నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు

by Sridhar Babu |   ( Updated:2021-04-04 01:40:52.0  )
road accident
X

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. ఇంటిబయట నిద్రిస్తున్న వారిపైనుంచి ఆదివారం తెల్లవారుజామున ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాళ్లోకి వెళితే.. పట్టణంలోని సుభాష్ నగర్‌లో రోడ్డు పక్కన నివాసం ఉండే బరిగల లింగయ్య, రాజమ్మలకు ఒక కొడుకు(మధు) ఉన్నాడు. రోజులాగే కూలి పనులకు వెళ్లి సాయంత్రం భోజనం చేసి ఇంటి ఎదుట రోడ్డు పక్కన మంచాలపై పడుకున్నారు. అదే సమయంలో శాంతిఖని నుండి మాదారం టౌన్‌ వైపు అతివేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి మంచాలపై పడుకున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో తల్లీకొడుకులు నిద్రిస్తున్న మంచం ఎగిరి దూరంగా పడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మధు అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లి రాజమ్మ, తండ్రి లింగయ్యలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి టూటౌన్ ఎస్ఐ భాస్కర్ రావు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed