కొత్తగా ట్రాక్టర్ కొనే రైతులకు మహీంద్రా ప్రత్యేక ఆఫర్!

by Harish |
కొత్తగా ట్రాక్టర్ కొనే రైతులకు మహీంద్రా ప్రత్యేక ఆఫర్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా సెకెండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా కొత్తగా ట్రాక్టర్లను కొనేవారికి ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. కొత్తగా కొనాలనుకునే వారికి రూ. లక్ష విలువైన ఆరోగ్య బీమాతో పాటు రైతులకు ముందుగా ఆమోదించిన(ప్రీ-అప్రూవ్‌డ్) అత్యవసర ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

‘ఎమ్-ప్రొటెక్ట్ కొవిడ్’ కార్యక్రమం ద్వారా కొత్త మహీంద్రా ట్రాక్టర్ కస్టమర్లను, వారి కుటుంబాలను కరోనా నుంచి రక్షించడమే లక్ష్యంగా ఉన్నామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా రూ. లక్ష వరకు హెల్త్ కవర్‌ను కంపెనీ అందిస్తుందని, దీంతో పాటు కరోనా బారిన పడిన వారికి చికిత్స సమయంలో అయ్యే వైద్య ఖర్చుల కోసం ముందుగా ఆమోదించిన(ప్రీ-అప్రూవ్‌డ్) రుణాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు కంపెనీ వివరించింది.

ఒకవేళ ప్రాణ నష్టం జరిగితే ‘మహీంద్రా లోన్ సురక్ష’ కింద వినియోగదారుల రుణానికి బీమా చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. మే నెలలో కొనుగోలు చేసిన అన్ని వేరియంట్ ట్రాక్టర్లకు ‘ఎమ్ ప్రొటెక్ట్ కొవిడ్’ ప్లాన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ కార్యక్రమం ద్వారా రైతులను లక్ష్యంగా చేసుకుని ఈ చొరవ తీసుకున్నామని, మహమ్మారి లాంటి క్లిష్ట సమయాల్లో రైతులకు అండగా నిలుస్తున్నామని ఎంఅండ్ఎం వ్యావసాయాధారిత ఉత్పత్తుల విభాగం ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా చెప్పారు.

Advertisement

Next Story