- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ సారైనా ఒలంపిక్స్ జరిగేనా?
దిశ, స్పోర్ట్స్ : కరోనా మహమ్మారి విశ్వక్రీడలు ఒలంపిక్స్‌ను ఇంకా వెంటాడుతూనే ఉన్నది. గత ఏడాది జులై 24నే ఒలంపిక్ క్రీడలు ప్రారంభం కావల్సి ఉన్నా కరోనా కారణంగా ఈ ఏడాది జులై 23కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. గత ఏడాది వాయిదా పడిన పలు ఒలంపిక్ అర్హత టోర్నీలు ఈ మధ్యనే తిరిగి నిర్వహిస్తున్నారు. ఆ టోర్నీలపై కూడా కరోనా ప్రభావం పడింది. పలువురు క్రీడాకారులకు కరోనా సోకడంతో వారిని అర్హత పోటీల నుంచి తప్పించారు. భారత రెజ్లర్లు కూడా కొంత మంది కజకిస్తాన్ నుంచి వెనక్కు వచ్చారు. కేవలం ఇండియా అథ్లెట్లే కాకుండా ఇతర దేశాలకు చెందిన క్రీడాకారులు కూడా కరోనా కారణంగా ఒలంపిక్స్ అర్హత పోటీల్లో పాల్గొనలేక పోతున్నారు. దీంతో కరోనా కారణంగా మాకు ఒలంపిక్స్‌లో అన్యాయం జరుగుతున్నదని పలు దేశాల ఒలంపిక్ కమిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు జపాన్‌లో కరోనా కేసులు పెరుగుతండటంతో నిర్వాహక కమిటీ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. కేసులు ఇలాగే పెరిగితే విశ్వ క్రీడలను నిర్వహించడం కష్టమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.
ప్రేక్షకులపై నిషేధం?
కరోనా కారణంగా ఇప్పటికే ఒలంపిక్స్ వీక్షించడానికి విదేశీ ప్రేక్షకులను అనుమతించబోమని నిర్వాహక కమిటీ ప్రకటించింది. ఈ క్రీడల కోసం టికెట్లు కొనుక్కున్న 6 లక్షల మందికి పైగా విదేశీయులకు డబ్బులు వాపస్ చేస్తామని స్పష్టం చేసింది. విదేశీ ప్రేక్షకులు ఎవరూ జపాన్ రావొద్దని టోక్యో స్థానిక ప్రభుత్వం కూడా వెల్లడించింది. తాజాగా ఒలంపిక్ టార్చ్ ర్యాలీలో కరోనా కలకలం సృష్టించింది. ఒక పోలీసు అధికారి కరోనా బారిన పడటంతో ఇప్పుడు జపాన్ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. టోక్యో నగరంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నా.. ఒలంపిక్స్ కారణంగా కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తున్నది. కాబట్టి స్వదేశీ ప్రేక్షకులను కూడా ఈ క్రీడా పండుగకు అనుమతించే విషయంపై ఒక నిర్ణయం తీసుకోనున్నది. అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ సహా మరో నాలుగు ఆర్గనైజింగ్ కమిటీలు వచ్చే వారంలో ఒక అత్యున్నత సమావేశం నిర్వహించనున్నాయి. ఈ సమావేశంలో స్వదేశీ ప్రేక్షకుల నిషేధంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
ఎందుకీ సమావేశం?
జపాన్ ప్రభుత్వం టోక్యో సహా మరో మూడు ప్రాంతాల్లో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఒలంపిక్స్‌కు సరిగ్గా 90 రోజుల ముందు ఆంక్షలు విధించడంతో అసలు క్రీడలు జరుగుతాయా అనే అనుమానాలు నెలకొన్నాయి. టోక్యో ఒలంపిక్ కమిటీ అధ్యక్షురాలు హషిమోతో ఒలంపిక్స్ రద్దుపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటున్నారు. అయితే కరోనా కేసులు పెరిగిపోతుండటంతో స్వదేశీ ప్రేక్షకులను కూడా అనుమతించే విషయంపై చర్చ జరుగుతున్నదని స్పష్టం చేశారు. మరో నెల రోజుల తర్వాత కరోనా తీవ్రత పెరిగితే జపాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ఒలంపిక్ కమిటీ కట్టుబడి ఉంటుందన్నారు. అయితే కేవలం జపాన్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కరోనా కేసుల పెరిగితే అథ్లెట్లను అనుమతించే విషయం కూడా ప్రశ్నార్థకం అవుతుంది. అదే జరిగితే మొత్తం ఒలంపిక్స్ రద్దు చేయాల్సి వస్తుందని ఒక అధికారి చెప్పారు. ప్రస్తుతం జపాన్‌లోని పలు ప్రాంతాల్లో పూర్తి లాక్‌డౌన్ కూడా విధించారు. టోక్యో, ఒసాక, క్యోటో, హ్యూగో ప్రాంతాల్లో కఠినమైన కరోనా ఆంక్షలు అమలులో ఉన్నాయి. మరి ఇన్ని ఆంక్షల నడుమ ఒలంపిక్స్ జరుగుతాయో లేదో వేచి చూడాల్సిందే.