ప్రభుత్వానికి అవమానం.. తోట తాకట్టు పెట్టి వంతెన నిర్మించిన గ్రామస్తుడు!

by Shyam |
ప్రభుత్వానికి అవమానం.. తోట తాకట్టు పెట్టి వంతెన నిర్మించిన గ్రామస్తుడు!
X

దిశ, ఫీచర్స్: ఒడిశాలోని ఓ పల్లెలో వంతెన లేక జనాలు అష్టకష్టాలు పడ్డారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, నాయకులు ఎవరూ కూడా తమను పట్టించుకోలేదు. దీంతో గ్రామ ప్రజల బాధలు చూసి అదే గ్రామానికి చెందిన పడవ నడిపే 55 ఏళ్ల జయదేవ్ భాత్రా కరిగిపోయాడు. వారి బాధలను ఎలాగైనా తీర్చాలనుకున్నాడు. అంతే తనకున్న చెరకు తోటను తాకట్టు పెట్టి వంతెన నిర్మించాడు.

2016లో నబ్రంగ్‌పూర్‌లోని చిర్మా గ్రామంలో వంతెన నిర్మాణానికి సీఎం నవీన్ పట్నాయక్ శంకుస్థాపన చేశాడు. 2019 వరకు ఈ ప్రాజెక్ట్‌ పూర్తవుతుందని.. రూ.16.30 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే గడువు తేదిని 2021కి పొడగించారు. కానీ ఇప్పటికీ ఒక్క స్తంభం కూడా పూర్తి కాలేదని గ్రామస్తులు తెలిపారు. ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోవడంతో.. బాత్రా సొంతంగా వంతెన నిర్మాణ పనులను చేపట్టాడు. ఇది పూర్తయ్యాక ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే సదాశివ పధానిని కూడా ఆహ్వానించారు.

కాగా వంతెన కొద్దిగా అస్థిరంగా ఉన్నప్పటికీ, గ్రామస్తులకు ఉపయోగపడుతుంది. మోటార్‌ సైకిళ్లు దాని గుండా వేగంగా వెళ్లగలవు. ఇప్పుడు ఎలాంటి టోల్ తీసుకోనప్పటికీ ప్రయాణికులు అతనికి రూ.5, రూ.10 చెల్లించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉంటే నబ్రంగ్‌పూర్ జిల్లా కలెక్టర్ కమల్ లోచన్ మిశ్రా ఈ పరిణామాన్ని ‘ప్రభుత్వానికి అవమానం’గా అభివర్ణించారు. అంతేకాకుండా ప్రతిపాదిత వంతెన నిర్మాణం స్థితిపై నివేదికను కోరారు. ‘ఇంద్రావతిపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు దశాబ్ద కాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. భాత్రా దానిని నిజం చేశాడు. అతని నిబద్ధత అసమానమైనది’ అని గ్రామ పూజారి పేర్కొన్నాడు.

‘వందలాది మంది నదిపై జీవనోపాధి పొందుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో చెరుకు తోట తాకట్టు పెట్టి ఆ డబ్బుతో స్థానిక మార్కెట్ల నుంచి అవసరమైన వెదురును తీసుకొచ్చాను. నా ప్రయత్నానికి రెండు గ్రామాల ప్రజలు తొలిగా పూర్తి మద్దతు పలికారు. అయితే కాలక్రమేణా మద్దతు తగ్గింది. అవరోధాలు ఎదురైనప్పటికీ.. కొంతమంది గ్రామస్థులు, నా కొడుకు బనమాలి సహాయంతో ఈ వంతెనను స్వతంత్రంగా పూర్తి చేశాను’ అని జయదేవ్ భాత్రా తెలిపారు.

Advertisement

Next Story