24 నుంచి 'టీ సాట్' ఆన్‌లైన్ తరగతులు

by Shyam |   ( Updated:2020-04-14 06:33:42.0  )
24 నుంచి టీ సాట్ ఆన్‌లైన్ తరగతులు
X

దిశ, హైదరాబాద్ :
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలన్నీ మూతపడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో విద్యార్థులు ఇంటి దగ్గర నుంచే పాఠాలు అభ్యసించేలా గురుకుల విద్యాలయాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రాష్ట్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ, తెలంగాణ గిరిజన గురుకుల సొసైటీలు సంయుక్తంగా నెల రోజుల పాటు ‘టీ సాట్’ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు బోధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరానికి సన్నద్ధమయ్యేలా ఈ నెల 24 నుంచి మే 30 వరకు పాఠాలు బోధించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రతిరోజూ నాలుగు సబ్జెక్టులు ఒక్కో గంట చొప్పున.. ప్రతి సబ్జెక్టులో ముందుగా ఎంపిక చేసిన అంశాలను బోధిస్తారు. ఈ తరగతులు విద్యార్థులకు సమగ్రంగా, సులభంగా, వినూత్న పద్ధతిలో ఉంటాయని గురుకుల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ చానెల్ టీసాట్ లేదా టీసాట్ యాప్ ద్వారా ఆన్‌లైన్ పాఠాలు చూడవచ్చన్నారు.

కాగా, గురుకుల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లకు గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులు కూడా టీసాట్ ఆన్‌లైన్ పాఠాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Tags: Corona Effect , Online Classes, Gurukul Education, Dr RS Praveen Kumar

Advertisement

Next Story

Most Viewed