పుస్తకాలు పోగేసుకోవడం మానలేదు.. సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |   ( Updated:2021-12-28 10:50:28.0  )
పుస్తకాలు పోగేసుకోవడం మానలేదు.. సీజేఐ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, సిటీ బ్యూరో: చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బాధ్యతలు పెరిగి పుస్తకాలు చదవటం తగ్గిందని, రోజుకి 30 నుంచి 40 కేసులకు సంబంధించిన పేపర్స్ చదివిన తర్వాత వేరే బుక్కు పట్టుకోవటం అంత తెలికైన పని కాదని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కొనసాగుతున్న 34వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తాను బడిలో చదువుకునే రోజుల్లో బడిలో , ఇతర ప్రభుత్వ పాఠశాలల్లోనూ కూర్చోవడానికి బెంచీలు లేకపోయినా, ఆడుకోవడానికి తగినంత ఆట స్థలం, చదువుకోవడానికి గ్రంథాలయం తప్పనిసరిగా ఉండేవని తెలిపారు. ఈ రోజుల్లో ఎటు చూసినా ప్రైవేటు విద్యాలయాలు, పరాయి భాష మోజులేనని, బహుళ అంతస్తుల్లో నడిచే ఈ ప్రైవేటు బడులు, కాలేజీల్లో ఆట స్థలానికి ఆస్కారమే లేదని, లైబ్రరీలు అంతకంటే ఉండవని అన్నారు.

నేటి తరం శారీరక, మానసిక వికాసానికి ఈ తరహా విద్యాలయాలు, పెద్ద ప్రతిబంధకాలు అవుతున్నాయని, సోవియట్ లాండ్ అనువాద ప్రచురణలు తమ తరానికి ఎంతో మేలు చేశానని, వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఈ నెల 18వ తేదీన మొదలైన ఈ పుస్తక ప్రదర్శన నేటితో ముగుస్తుందని హైదరాబాద్ వంటి మహానగరంలో ఇలాంటి పుస్తక ప్రదర్శన నిర్వహించటం సామాన్య విషయమేమీ కాదని అన్నారు. ఎంతో మంది పుస్తక అభిమానులు, ఈ ప్రదర్శనను సందర్శించడం చూసి ఎంతో సంతోషం కల్గిందని వివరించారు. ఈ ప్రదర్శనకు వచ్చిన వారిలో ఎందరో యువతీ యువకులు కన్పించారని, యువతరం పుస్తకాలంటే ఆసక్తి చూపటం ఎంతో ఆశాజనకంగా ఉందని పేర్కొన్నారు.

పుస్తకం కనుమరుగవుతున్న నేటి రోజుల్లో ఇప్పటికీ కొన్ని వార్త ప్రతికలు ప్రతి వారం ఒక రోజైనా పుస్తక విమర్శలగురించి, రచనల గురించి పాఠకులకు తెలియజేయడానికి కొంత చోటు కేటాయిస్తున్నాయని, అలాంటి ప్రతికలకు అభినందనలు తెలియజేశారు. సరైన సమాచారం ప్రజలకు చేరాలంటే, ప్రజల్లో సామాజిక చైతన్యం రావాలంటే, వారికి చదువు, పుస్తకాలు అందుబాటులోకి తేవాలని, స్వాతంత్య్రానికి పూర్వమే అప్పటి నాయకులు నడుము కట్టారని గుర్తు చేశారు. యువతరాన్ని పుస్తక పఠనం వైపు మళ్లించేందుకు, అజ్ఞానం వల్ల వ్యాపించే పెడ ధోరణులను అరికట్టేందుకు మరోసారి తెలుగు నాట గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రారంభించాల్సిన అవసరమం ఉందనిపిస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ గుర్తు చేశారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు, సాహిత్య అకాడమీ చైర్మన్ జూరూరు గౌరీశంకర్ సాభాధ్యక్షత వహించిన ఈ సభకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర
ప్రభుత్వ సలహాదారు రమణాచారి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి చంద్రమోహన్, రాజేశ్వర్ రావు, కురెల్ల విఠలాచార్య, రచయితలు, సాహితీవేత్తలు, పుస్తక ప్రియులు తదితరులు పాల్గ్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed