సీఏఏ పై సుప్రీం కీలక తీర్పు

by Anukaran |   ( Updated:2020-10-07 11:22:01.0  )
సీఏఏ పై సుప్రీం కీలక తీర్పు
X

న్యూఢిల్లీ: జనజీవనానికి ఇబ్బంది కలిగించే నిరసనలు ఆమోదయోగ్యం కావని, ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు ఆదేశాల కోసం వేచి చూడకుండా, ఆందోళనకారులను నేరుగా ఖాళీ చేయించే హక్కు ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా గతేడాది దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలకు కేంద్ర బిందువుగా దేశ రాజధాని ఢిల్లీలోని షహీన్‌బాగ్‌ నిలిచింది.

ఈ ప్రాంతంలో నిరసనలు మూడు నెలలకు పైగా కొనసాగాయి. ఈ సమయంలో షహీన్‌బాగ్‌- కాళింది కుంజ్‌ మార్గంలో రాస్తారోకో వల్ల జనజీవనానికి ఆటంకం కలిగిందని, ఈ మార్గంలో రహదారి దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని కోరుతూ న్యాయవాది అమిత్‌ సాహ్ని ఫిబ్రవరిలో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే, వారి కారణంగా ఇతరులకు ఇబ్బంది కలగుకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై పలుమార్లు విచారణ జరిగినా వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో జస్టిస్ ఎస్.కే కౌల్, అనిరుద్ధ బోస్, క్రిష్ణ మురారీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం మళ్లీ విచారించింది. ఇందులో భాగంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనకారులు తమ ఆందోళనల కోసం బహిరంగ ప్రదేశాలను ఆక్రమించరాదని, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగజేసే ఇలాంటి ధర్నాలు, రాస్తారోకోలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని నొక్కి చెప్పింది. వీటిపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. కోర్టు ఆదేశాల కోసం ఎదుచూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే, శాంతియుత నిరసన హక్కును తాము అభినందిస్తామని, అయితే నియమించిన ప్రదేశాల్లోనే ఆందోళనలు జరగాలని వ్యాఖ్యానించింది.

కాగా, షహీన్‌బాగ్ నిరసనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో పాల్గొన్న 82ఏళ్ల బిల్కిస్ దాది.. టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన టాప్ 100 ప్రభావశీలుర జాబితాలో ప్రధాని మోడీతోపాటు చోటు దక్కించోవడం విశేషం.

Advertisement

Next Story