ఆఫీసును ఆస్పత్రిగా మార్చేసిన సూరత్ వాసి..

by Anukaran |   ( Updated:2020-07-30 05:12:26.0  )
ఆఫీసును ఆస్పత్రిగా మార్చేసిన సూరత్ వాసి..
X

దిశ, వెబ్‌డెస్క్ :
ఓ వైపు కరోనా భయపెడుతుంటే.. మరోవైపు కరోనా బారినపడ్డాక వచ్చే ఆస్పత్రి బిల్లు అంతకన్నా ఎక్కువ కంగారుపెడుతోంది. కరోనా వచ్చిందని ప్రభుత్వ ఆస్పత్రికి పరుగులు పెడితే, ఇక్కడ కాదు.. మరో సర్కారు దవాఖానాకు వెళ్లని, తీరా అక్కడికెళితే.. ఇక్కడ కాదు.. మరో చోటుకు వెళ్లూ అంటూ తప్పించుకుంటున్నారు. రోగులపై కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు రోజు కథనాలు చూస్తూనే ఉన్నాం. ఇక చేసేదేం లేక డబ్బు కంటే ప్రాణం ముఖ్యమనుకుని జనాలు ప్రైవేటు దవాఖానాకు క్యూ కడుతున్నారు. అక్కడేమో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అమలు కావడం లేదు. అంతా తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. సామాన్యులను దోచుకుంటున్నారు. లక్షలకు లక్షల బిల్లులు వేస్తున్నారు. సూరత్‌కు చెందిన ఖాదర్ షేక్‌కు కూడా ఇలానే జరిగింది. కరోనా బారినపడి ప్రైవేటు హస్పిటల్‌కు వెళితే.. చివరకు లక్షల్లో బిల్లు వేయడంతో ఆయన బిత్తరపోయాడు. ఈ సంఘటన వల్ల వ్యక్తిగతంగా డబ్బులు నష్టపోయాయని ఆ క్షణంలో బాధపడ్డా.. మరెంతోమంది పేదల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో డబ్బులున్నోళ్ల పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా.. లేనోడికి వచ్చింది తిప్పలు. ఖాదర్ షేక్ కూడా ఇలానే ఆలోచించాడు. కరోనా కష్టకాలంలో పదిమందికి సాయం చేయాలనుకున్నాడు. అందుకే తన సొంత కార్యాలయాన్నే కరోనా ఆస్పత్రిగా మార్చేశారు. తన 30 వేల చదరపు అడుగుల కార్యాలయాన్ని 85 పడకలున్న ఆస్పత్రిగా అభివృద్ధి చేశాడు. పేదలకు ఉచితంగా చికిత్స అందిస్తానని ఖాదర్ ప్రకటించడంతో.. ప్రభుత్వం కూడా తనకు సాయం అందించడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ ఆస్పత్రికి సరిపడే డాక్టర్లను, ఇతర వైద్య సిబ్బందిని సమకూర్చింది.

దేవుడు మనిషి రూపంలో ఉంటాడని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. కరోనా కాలంలో అదే నిజమని అందరూ ఒప్పుకుంటున్నారు కూడా. ఈ టైములో తమ పనులతో ఎంతోమందికి అండగా ఉండటమే కాక, మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Advertisement

Next Story