent and gross merchant value (GMV) increase of 45 per cent in FY21 as compared to the previous financial year,

Advertisement

Next Story