ఆర్చరీలో దీపిక కుమారి గురి కుదిరేనా..?

by Shyam |
Deepika
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్ మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇండియా నుంచి 118 మంది అథ్లెట్లు పతకాలు సాధించే లక్ష్యంతో విమానం ఎక్కనున్నారు. భారత్ నుంచి బ్యాడ్మింటన్, బాక్సింగ్‌లో పతకాలు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాని తర్వాత అందరి ఆశలు ఎక్కువగా ఉన్నది ఆర్చరీపైనే. ఈ సారి టోక్యో ఒలింపిక్స్‌కు కేవలం నలుగురు ఆర్చర్లు మాత్రమే అర్హత సాధించారు. వీరిలో అతాను దాస్, దీపికా కుమారి రెండు విభాగాల్లో పోటీ పడుతుండగా.. మిగిలిన ఇద్దరు టీమ్ ఈవెంట్‌కు పరిమితం అయ్యారు.

భారత ఆర్చరీకి పెద్ద దిక్కు అయిన దీపిక కుమారి, అతాను దాస్ టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపిక కావడంతో వీరిద్దరు తప్పక పతకం సాధిస్తారని అందరూ ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల వరల్డ్ నెంబర్ 1గా నిలిచిన దీపికా కుమారి తప్పకుండా పతకం కొడుతుందని ఆర్చరీ మాజీలు చెబుతున్నారు.

దీపికపైనే ఆశలు..

జార్ఖండ్‌కు చెందిన దీపికా కుమారి 2005లో అర్జున్ ఆర్చరీ అకాడమీలో శిక్షణ పొందింది. అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండ పేరుతో అతడి భార్య మీరా ముండ ఆ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పింది. అక్కడ ఆమె ప్రతిభను గుర్తించిన మీరా.. జంషెడ్‌పూర్‌లోని టాటా ఆర్చరీ అకాడమీలో జాయిన్ చేశారు. ఇక అక్కడి నుంచి దీపిక వెనుదిరిగి చూడలేదు.

deepika kumari

2006లో ఆర్చరీ వరల్డ్ కప్‌లో తొలిసారి జూనియర్ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో టీమ్ రికర్వ్, ఇండివిడ్యువల్ రికర్వ్ విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌ 2013లో స్వర్ణ పతకం సాధించింది. కానీ, 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోవడం తన కెరీర్‌లో పెద్ద కుంగుబాటుతనంగా ఆమె అభివర్ణించింది. ఆ తర్వాత మరింతగా తన ప్రతిభకు సానబెట్టింది.

టోక్యో ఒలింపిక్స్‌కు అందరి కంటే ముందుగానే అర్హత సాధించిన దీపిక.. తాజాగా గ్వాటెమల సిటీలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్‌లో వుమెన్స్ ఇండివిడ్యువల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో వరల్డ్ నెంబర్ 1 హోదాలో అడుగుపెట్టనున్నది. ఇండివిడ్యువల్ కర్వ్ ఈవెంట్‌తో పాటు మిక్స్‌డ్ కర్వ్ ఈవెంట్‌లో భర్త అతాను దాస్‌తో కలసి ఒలింపిక్ పతకం కోసం పోటీ పడనున్నది.

మిగిలిన విభాగాల్లో..

Atanu Das, Deepika Kumari

వ్యక్తిగత విభాగంలో కేవలం దీపికా కుమారి మాత్రమే అర్హత సాధించింది. పురుషుల ఇండివిడ్యువల్ కేటరిగీలో ఎవరూ అర్హత సాధించలేదు. అయితే పురుషుల టీమ్ ఈవెంట్‌లో మాత్రం అతాను దాస్, తరుణ్ దీప్ రాయ్, ప్రవీణ్ యాదవ్ అర్హత సాధించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న భారత టీమ్ చివరిగా మిగిలిన స్పాట్ ద్వారా అర్హత సాధించింది.

ఇటీవల కాలంలో పురుషుల టీమ్ పెద్దగా రాణించడం లేదు. గతంలో 5వ ర్యాంకులో ఉన్న జట్టు.. వరుస వైఫల్యాలతో 10వ ర్యాంకుకు పడిపోయింది. అతాను దాస్ నేతృత్వం వహిస్తున్న ఈ టీమ్ టోక్యో ఒలింపిక్స్‌లో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే. అయితే అతాను దాస్, దీపిక కుమారి కలసి బరిలోకి దిగనున్న మిక్స్‌డ్ కర్వ్ ఈవెంట్‌లో మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉన్నది. వరల్డ్ కప్‌లో కూడా చక్కని ప్రతిభ కనపరిరి వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానానికి ఎగబాకారు. దీపిక, అతాను దాస్ ఇద్దరు మంచి ఫామ్‌లో ఉండటంతో ఈ విభాగంలో కూడా ఒక పతకం వస్తుందని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed